పాలమూరులో మరిన్ని రిజర్వాయర్లు

  •     ఇప్పటికే పది రిజర్వాయర్ల నిర్మాణానికి గ్రీన్​సిగ్నల్ 
  •     ‘పాలమూరు' స్కీములోని ‘లక్ష్మీదేవిపల్లి’ నిర్మాణానికి సిద్ధం 
  •     ఎనిమిదేండ్లుగా పక్కకు పెట్టిన గత బీఆర్ఎస్ ​ప్రభుత్వం
  •     ఎంజీకేఎల్ఐ కింద రిజర్వాయర్లు   నిర్మాణానికి త్వరలో ప్రపోజల్స్​
  •     కోయిల్​సాగర్ ​కింద 2 లక్షల ఎకరాలకు సాగునీరు 

మహబూబ్​నగర్​, వెలుగు : కృష్ణా బేసిన్​లో తెలంగాణ వాటాకు సంబంధించి సాధ్యమైనంత వరకు నీటిని వినియోగించుకునేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఇందులో భాగంగా కృష్ణా ప్రాంతం ఎక్కువగా ఉండే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇరిగేషన్​ప్రాజెక్టుల డెవలప్​మెంట్​కు రాష్ర్ట సర్కారు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ‘కొడంగల్–​-నారాయణపేట’ స్కీం పరిధిలో పది రిజర్వాయర్ల నిర్మాణానికి గ్రీన్​సిగ్నల్ ఇవ్వగా, గత ప్రభుత్వం టేకప్​చేయని

‘పాలమూరు' స్కీములోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్​ను పూర్తి చేయడానికి సిద్ధమవుతోంది. అలాగే, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్​ఇరిగేషన్​ (ఎంజీకేఎల్ఐ) పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో నాలుగైదు టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్లు నిర్మించేందుకు ప్రపోజల్స్​రెడీ చేస్తోంది. కోయిల్​సాగర్, భీమా ఫేజ్​–1, ఫేజ్–​-2, నెట్టెంపాడు స్కీముల్లో పెండింగ్​పనుల పూర్తికి, అదనపు ఆయకట్టుకు సాగునీటిని అందించడంపై దృష్టి పెట్టింది.

భూ సేకరణకు ఆదేశాలు

తెలంగాణ ఏర్పాటు తర్వాత గత ప్రభుత్వం రాష్ర్టంలో మొదటి ప్రాజెక్టుగా ‘పాలమూరు-రంగారెడ్డి’ లిఫ్ట్​ ఇరిగేషన్​స్కీం(పీఆర్ఎల్ఐ)ను టేకప్​చేసింది. 2015, జూన్11న పనులు ప్రారంభించింది. స్కీం కింద నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్​, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉండగా, లక్ష్మీదేవిపల్లి పనులు పక్కకు పెట్టేసింది. ఈ స్కీం కింద మొత్తం 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాల్సి ఉండగా, ఒక్క లక్ష్మీదేవిపల్లి కిందే కల్వకుర్తి, షాద్​నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, పరిగి, చేవెళ్ల, పరిగి నియోజకవర్గాల్లోని 4.13 లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది.

అయితే, కెనాల్స్, రిజర్వాయర్​నిర్మాణ ప్రాంతాల్లో సినీ స్టార్లు, పొలిటికల్​లీడర్లు, ఇతర వర్గాలకు చెందిన పెద్దల  భూములుండడంతో భూ సేకరణ చేపట్టలేదు. దీంతో ఈ రిజర్వాయర్​పనులకు బ్రేక్​పడింది. ప్రస్తుతం కాంగ్రెస్​ ప్రభుత్వం ఈ రిజర్వాయర్​ను టేకప్​చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల ఇరిగేషన్​ఆఫీసర్లతో సమావేశమైన ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు రిజర్వాయర్​కు సంబంధించి భూ సేకరణ చేపట్టాలని ఆదేశించారు. సొంత జిల్లా కావడంతో త్వరలో దీనిపై సీఎం ఎనుముల రేవంత్​రెడ్డి రివ్యూ కూడా చేయనున్నట్లు తెలిసింది. 

నియోజకవర్గానికొక రిజర్వాయర్​ 

ఎంజీకేఎల్ఐ కింద ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లున్నాయి. వీటి కింద మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని కొంత ప్రాంతానికి సాగునీరందుతుంది. అయితే, ఈ స్కీములో మరిన్ని రిజర్వాయర్లు నిర్మించాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. దీని పరిధిలోని అచ్చంపేట, నాగర్​కర్నూల్​, కల్వకుర్తి, వనపర్తి, కొల్లాపూర్, జడ్చర్ల నియోజకవర్గాలుండగా, ఈ ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్ల నిర్మాణం సాధ్యసాధ్యాలపై ప్రపోజల్స్​ సిద్ధం చేయాలని ఇటీవల ఆదేశించింది. దీంతో ఆఫీసర్లు దీనిపై కసరత్తు ప్రారంభించారు.

కోయిల్ ​సాగర్​ కెపాసిటీ పెంపు

1966లో ప్రారంభించిన కోయిల్​సాగర్​ రిజర్వాయర్​పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్​ పెట్టింది. ఈ రిజర్వాయర్​కింద పాత ఆయకట్టు 12 వేలు మాత్రమే ఉండగా,  జలయజ్ఞంలో దానిని 52 వేల ఎకరాలకు పెంచారు. అయితే, మహబూబ్​నగర్​జిల్లాలో మరిన్ని మండలాలు, నియోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు జూరాల బ్యాక్​ వాటర్​నుంచి కోయిల్​సాగర్​కు 20 టీఎంసీలను తరలించేలా గతంలోనే ప్లాన్​ చేశారు. దాదాపు రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్లాన్​ చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ముందడుగు పడలేదు.

అధికారంలోకి వచ్చాక ఇందుకు సంబంధించిన ప్రపోజల్స్​సిద్ధం చేయాలని ఆ శాఖను ఆదేశించింది. అలాగే, ఉమ్మడి జిల్లాలోని పెండింగ్​స్కీముల పూర్తికి కావాల్సిన ఫండ్స్, ఆ స్కీములకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని రాష్ట్ర సర్కారు ఆదేశించింది. త్వరలో దీనిపై సీఎం కూడా రివ్యూ చేయనున్నట్లు సమాచారం.