32 లక్షల కుటుంబాల సర్వేకు సర్వం సిద్ధం

  • నేడు బల్దియా హెడ్డాఫీసులో ప్రారంభించనున్న మంత్రి పొన్నం 
  • 18,723 మంది ఎన్యుమరేటర్లు, 1870 మంది సూపర్ వైజర్లు నియామకం
  • డిసెంబర్ 8 లోపు సర్వే, డేటా ఎంట్రీ పూర్తి 

హైదరాబాద్ సిటీ/ఎల్బీనగర్/ఇబ్రహీంపట్నం, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే బుధవారం నుంచి మొదలుకాబోతోంది. గ్రేటర్​పరిధిలోని సర్వేను ఉదయం 9.30 గంటలకు జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులోని పన్వర్ హాల్ లో  హైదరాబాద్ జిల్లా ఇన్​చార్జ్​మినిస్టర్​పొన్నం ప్రభాకర్  లాంఛనంగా ప్రారంభించనున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, కలెక్టర్ అనుదీప్  పాల్గొననున్నారు. 

ఒక్కొక్కరికి 150 కుటుంబాలు

గ్రేటర్​లో మొత్తం 32 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ సర్వే కోసం మొత్తం 18,723 మంది ఎన్యుమరేటర్లు, 1,870 మంది సూపర్ వైజర్లను నియమించారు. ఒక్కో ఎన్యుమరేటర్​150 కుటుంబాల చొప్పున సర్వే చేయనున్నారు. ఈ నెల 8 వరకు ఇంటింటికీ తిరిగి, డోర్​కు స్టిక్కర్ అంటించి, ఇంట్లో ఉన్నవారికి మళ్లీ సర్వే కోసం ఎప్పుడు వస్తామో, ఏయే వివరాలు అందుబాటులో ఉంచుకోవాలో సూచిస్తారు. 9వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు సర్వే చేస్తారు. డిసెంబర్ 8లోపు సర్వేతోపాటు డేటా ఎంట్రీ పూర్తిచేసి 9న ప్రభుత్వానికి, బీసీ కమిషన్ కు రిపోర్ట్ అందజేయనున్నారు.

25 వరకు ఒంటి పూట బడులు

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ప్రైమరీ స్కూల్స్ టీచర్లను భాగస్వాములను చేయడంతో ప్రైమరీ స్కూల్స్ కు  ఈ నెల 25వ తేదీ వరకు ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఫుల్​డే నడిపించనున్నారు.  సమగ్ర సర్వేకు ఎల్బీనగర్ జోన్ పరిధిలోని కాప్రా, ఉప్పల్, హయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్ వాసులు సహకరించాలని జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ కోరారు. సిబ్బంది రూల్స్​ప్రకారం డేటా సేకరించాలని కోరారు. జోన్ పరిధిలో 53,5151 ఇండ్లు ఉండగా 5,348మంది సిబ్బందితో సర్వే చేయించనున్నట్లు తెలిపారు. సర్వే చేసేందుకు 4,246 సిబ్బంది అవసరం ఉండగా అదనంగా 1,102 మంది సిబ్బందిని అదనంగా ఉంచినట్లు తెలిపారు.

రంగారెడ్డి జిల్లాలో 6.57లక్షల కుటుంబాలు

రంగారెడ్డి జిల్లాలోని 6లక్షల57వేల కుటుంబాలను సర్వే చేసేందుకు 5,344 మంది ఎన్యూమరేటర్లను నియమించినట్లు కలెక్టర్​నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం కొంగరకలాన్ లోని కలెక్టరేట్​లో కలెక్టర్​మీడియాతో మాట్లాడారు. ప్రతి 10 మంది ఎన్యుమరేర్లకు ఒక సూపర్​వైజర్ ను నియమించామన్నారు. జిల్లా స్థాయి స్పెషల్ అధికారిని, జిల్లా స్థాయిలో సర్వే మానిటరింగ్ కోర్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా వివరాలు తెలియజేయాలని కోరారు.

ఇంట్లో ఎవరూ లేకపోతే..

ఫీల్డ్ సర్వే చేసేప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోయినా, లాక్​ఉన్నా వారి కోసం మరోసారి సర్వే చేయనున్నారు. ఇందులో తాళాలు ఉన్న ఇండ్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చిన తర్వాతే సర్వే చేయనున్నారు. అంతేకాకుండా ఇంటి పక్కన వారి ద్వారా అందుబాటులో లేనివారికి సమాచారం ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. ఎన్యుమరేటర్ కు అప్పగించిన 150 కుటుంబాల వివరాలు తప్పనిసరిగా సర్వే చేయాల్సి ఉంటుంది.