డ్రగ్స్​ కట్టడికి ప్రహరీ క్లబ్​లు ఇంకెప్పుడు?

  • నాలుగు నెలలు గడుస్తున్నా దృష్టి పెట్టని అధికారులు
  • చాలా స్కూళ్లు, కాలేజీల్లో ప్రహరీ క్లబ్బుల్లేవ్
  • హైదరాబాద్ జిల్లాలో మొత్తం 2,262 హైస్కూళ్లు,386 జూనియర్​ కాలేజీలు

హైదరాబాద్ సిటీ, వెలుగు : కేవలం ప్రభుత్వ స్కూల్స్​మాత్రమే కాదు. సిటీలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. గంజాయి చాక్లెట్లు, ఈ సిగరెట్లు, వైట్​నర్లు, మెడికల్ షాపుల్లో లభించే ఇతర మత్తును ఇచ్చే టాబ్లెట్లు, సిరప్స్​ వంటి వాటికి స్టూడెంట్స్​అలవాటు పడుతున్నారు. స్కూల్ దశలోనే పిల్లలు ఇలా పెడదారి పడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. డ్రగ్స్​పై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం స్కూళ్లు, కాలేజీల్లో ప్రహరీ క్లబ్బులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం జూలై  నెలలో సర్క్యూలర్​ కూడా విడుదల చేసింది.

4 నెలలు గడుస్తున్నా కొన్ని చోట్లనే

హైదరాబాద్ జిల్లాలో మొత్తం 2,262 ప్రభుత్వ, ఎయిడెడ్,  ప్రైవేట్, కార్పొరేట్ హైస్కూల్స్ ఉండగా, అందులో దాదాపు 5 లక్షల మంది స్టూడెంట్స్​చదువుకుంటున్నారు. ఇందులో 183 ప్రభుత్వ హై స్కూల్స్​ ఉన్నాయి. అయితే, ప్రహరీ క్లబ్బులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించి నాలుగు నెలలు గడుస్తున్నా.. జిల్లాలో ఇంతవరకు మెజారిటీ ప్రభుత్వ స్కూళ్లలో ప్రహరీ క్లబ్బులను ఏర్పాటు చేయలేదు. ప్రైవేట్ స్కూళ్లలో వీటిని పట్టించుకునే నాథుడే లేడనే విమర్శలూ వస్తున్నాయి.  

ఎన్ని స్కూళ్లు, కాలేజీల్లో  క్లబ్బులు​ ఏర్పాటు చేశారో కూడా అధికారుల వద్ద సమాచారం లేదు. డ్రగ్స్, గంజాయి ఎంత తీవ్రమైన సమస్యలో తెలిసినప్పటికీ... అధికారులు పెడచెవిన పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని 22 ప్రభుత్వ, 14 ఎయిడెడ్, 350 ప్రైవేట్​జూనియర్ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి. 

అసలేంటీ ప్రహరీ క్లబ్బులు?

స్కూళ్లు, కాలేజీల్లోని విద్యార్థులు డ్రగ్స్​ బారిన పడకుండా ప్రహరీ క్లబ్బులు నిఘా పెడతాయి. క్లబుల్లో స్కూల్​ హెచ్ఎం, కాలేజీ ప్రిన్సిపల్ ప్రెసిడెంట్​గా, సీనియర్ ​టీచర్, లెక్చరర్ వైస్​ ప్రెసిడెంట్​గా ఉంటారు. మెంబర్లుగా ఆరు నుంచి పదో తరగతి మధ్య చదువుతున్న చురుకైన ఇద్దరు స్టూడెంట్స్, స్థానిక పోలీస్​ స్టేషన్ నుంచి ఒక పోలీస్, టీచర్, పేరెంట్ అసోషియేషన్ ​నుంచి ఒకరు ఉంటారు.

వీరు ఎన్​జీవోల సహకారంతో ప్రతినెలా స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన సమావేశాలు నిర్వహించాలి. స్కూల్, కాలేజీ పరిసరాల్లో మత్తు పదార్థాల అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థల ప్రాంగణాల్లో ‘నోడ్రగ్స్’​ బోర్డులు ఏర్పాటు చేయాలి.

ఖైరతాబాద్​లోని ఓ గవర్నమెంట్ హైస్కూల్​లో కొందరు స్టూడెంట్స్​ గంజాయి చాక్లెట్లు తీసుకుంటూ ​టీచర్లకు దొరికారని తెలుస్తోంది. ఆ పిల్లల పేరెంట్స్​ను టీచర్లు పిలిపించి కౌన్సిలింగ్ ​నిర్వహించారని సమాచారం. ఈ విషయం బయటకు పొక్కకుండా గోప్యత పాటించారు.

నాంపల్లి మండలంలోని ఓ గవర్నమెంట్ స్కూల్​లో నలుగురు పిల్లల ప్రవర్తనపై టీచర్లకు అనుమానం వచ్చింది. వారిని కొన్ని రోజులు గమనించిన టీచర్లు ఒక రోజు వారి బ్యాగులను చెక్​ చేశారు. వారి బ్యాగుల్లో నిషేధిత ఈ సిగరెట్లు దొరికాయి. ఆ పిల్లల పేరెంట్స్​ను  స్కూల్ హెచ్ఎం పిలిపించి కౌన్సిలింగ్​ ఇచ్చారు.