ఘనంగా దశాబ్ది వేడుకలు..అర్హులందరికీ ప్రగతి ఫలాలు

వనపర్తి : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసిన అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాల సాధన దిశగా అందరం కృషి చేయాలని వనపర్తి కలెక్టర్  తేజస్  నందలాల్ పవార్ పేర్కొన్నారు. ఐడీవోసీ ఆవరణలో  ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి, అడిషనల్  కలెక్టర్  సంచిత్  గంగ్వార్ తో కలిసి అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సామాజిక న్యాయం, ఆర్థిక ఫలాలు అందించేందుకు కృషి చేయాలన్నారు.

ప్రజాపాలనలో భాగంగా ప్రతి పల్లెకు, బస్తీకి అధికారులు వెళ్లి గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారని చెప్పారు. వనపర్తి జిల్లాలో 61 లక్షల మంది మహిళలు ఆర్టీసీ ఉచిత బస్సు  పథకాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. రైతు భరోసా కింద జిల్లాలో 1,74,993 మంది రైతులకు రూ.180.50 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని, ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు.

జిల్లాలోని అన్ని స్కూళ్లలో సౌలతులు కల్పిస్తామని తెలిపారు. జడ్పీ చైర్మన్  లోక్ నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, మున్సిపల్  చైర్మన్  పుట్టపాకుల మహేశ్, ఎంపీపీ కిచ్చారెడ్డి, ఆర్డీవో పద్మావతి పాల్గొన్నారు.

 ప్రజల ఆకాంక్షలకు పెద్దపీట

గద్వాల : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు పెద్దపీట వేస్తుందని గద్వాల కలెక్టర్  సంతోష్  పేర్కొన్నారు. కలెక్టరేట్ లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఎస్పీ రితిరాజ్, జడ్పీ చైర్ పర్సన్  సరితతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ జ్యోతి పథకం ద్వారా ఫ్రీ కరెంట్, మహాలక్ష్మి స్కీం ద్వారా మహిళలకు ఫ్రీ బస్​ జర్నీ అందించడం జరిగిందన్నారు. అంతకుముందు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. తొలి దశ ఉద్యమంలో పాల్గొన్న పాశం సర్వారెడ్డి, వేణుగోపాల్  విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తెలంగాణ అమరవీరుల కుటుంబసభ్యులను సన్మానించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, సర్కార్  బడుల్లో మంచి మార్కులు సాధించిన స్టూడెంట్లకు ప్రశంస పత్రాలు అందించారు. ఎస్పీ ఆఫీస్​లో ఎస్పీ రుతిరాజ్, జడ్పీ చైర్ పర్సన్  సరిత తన క్యాంప్  ఆఫీస్ లో జాతీయ జెండాను ఎగురవేశారు.

వ్యవసాయరంగంపై ఫోకస్

నాగర్ కర్నూల్ టౌన్: రైతులు ఆదర్శంగా ఉండేలా ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను రూపొందిస్తోందని నాగర్ కర్నూల్  కలెక్టర్  పి. ఉదయ్ కుమార్  తెలిపారు. పోలీస్ పరేడ్​ గ్రౌండ్ లో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛ, సామాజిక న్యాయం పాటించి అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. రైతు భరోసా కింద జిల్లాలో 7.38 లక్షల ఎకరాలకు రూ.369.21 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.

రైతు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమం చేపట్టిందని, తొలి విడతగా జిల్లాలోని 4 రైతు వేదికల నుంచి రైతులు వీడియో కాన్ఫరెన్స్  ద్వారా రాష్ట్ర అధికారులు, వ్యవసాయ నిపుణులతో ముఖాముఖి మాట్లాడే ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్​రెడ్డితో కలిసి తెలకపల్లి మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ అమరవీరుడు జంగం శంకర్  కుటుంబసభ్యులను సన్మానించారు. ఎస్పీ గైక్వాడ్  రఘునాథ్  వైభవ్, అడిషనల్​ కలెక్టర్  కుమార్ దీపక్  పాల్గొన్నారు.

అమరుల త్యాగాలు మరువలేనివి..

నారాయణపేట : రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని నారాయణపేట కలెక్టర్  కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్ ఆవరణలోని అమరవీరుల స్థూపం వద్ద ఎస్పీ యోగేశ్​ గౌతమ్ తో కలిసి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల ఆశయాలు, ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని, జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అడిషనల్​ కలెక్టర్  అశోక్ కుమార్, అడిషనల్  ఎస్పీ నాగేంద్రుడు, ఆర్డీవో మధుమోహన్  పాల్గొన్నారు. 

పాలమూరులో..

మహబూబ్ నగర్ కలెక్టరేట్ : పట్టణంలోని ఆర్అండ్ బీ గెస్ట్​ హౌస్​ వద్ద ఉన్న అమరవీరుల స్ధూపానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి ఏ వాణి ప్రసాద్, కలెక్టర్  జి రవినాయక్, అడిషనల్​ కలెక్టర్  శివేంద్ర ప్రసాద్  పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టరేట్  ఆవరణలో అడిషనల్​ కలెక్టర్  జాతీయ పతాకాన్ని ఎగరవేసి, పో లీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రాల్లో జరిగిన వేడుకల్లో కలెక్టర్లు జాతీయ జెండాను ఎగరవేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు జెండాను ఆవిష్కరించి రాష్ట్రాభివృద్ధికి కలిసికట్టుగా పాటుపడదామని పిలుపునిచ్చారు. విద్యార్థులు, కళాకారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ ఫొటోలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఆవిర్భావ వేడుకలతో ఊరూవాడా సందడి నెలకొంది.      

 -వెలుగు, నెట్​వర్క్