రుణమాఫీ కాని అకౌంట్లు సరిచేస్తున్నరు

  • అర్హత ఉన్నా రుణమాఫీ కాని రైతులకు న్యాయం
  • రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 30వేల అప్లికేషన్ల స్వీకరణ
  • రూల్స్ ప్రకారం ఉన్నవన్నీ తీసుకుంటున్న ఆఫీసర్లు 
  • ఇప్పటివరకు 10 వేల దరఖాస్తులకు క్లియరెన్స్
  • అర్హులందరికీ మాఫీ చేసేందుకు సిద్ధమైన సర్కారు
  • ప్రతిపక్షాల విమర్శలకు చెక్​పెట్టేలా వేగంగా ప్రక్రియ

హైదరాబాద్, వెలుగు : ఇప్పటివరకు చేసిన రెండు విడతల్లో వివిధ కారణాలతో రుణమాఫీ కాని రైతులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్​సర్కారు సిద్ధమైంది. నిబంధనలకు అనుగుణంగా ఉండి క్రాప్​లోన్లు మాఫీ కాని రైతులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ల నుంచి ఇప్పటికే మండలాల్లోని అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా ప్రభుత్వం ఫిర్యాదులను స్వీకరించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 30 వేల ఫిర్యాదులు రాగా, 10 వేల ఫిర్యాదులను ఆఫీసర్లు సరిచేశారు. మరో 20 వేల అకౌంట్లను స్క్రూటినీ చేసి, అర్హులందరికీ రుణమాఫీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, పంద్రాగస్టు నాటికి రూ.2 లక్షల వరకు ఉన్న క్రాప్ ​లోన్ల మాఫీకి సంబంధించిన లబ్ధిదారుల జాబితా కూడా ఆఫీసర్లు రెడీ చేస్తున్నారు.

గైడ్​లైన్స్​కు అనుగుణంగా ఉంటేనే..

రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కొన్ని గైడ్​లైన్స్ రూపొందించింది. డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 మధ్య పంటరుణాలు తీసుకుని ఉండాలనేది ప్రధాన నిబంధన. దీనికి విరుద్ధంగా నిర్ణీత కాలపరిమితికి ముందుగానీ, గడువు తర్వాత గానీ తీసుకున్న రైతుల పంట రుణాలు మాఫీ కాలేదు. అలాగే, నిబంధనల మేరకు ఈ ఐదేండ్లలో పంటరుణం తీసుకుని ఆ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తే వాళ్లకు సైతం మాఫీ వర్తించదు. డిసెంబర్ 8, 2023 నాటికి లోన్ ఖాతాలో ఉన్న అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత ఉంటే అంత మాత్రమే మాఫీ అయింది. ఉదాహరణకు రూ.లక్ష రుణం తీసుకున్న వ్యక్తి డిసెంబర్​ 9, 2023 నాటికి రూ.50 వేలు చెల్లిస్తే నిబంధనల ప్రకారం అతనికి ఇప్పుడు రూ.50 వేలు మాత్రమే మాఫీ అయింది.

బ్యాంకు నుంచి లోన్ తీసుకొని చెల్లించేందుకు వీలుగా రీషెడ్యూల్ చేసుకున్న వాళ్లకు కూడా రుణమాఫీ వర్తించదు. గతంలోనూ ఇదే నిబంధన అమలవుతూ వచ్చింది. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్లకు కూడా పంట రుణాల మాఫీ జరగలేదు. ఇలా నిబం ధనలకు విరుద్ధంగా ఉండి, తమకు రుణమాఫీ కాలేదని వస్తున్న ఫిర్యాదులను ఆఫీసర్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు. కేవలం రేషన్ కార్డులో పేరులేని రైతులు, రేషన్ కార్డులో పేరు ఉండి ఆధార్ లింక్ కానివాళ్లు, క్రాప్ లోన్ తీసుకున్న రైతు చనిపోతే వారి కుటుంబ సభ్యుల పేరిట పట్టాదారు పాసుబుక్ లేనివాళ్లు, క్రాప్ లోన్ అకౌంట్

ఆధార్ కార్డులో పేర్లు వేర్వేరుగా ఉన్నవాళ్లు, బ్యాంకుల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఆధార్​లో ఉన్న పేరు బ్యాంకు అకౌంట్​లో ఉన్న పేరుకు మిస్ మ్యాచింగ్ కావడం, పేర్లలో, ఆధార్, పాస్​బుక్ నంబర్లలో తప్పొప్పుల కారణంగా రుణమాఫీ కానివాళ్లు సరైన ఆధారాలతో దరఖాస్తు చేస్తే వాటిని పరిష్కరించి, రుణమాఫీ మొత్తాన్ని ఖాతాల్లో జమచేసేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు.  

మూడో విడత లబ్ధిదారుల జాబితా రెడీ

రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రెండు విడతల్లో కలిపి మెుత్తం 17.75 లక్షల మంది రైతులకు రూ.12,224 కోట్ల లోన్లు మాఫీ చేసింది. ఇక ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల లోపున్న పంట రుణాలను మాఫీ చేసేందుకు మూడో విడత జాబితాను ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మూడో విడత రుణమాఫీకి రూ.10 వేల కోట్లకుపైగా అవసరం అవుతాయని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మొత్తంలో 70 శాతానికి పైగా ఫండ్స్​ను ఇప్పటికే ఆర్థిక శాఖ రెడీ చేసుకున్నది. మంగళవారం మరో రూ.3 వేల కోట్లు సర్దుబాటు చేయనుంది. ఇందుకోసం రిజర్వ్​ బ్యాంకు నుంచి లోన్ కోసం ఇండెంట్ పెట్టింది.