తెలంగాణ ఆత్మగౌరవం ఎవరి పేటెంటూ కాదు

బతికి ఉన్న మనుషుల గురించి కాకుండా ఇటీవల విగ్రహాల విషయాలపైన వాద వివాదాలు,  నాయకుల మధ్య చర్చోపచర్చలు జరుగుతున్నాయి.  ఈ చర్చలోకి వెళ్లేముందు ఆత్మగౌరవం అదీ తెలంగాణ ఆత్మగౌరవం ఎవరి పేటెంటూ కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.  ఎవరైనా క్లెయిమ్ చేసుకుందామనుకున్నా అది చెల్లనేరదని గుర్తించాలి. ఈ నేపథ్యంలోనే  ఈ వ్యాసం మరింత ముందుకుపోవాలంటే తప్పకుండా 'నేటి'నే కాదు 'నిన్న'టిని కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడే స్పష్టత ఏర్పడుతుంది. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకొని వివేచనతో ఆలోచిస్తే కానీ విగ్రహాల ఆవిష్కరణ వివాదాల మూలాలు తెలుస్తాయి. అంతకుముందు గత పది సంవత్సరాలుగా కాళోజీ కళాక్షేత్ర నిర్మాణాన్ని అర్ధంతరంగా ఎందుకు నిలిపివేశారో విమర్శించేవారు తెలపాలి.  

కోల్పోయిన నైతికత

తెలంగాణ ఆత్మగౌరవమని గుద్దుకునేవాళ్ళు అంతకుముందు తెలుగుతల్లి కూడలిలో  తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు.. ఎవరు అడ్డుకున్నారో  చెప్పవలసిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులపైన ఉన్నది.  ఇక రైతుల రెండు లక్షల రుణమాఫీ గురించి హరీష్ రావు గతంలో చేసిన నిర్వాకం  ఏమిటో రైతు లోకానికి చెప్పవలసిన బరువు బాధ్యతలు  కేసీఆర్ పైన ఉన్నాయి.  ధరణి  తెచ్చి తెలంగాణ నేలతల్లిని ఎలా చెర పట్టిండ్రో,  రైతుబంధు పేరుమీద  రూ.73 వేల కోట్ల ప్రజాధనం  దుర్వినియోగంపై  ప్రజాకోర్టు అనే బోనులో నిలబడి కారణాలను చెప్పాలి. వేలాదిమంది కౌలు రైతులు ఆత్మహత్యలు మీ కళ్ళకు కనబడవు. ఆత్మబలిదానం చేసుకున్న చేనేత కార్మికుల చావులను నమోదు చేయకుండా  విఫలయత్నం చేసి,  ఇప్పుడు  నెత్తి నోరు ఎందుకు బాదుకుంటున్నడో  ఆ నాయకుడు పద్మశాలీలకు తెలపాలి.

ఎత్తుగడలు చిత్తు

తనకు తానే పెద్ద రాజనీతిజ్ఞుడుగా భావించే కేసీఆర్  ప్రజాస్వామ్యంలో చర్చకు చోటు ఇవ్వని నిర్ణయాలు, రాత్రికి రాత్రి ఆయన మెదడులో వికసించిన పథకాల  వ్యూహరచనలు,  మిగతా పార్టీలను బోల్తా కొట్టించే  ఎత్తుగడలు,  బీఆర్ఎస్ పార్టీ అధికారానికి చేరువచేసే ఇంజక్షన్ అని భావించిన పథకాలు.. కొన్ని ఏండ్లవరకు కోలుకోలేకుండా వికటించాయి.  ప్రజాక్షేత్రంలో అభిప్రాయం ఇలా ఉంటే  ఇక  కేసీఆర్ మౌనముద్రలోకి వెళ్లిపోయారు. ఇక పార్టీలో మిగిలిన కేటీఆర్,  హరీష్ రావు పదేండ్ల కాలంలో వీరి వీరి మంత్రిత్వశాఖలలో వెలగబెట్టిన రీతులు, నీతులు  అందరికీ తెలిసినవే.  వీరికి ఏమాత్రం నచ్చని వాక్యం రాసినవారు తెలంగాణ వ్యతిరేకులుగా ముద్ర వేసి చిత్రీకరించారు.  గత ప్రభుత్వంలో వివిధ పదవులలో ఉన్నప్పుడు జ్ఞాపకంరాని బీసీ వాదాన్ని ఇటీవల కొందరు తలకెత్తుకుంటే దానికి ఏపాటి సాధికారికత ఉంటుందో .. వారితోపాటు  వారిని మాధ్యమాల ద్వారా ప్రోత్సహిస్తున్నవారు కూడా చెప్పాలి.

ప్రజాక్షేత్రంలో పనిచేయాలి

గతంలో  ప్రభుత్వ ధనం వ్యయపరిచి కేసీఆర్ ప్రభుత్వం కులగణన చేసి తన దగ్గర పెట్టుకొని ఆడిన రాజకీయ ఆటలు, ఎత్తుగడలు, ఒంటెద్దు పోకడలును నాడు అడగని వారు నేటికీ ప్రశ్నించనివారు  ఇప్పుడు  మరొకసారి పప్పులో కాలువేస్తున్నారు.  అది ఎలా అంటే బహుజన వాదాన్ని బహుముఖంగా విస్తరింప చేయాల్సిన వేళ వెనుకబడిన వర్గాలు ఉద్ధారకులులాగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. వీరు ఏబీసీడీలు రాని సామాజిక అధ్యయన నిరక్షరాస్యులుగా మిగిలిపోనున్నారు. ఇది కఠోర సత్యం.  మేనేజ్ చేయడం వేరు,  కనికట్టు మ్యాజిక్ చేయడం వేరువేరుగా  గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రెండింటి మధ్య ఉన్న విభేదాన్ని గుర్తించి ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలో పనిచేయాల్సిన అవసరం ఉంది.  రాజకీయ నాయకులు కాదు మేధావులకు సైతం ఇక కప్పదుంకులు, దాటవేతలు ఇక పొసగవు, ఇకముందు సాగవు.  ఐదేండ్లకోసారి ప్రజలు ప్రభుత్వాల పనితీరును గమనిస్తారని మనం ఎల్లెడలా మదిలో ఉంచుకుని ప్రస్తుత అత్యాధునిక సాంకేతిక ముంగిట్లో మసులుకోవాలి. 

అపరిపక్వ రాజనీతి 

ఇటీవల విచిత్రంగా ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు.. బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు కేటీఆర్, హరీష్ రావు  ప్రవర్తిస్తున్నారు. కేటీఆర్ ఎక్స్ ద్వారా టెక్స్ట్ ను కాంగ్రెస్ అధినాయకత్వానికి అంటే  రాహుల్ గాంధీకి పంపడంలో అర్థం ఏమిటి?  అలాగే ఆ పార్టీ నాయకుడు  ట్రబుల్ షూటర్, డబుల్ బెనిఫిటర్ హరీష్ రావేమో  ఖర్గేకి ఉత్తరం రాయడం చూస్తుంటే  దేన్ని సంకేతిస్తున్నదో ఈ నాయకులే ప్రజలకు చెప్పాలి.  దీన్ని లోతుగా అవలోకిస్తే అపరిపక్వ రాజనీతిజ్ఞత  కనిపిస్తుంది.  ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు తమ పార్టీపై దింపుడుకల్లం ఆశైనా కోల్పోయి ఉండాలనిపిస్తున్నది. దీనికి  బీఆర్ఎస్​ అధినాయకుడుతో సహా పైన చెప్పిన ఇద్దరు నాయకులు తమతోటి ఎమ్మెల్యే లకు ,  తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి.  వీటి వెనకనున్న మర్మ ఖర్మాల గురించి సూటిగా తెలియజేయాలి.  అప్పుడు కానీ విగ్రహాల స్థాపన వివాదాలపైన మతలబు ఏమిటో  స్పష్టంగా తెలుస్తుంది. 

జూకంటి జగన్నాథం