అమరుల త్యాగఫలమే తెలంగాణ 

  • ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో మంగళవారం ఘనంగా జరిగింది. శాసన మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీసీ కమిషన్​ చైర్మన్ నిరంజన్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ పందర్భంగా తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అమరుల త్యాగాల కారణంగా తెలంగాణ సిద్ధించిందని తెలిపారు. వారి ఆశయానికి అనుగుణంగా  ప్రజాపాలనలో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ప్రజాపాలన దినోత్సవం స్టూడెంట్స్​ ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. 

అభివృద్ధిలో ముందుకు..

అమరుల త్యాగఫలంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగుతోందని శాసనమండలి చైర్మన్​గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా యాదాద్రి కలెక్టరేట్​లో ఆయన జాతీయ జెండావిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం నిర్వహించిన సాయుధ రైతాంగ పోరాటంలో ప్రాణాలర్పించిన అమరులను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రలో హైదరాబాద్​విలీనం గురించి వివరించారు. ఆంధ్ర పాలకుల నిరంకుశ విధానాలకు వ్యతిరేకిస్తూ నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ నినాదాలతో 1969లో మొదలైన తెలంగాణ ఉద్యమం సుదీర్ఘకాలం 2014 వరకూ కొనసాగిందన్నారు.

తొలి, మలి దశ ఉద్యమాల్లో ప్రాణత్యాగాలు చేసిన 1450 మందిని గుర్తు చేసుకున్నారు. వారి ప్రాణత్యాగాల అనంతరం 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అన్ని రంగాల్లో రాష్ట్రం ప్రగతి పథంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్​కుమార్ రెడ్డి, మందుల సామెల్, కలెక్టర్​హనుమంతు జెండగే, డీసీపీ రాజేశ్ చంద్ర, మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్లు గంగాధర్, బెన్ షాలోమ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.     

నాటి అమరుల త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ..

పోరాటాలకు పురిటి గడ్డ ఉమ్మడి నల్గొండ జిల్లా అని, నాటి అమరుల త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అని బీసీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ జి.నిరంజన్ అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా  సూర్యాపేట కలెక్టరేట్​లో జరిగిన వేడుకల్లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు పుష్పాంజలి ఘటించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం నిరంజన్ మాట్లాడుతూ రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు నాంది పలికి అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు జోహార్లు తెలిపారు. నేటి స్వేచ్ఛ, స్వాతంత్య్రం మన సొంతం కావటానికి ఎంతో మంది ఈ గడ్డ మీద  ప్రాణత్యాగాలు చేశారని, ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది అని చెప్పారు.

రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైందని తెలిపారు. కాంగ్రెస్  ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేసిందన్నారు. సూర్యాపేట జిల్లాలో 1.54 లక్షల మందికి రూ.838.69 కోట్లు మాఫీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత,  జడ్పీ సీఈవో అప్పారావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

సాయుధ పోరాటంలో జిల్లా కీలక పాత్ర.. 

తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ జిల్లా కీలకపాత్ర పోషించిందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ జిల్లా నుంచి భీంరెడ్డి నరసింహారెడ్డి, బొమ్మగాని ధర్మ భిక్షం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, జిట్టా రామచంద్రారెడ్డి, కట్కూరి రామచంద్రారెడ్డి, సుశీలాదేవి, సుద్దాల హనుమంతు, బొందుగుల నారాయణరెడ్డి లాంటి ఎందరో స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రభావితం చేశారని తెలిపారు. ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైందన్నారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 1 కీలకమైన రోజని, నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి పొందిన రోజు సెప్టెంబర్ 17 అని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్​, అధికారులు తదితరులు పాల్గొన్నారు.