స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లే తెలంగాణ ప్రాధాన్యత

 భారతదేశంలో స్వాతంత్య్రం రాకముందు బ్రిటీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్‌‌‌‌ ఉన్నప్పుడు బ్రిటీష్‌‌‌‌ ఇండియా రూల్‌‌‌‌లో ఏడుసార్లు కులగణన జరిగింది.  కులగణన వేరు. జనాభా (సెన్సస్‌‌‌‌) లెక్కలు వేరు. ఏ కులం? ఎంత జనాభా దేశంలో ఉందో చెప్పడానికి 1871లో  గణన ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి పదేండ్లకూ కులగణన జరిగింది. 1871, 1881.. ఇలా చివరగా 1931 వరకూ కొనసాగింది. 1891 కులగణన ఆధారంగా సాహు మహారాజ్‌‌‌‌ కొల్లాపూర్‌‌‌‌ సంస్థానంలో 1902 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో 50శాతం రిజర్వేషన్లు అమలు చేశారు.

 అందులో హిందూ, ముస్లిం అంటూ మతపరమైన లెక్కలు తప్ప హిందువుల్లోని వివిధ జాతులకు సంబంధించిన నిర్దిష్ట లెక్కలేవీ తేల్చలేదు. ఆడ, మగ అన్నంతవరకే గణించారు. 1950లో రాజ్యాంగం అమలు తర్వాత కులగణన చేపట్టలేదు. కానీ, రాజ్యాంగం మాత్రం సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొంది.

 కులగణన లేకపోతే రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, ఇతర సౌకర్యాలు ఎలా అమలుచేసేదంటూ రాష్ట్రాలు అడగడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే 1954లో కాకా కలేల్కర్‌‌‌‌ కమిషన్‌‌‌‌ తెచ్చినా అమలు కాలేదు. 1961 తర్వాత రాష్ట్రాలు కేంద్రానికి లేఖ రాయగా.. ‘అది మా పాలసీ కాదు. బ్యాక్‌‌‌‌వర్డ్‌‌‌‌ క్లాసెస్‌‌‌‌కు రిజర్వేషన్‌‌‌‌ ఇవ్వలేం. మీమీ రాష్ట్రాల్లో మీరే కమిషన్‌‌‌‌ వేసి నిర్ణయం తీసుకోవచ్చు’ అని కేంద్రం స్పష్టం చేసింది. 

ప్రతి రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం కమిషన్​

ప్రతి రాష్ట్రంలో కమిషన్‌‌‌‌ ఏర్పాటు చేసుకుని రిజర్వేషన్లు కొనసాగించడం మొదలుపెట్టారు. ఉమ్మడి ఏపీలో అనంతరామన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ ఏర్పాటు చేసి 1972 నుంచి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్‌‌‌‌ ఇచ్చారు. అలాగే ప్రతి రాష్ట్రంలో జరిగింది. బిహార్‌‌‌‌లో ముంగేరిలాల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ పెట్టారు.  మోస్ట్‌‌‌‌ బ్యాక్‌‌‌‌వర్డ్‌‌‌‌ కులాలను గుర్తించి 1991 నుంచి (కర్పూరీ ఠాకూర్‌‌‌‌ ఉన్నప్పుడు) అతివెనుకబడిన కులాల వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్లు కేటాయిస్తున్నారు. 

అయితే, ప్రతి రాష్ట్రంలో బీసీ కమిషన్లు ఉండగా.. నిరంతరం పరిశీలన చేసి, ఏకులం సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడ్డాయో నిర్ణయించి సిఫార్సు చేస్తుంటాయి. ఆ విధంగా కులాలను కలుపుతున్నారు. 2011లో కులగణన జరిగినా పబ్లిష్​ చేయలేదు స్వాతంత్య్రం అనంతరం కులగణన ఎక్కడా జరగలేదు. కేవలం జనాభా లెక్కలు మాత్రమే చేశారు. 2011లో మొదటిసారి జాతీయస్థాయిలో కులగణన జరిగినా దానిని పబ్లిష్‌‌‌‌ చేయలేదు.

 ఏ రాష్ట్రంలోనూ కులగణన చేయలేదు. మండల కమిషన్‌‌‌‌ 1980లో 1931 కులగణన ఆధారంగా రిపోర్ట్‌‌‌‌ ఇచ్చింది. ఈ మేరకు 52శాతం బీసీల సంఖ్య ఉన్నట్టు తెలిసింది. ఈ ప్రకారంగా 52శాతం ఉన్న బీసీలకు 1993 నుంచి 27శాతం రిజర్వేషన్‌‌‌‌ అమలు చేస్తూ వచ్చారు. అందులోనూ క్రిమిలేయర్‌‌‌‌ ఆధారంగా 27 శాతం రిజర్వేషన్‌‌‌‌ అమలు కాలేదు. ఈ కేసు 1992లో సుప్రీం కోర్టులో జడ్జిమెంట్‌‌‌‌ అయ్యింది. 

బీసీలకు 13శాతం తగ్గిన రిజర్వేషన్​

1992లో లోకల్‌‌‌‌ బాడీస్‌‌‌‌లో రిజర్వేషన్‌‌‌‌ కల్పించాలా అన్న చర్చ జరిగింది.  ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో ఉన్నా స్థానికసంస్థల్లో రిజర్వేషన్‌‌‌‌ లేదు. దీంతో 1992లో రాజ్యాంగం అమెండ్‌‌‌‌ చేసి ఎస్టీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన, బీసీలకు మాత్రం ఆయా రాష్ట్రాలవారీగా వాళ్లే చట్టంచేసి అమలుపరచాలని రాజ్యాంగంలోని 242 డి6, 242 టి6లో  చేర్చారు. ఏపీ పంచాయతీరాజ్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ 1994 ప్రకారం 33, 34 శాతం రిజర్వేషన్‌‌‌‌ ఉండగా.. అవి లోకల్‌‌‌‌ బాడీస్‌‌‌‌లో 50శాతం దాటొద్దని అభ్యంతరాలు వచ్చాయి. ఈ అంశంలో 2012లో తీర్పు వచ్చినా అమలు పరచలేదు. 

హైకోర్టుకు ఈ కేసు వెళ్లినప్పటికీ 50శాతం రిజర్వేషన్‌‌‌‌ దాటలేదు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌ ఆర్డినెన్స్‌‌‌‌ ద్వారా 33 నుంచి 20శాతం అమలుపరిచారు. ఏపీలోనూ అదే జరిగింది. దీంతో బీసీలకు 13శాతం రిజర్వేషన్‌‌‌‌ తగ్గింది.  గతేడాది బిహార్‌‌‌‌లో మొదటిసారి కులగణన చేపట్టడం గమనార్హం. అసెంబ్లీలో తీర్మానించి, అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. 2022లో మొదలుపెట్టినప్పుడు అనేక ప్రశ్నలొచ్చినా దానిపై సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వలేదు.

స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్​ ఇవ్వొచ్చు

బిహార్​లో ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు 85శాతంగా తేల్చితే.. అందులో అందరికీ కలిపి 65 శాతం మాత్రమే కేటాయించారు. ఇది గతంలో 50 శాతం మాత్రమే ఉండేది.  మొత్తం 15 శాతమే పెంచారు. దీన్ని బిహార్‌‌‌‌ హైకోర్టు కొట్టివేయగా.. కేసు ప్రాధాన్యతను గుర్తించి తీర్పును సవాల్‌‌‌‌ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేసింది. ఏఐబీసీ తరఫున కూడా అప్పీలు చేశాను. ఈ రెండు పిటిషన్లు వచ్చేవారం విచారణకు వచ్చే అకాశముంది. బిహార్‌‌‌‌ కేసుతో బీసీల కులగణన అంశాన్ని జతకట్టి  ప్రత్యేకంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించబోతు న్నాను. అత్యంత కీలకమైన అంశమిది.

తెలంగాణ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి

తెలంగాణలోని కాంగ్రెస్‌‌‌‌ సర్కారుకు నేనొక విజ్ఞప్తి చేస్తున్నా.  రాష్ట్రంలో కులగణన చేయాలనుకుంటే  వారం రోజుల్లో  చేయొచ్చు.  సమగ్ర కుటుంబ సర్వే ఒక్కరోజులోనే చేశారు. 2011 లెక్కలు, అలాగే సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ఆధారంగా హౌస్‌‌‌‌హోల్డ్‌‌‌‌ లెక్కలతో పాటు కులగణన సమగ్రమైన సర్వే ఒక వారంలో సేకరించవచ్చు. ఈ రకంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల వరకు కులగణన తీసి కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్‌‌‌‌ ఇవ్వొచ్చు. కులగణన జరగకపోతే 20శాతం రిజర్వేషన్‌‌‌‌ కూడా దాటదు. కాంగ్రెస్‌‌‌‌కు చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు ఇదో చక్కని అవకాశం.  నా ప్రత్యేక విన్నపం కూడా..!

- జస్టిస్‌‌‌‌ ఈశ్వరయ్య, పూర్వ ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి