ఏక్​ఫస్​లా పట్టాలతోనే చెరువులకు ఎసరు

  • అయినా 31 వేల ఎకరాల శిఖం భూములకు అసలు పట్టాలు
  • 2017లో భూరికార్డుల ప్రక్షాళన సమయంలో అక్రమాలు
  • పర్మినెంట్ పట్టాలుగా మార్చిన అధికారులు
  • ధరణిలోకి కూడా ఎక్కడంతో.. యథేచ్ఛగా అమ్మకాలు, కొనుగోళ్లు

కరీంనగర్, వెలుగు: యాసంగిలో చెరువులు, కుంటల్లో నీరు తగ్గిన తర్వాత శిఖం భూముల్లో ఒక పంట పండించుకునేందుకు గతంలో ఇచ్చిన ఏక్ ఫస్ లా పట్టాలను అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. వీరికి కొందరు రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు సహకరించడంతో ఏక్ ఫస్ లాను అసలు పట్టాలుగా చూపుతూ శిఖం భూముల్లో యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. మరికొందరు శిఖం పక్కనే ఉన్న పట్టా భూములు కొనుగోలు చేసి.. పట్టా భూమిలో శిఖాన్ని కలిపేసి లేక్ వ్యూ వెంచర్ అంటూ ప్లాటింగ్ చేస్తున్నారు. దీంతో చెరువులు కుంచించుకుపోతున్నాయి. శిఖం భూమి ఏదో.. పట్టా భూమి ఏదో తెలియని జనం కొనుగోలు చేసి మోసపోతున్నారు. ఇలాంటి ప్లాట్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండ్ల నిర్మాణం చేపట్టకుండా ఉమ్మడి ఏపీలోనే ప్రభుత్వం కఠినమైన నిబంధనలు రూపొందించినప్పటికీ.. ఆఫీసర్ల కక్కుర్తి కారణంగా ఈ రూల్స్ అమలు కావడం లేదు. 

Also Read:-ఆక్రమణదారులకు ముందు నోటీసులు ఇవ్వండి

కఠినంగా నిబంధనలు 

రాష్ట్రవ్యాప్తంగా 43,412 చెరువులు, కుంటలు ఉండగా వీటి కింద 21 లక్షల ఎకరాలు సాగవుతోంది. అయితే ఈ చెరువులు, కుంటలు, నాలాలు, ఇతర నీటి వనరుల వెంట బిల్డింగ్స్ నిర్మాణం విషయంలో ఉమ్మడి ఏపీలోనే ‘ది ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ -2012’ను రూపొందించారు. ఈ నిబంధనలనే తెలంగాణ వచ్చాక ‘ది తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012’గా అడాప్ట్ చేసుకున్నారు. ఈ నిబంధనల ప్రకారం చెరువులు, కుంటల పుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్ టీఎల్) పరిధిలో భవన నిర్మాణాలు నిషేధం. అలాగే చెరువులు, కుంటల ఎఫ్ టీఎల్ చుట్టూ నీటి ప్రవాహానికి అడ్డంకుల్లేకుండా వదిలేయాల్సిన స్థలమే బఫర్ జోన్. ఈ బఫర్ జోన్ అనేది సరస్సు విస్తీర్ణాన్ని బట్టి మారుతుంటుంది. చెరువులు, కుంటల చుట్టూ ఆక్రమణలను నిరోధించడానికి, నీటి వనరుల చుట్టూ ఉన్న సహజ పర్యావరణ వ్యవస్థను సంరక్షించడానికి ఈ జోన్ కీలకం. అందుకే ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, నాలాల ఎఫ్ టీఎల్ విస్తీర్ణాన్ని ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా నిర్ధారించాల్సి ఉంటుంది.

అక్రమార్కులకు ఆఫీసర్ల సహకారం 

తెలంగాణ బిల్డింగ్ రూల్స్ ప్రకారం 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల ఎఫ్ టీఎల్ బౌండరీ దాటిన తర్వాత 30 మీటర్ల వరకు బఫర్ జోన్ గా పరిగణిస్తారు. అంటే 30 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీటర్ల తర్వాతే నిర్మాణాలు చేపట్టాలి. 30 మీటర్ల బఫర్ జోన్ లో 12 ఫీట్లతో వాకింగ్ లేదా సైక్లింగ్ ట్రాక్ నిర్మించాల్సి ఉంటుంది. అలాగే10 హెక్టార్లలోపు విస్తీర్ణం కలిగిన చెరువులు, కుంటల ఎఫ్ టీఎల్ బౌండరీ నుంచి  9 మీటర్ల వరకు బఫర్ జోన్ గా పరిగణిస్తారు. 10 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పయిన కాల్వ లేదా నాలా బౌండరీ తర్వాత 9 మీటర్ల వరకు బఫర్ జోన్ గా పరిగణిస్తారు. అంటే నాలా వెంట 9 మీటర్లు వదిలేసి నిర్మాణాలు చేపట్టాలి. ఒక వేళ నాలా లేదా కాల్వ10 మీటర్ల వెడల్పు కన్న తక్కువగా ఉంటే దాని బౌండరీ నుంచి 2 మీటర్లు వదిలేసి నిర్మాణాలు చేపట్టొచ్చు. ఇలా నిబంధనలు కఠినంగా విధించిన అప్పటి ప్రభుత్వం ఏదైనా బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ తోపాటు ఇరిగేషన్ ఆఫీసర్ సర్టిఫై చేయడాన్ని తప్పనిసరి చేసింది. కానీ ఈ నిబంధనలే ఆఫీసర్లకు కాసులు కురిపిస్తున్నాయి. బిల్డర్లు పర్మిషన్ తీసుకునేటప్పుడు ఒక ప్లాన్ ఇచ్చి.. బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణం మరోలా చేపడుతున్నారు. ఇందుకోసం మూడు శాఖల ఆఫీసర్లు డబ్బులు తీసుకుని సహకరిస్తున్నారు.   

31 వేల ఎకరాల శిఖం భూములకు పట్టాలు 

రాష్ట్రంలో చెరువులు, కుంటల్లోని శిఖం భూములు వేలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. చెరువుల్లో నీళ్లు లేని సమయంలో యాసంగి పంట పండించుకోవడానికి ఇచ్చిన ఏక్ ఫసల్ పట్టాలను గతంలో రెవెన్యూ శాఖ జారీ చేసేది. పహాణీలో యజమాని కాలమ్ వద్ద చెరువు శిఖం అని, అనుభవదారు కాలమ్ వద్ద ఏక్ ఫసల్ అని నమోదు చేసేవారు. అయితే కొందరు అక్రమార్కులు రెవెన్యూ ఆఫీసర్ల సహకారంతో 2017లో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన సమయంలో వీటిని పర్మనెంట్ పట్టాలుగా మార్చేసుకున్నారు. ఇటీవల ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ తీసిన లెక్కల ప్రకారం ఇలా అక్రమంగా ఆక్రమించి పట్టాలు పొందిన భూములు రాష్ట్రంలో 31 వేల ఎకరాల వరకు ఉంటాయని తేలింది. ఇలాంటి అక్రమాలు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా జరిగినట్టు గుర్తించారు. పట్టాదారుల పేర్లను ధరణిలోనూ దర్జాగా ఎక్కించేశారు. దీంతో ఈ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు కూడా యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఇప్పటికైనా శిఖం భూముల సర్వే నంబర్లను ప్రభుత్వం గుర్తించి నిషేధిత జాబితాలో చేర్చకపోతే ఈ భూములు మరిన్ని చేతులు మారే అవకాశం ఉంది. 

శిఖం భూముల రక్షణపై నిర్లక్ష్యం 

గతంలో చెరువులు, కుంటలపై నీరటికాళ్లు ఉండేవారు. వీళ్లే నీటి పారకంతో పాటు భూములు అన్యాక్రాంతం కాకుండా చూసేవారు. కానీ రాష్ట్రంలో చాలా చెరువులపై ఇప్పుడు నీరటికాళ్లు లేరు. గత ప్రభుత్వం వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను రద్దు చేశాక క్షేత్ర స్థాయిలో ఇలాంటి ఆక్రమణలను గుర్తించి ఆఫీసర్లకు సమాచారమిచ్చే వ్యవస్థే లేకుండాపోయింది. అలాగే రైతుల ఆధ్వర్యంలో సాగునీటి సంఘాలు కూడా ఉండేవి. గత ప్రభుత్వం సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం మానేసింది. దీంతో శిఖం, బఫర్ జోన్లలో ఇండ్ల నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.