స్థానిక ఎన్నికలు సంక్రాంతి తర్వాతే!

  • డిసెంబర్​ నెలాఖరు వరకు రిజర్వేషన్లపై స్పష్టత 
  • మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణపై సర్కార్​ కసరత్తు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సర్కార్​ సిద్ధమవుతున్నది. వచ్చే జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్​ చేస్తు న్నది. ఓవైపు కులగణన సర్వే, బీసీ డెడికేటెడ్​ కమిషన్ ​సమావేశాలు కొనసాగుతుండడం.. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో వచ్చె నెలలో హియరింగ్​ ఉండడంతో.. డిసెంబర్​ రెండో వారం కల్లా ఈ ప్రక్రియనంతా సవ్యంగా ముగించి.. జనవరిలో ఎన్నికలు కంప్లీట్ చేయాలని యోచిస్తున్నది.​ కులగణన సర్వే వివరాలు రాగానే వాటిని డెడికేటెడ్ కమిషన్​కు ప్రభుత్వం అందించనున్నది. 

అందులోని వివరాలు, కమిషన్​ చేసిన అధ్యయన నివేదిక రెండింటి ఆధారంగా రిజర్వేషన్లను ఎంతమేరకు పెంచవచ్చనేదానిపై  ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. అందుకు అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేసి.. ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ అంతా డిసెంబర్​ చివరిలోగా పూర్తి కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జనవరి మొదటి వారం లేదా డిసెంబర్​ చివరలోనే షెడ్యూల్​ రిలీజ్​ చేసి.. సంక్రాంతి పండుగ తర్వాత పోలింగ్​ నిర్వహించనున్నట్టు చర్చ జరుగుతున్నది. 

4 వేల నుంచి 5 వేల గ్రామాలకు ఒక విడత చొప్పున.. మూడు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం తెప్పించుకుని, గ్రామాలు, వార్డుల వారీగా పబ్లిష్​ చేసింది. షెడ్యూల్​ రిలీజ్​ కంటే ముందు మరోసారి సప్లిమెంటరీ ఓటర్ల జాబితాను తీసుకోనుంది. 

సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో జీపీలు కొనసాగుతున్నాయి. మరోవైపు, ఇందిరమ్మ ఇళ్ల స్కీం స్టార్ట్​ చేయడంతో పాటు, కొండ పోచమ్మ దగ్గర బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు గెస్ట్​హౌస్​​పై ప్రభుత్వం విచారణ చేపడుతుంది.