చదువుతోనే అభివృద్ధి .. 8 నెలల్లో ఇంటిగ్రేడెట్​ రెసిడెన్షియల్​ స్కూల్​ను ప్రారంభిస్తాం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • బాలానగర్, చిన్నచింతకుంట మండలాల్లో స్కూల్స్​ నిర్మాణానికి శంకుస్థాపన

బాలానగర్/చిన్నచింతకుంట, వెలుగు: చదువుతోనే అభివృద్ధి ​సాధ్యమని, ఇంటర్నేషనల్​ లెవల్​లో పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల’ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్​అండ్​బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మహబూబ్​నగర్​ జిల్లాలోని బాలానగర్​ మండలం పెద్దాయపల్లి, చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్​ గ్రామాల్లో శుక్రవారం ఆయన రూ.150 కోట్లతో నిర్మించనున్న ‘యంగ్ ఇండియా  ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్  స్కూల్స్' నిర్మాణానికి ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, జనంపల్లి అనిరుధ్​ రెడ్డి, జి.మధుసూదన్​రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

ఇంగ్లీష్, తెలుగు మీడియంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు మొదటి విడతగా రూ.5 వేల కోట్లతో 28 నియోజకవర్గాల్లో ఈ రెసిడెన్షియల్​ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తాను చర్చించి ఈ పాఠశాలల డిజైన్  గురించి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ బడుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలంతా చిన్ననాటి నుంచి కలసిమెలసి కులమతాలకు అతీతంగా చదువుకోవచ్చన్నారు. బడుల్లో చదువుతో పాటు అన్ని సౌలతులు ఉంటాయన్నారు. 

నాల్గో తరగతి నుంచి ఇంటర్  వరకు 120 మంది టీచర్లు, 2,500 మంది స్టూడెంట్లు చదువుకునేట్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్  పాఠశాలల శంకుస్థాపనతో తెలంగాణకు ఒక రోజు ముందుగానే దసరా పండుగ వచ్చిందన్నారు. ఈ బడుల నిర్మాణాన్ని 8 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. పేదలకు చదువు చెప్పిస్తేనే కుటుంబంతో పాటు రాష్ట్రం, దేశం బాగుపడుతుందన్నారు. అందువల్ల పేదలందరూ తమ పిల్లలను ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్  పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి కోరారు. మహబూబ్​నగర్  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్  స్కూల్’ నిర్మాణం చేపట్టి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. 

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ పెద్దాయపల్లిలో రెసిడెన్షియల్ స్కూల్​కు శంకుస్థాపన చేసుకోవడంతో పాటు 40 ఎకరాల స్థలంలో స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయేందిర బోయి, అడిషనల్​ కలెక్టర్  మోహన్ రావు, మైనార్టీ కార్పొరేషన్​ చైర్మన్  ఒబేదుల్లా కొత్వాల్, జడ్పీ సీఈవో వెంకటరెడ్డి, డీఆర్డీవో నర్సింహులు, బీసీ సంక్షేమ అధికారి​ఇందిర పాల్గొన్నారు.

రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు

నాగర్ కర్నూల్ టౌన్ : రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి విప్లవత్మక మార్పులు తీసుకొస్తున్నారని నాగర్ కర్నూల్  ఎంపీ మల్లు రవి తెలిపారు. శుక్రవారం నాగర్ కర్నూల్  మండలం తూడుకుర్తి సమీపంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్  స్కూల్ కు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్​రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాల అభివృద్ధి కోసం సీఎం ఎంతో కృషి చేస్తున్నారన్నారు.

 వంద రోజుల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్  ప్రభుత్వానికే దక్కిందన్నారు. గత ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాగా, సీఎం రేవంత్ రెడ్డి చేతల్లో చూపిస్తున్నారని దీనికి నిదర్శనమే రాష్ట్రంలో 29 స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. డీసీసీబీ చైర్మన్  విష్ణువర్ధన్ రెడ్డి, పీఏసీఎస్​ చైర్మన్  శ్రీనివాసరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

నల్లమల  రాష్ట్రానికే ఆదర్శం కావాలి

ఉప్పునుంతల: నల్లమల రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా డెవపల్​ చేయడంపై దృష్టి పెట్టినట్లు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. శుక్రవారం ఉప్పునుంతల మండలం రాయిచెడు గ్రామంలో ఎంపీ మల్లు రవితో కలిసి ఇంటిగ్రేటెడ్  ఇంటర్నేషనల్  స్కూల్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాల్గో తరగతి నుంచి ఇంటర్​ వరకు అన్ని కులాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం కలిస్తున్నట్లు తెలిపారు.

 నవోదయ, ఏకలవ్య స్కూల్స్​ మంజూరు కోసం సీఎంను కలుస్తానని చెప్పారు. నియోజకవర్గంలో రెండెకరాల స్థలంలో మహేంద్రనాథ్  కళాభవన్  నిర్మించనున్నట్లు తెలిపారు. డీఈవో గోవిందరాజులు, ఆర్అండ్​బీ డీఈ జలందర్, ఈఈ నరేందర్, ఆర్డీవో మాధవి పాల్గొన్నారు.