వేడివేడి అన్నంలో... రోట్లో నూరిన తొక్కో... అప్పుడే పెట్టిన పచ్చడో కలుపుకుని తింటే ఆ మజానే వేరు. అబ్బా! ఇప్పుడు ఆ రుచికరమైన వంటలు చేసుకోవడానికి అంత టైమ్ ఎక్కడుంది అంటున్నారా? ఇలాంటి రుచుల కోసం గంటలకు గంటలు ఏం పట్టదు. చిటికెలో తయారు చేసుకోవచ్చును.
ఇన్స్టాంట్ మామిడికాయ పచ్చడి
కావాల్సినవి:
మామిడి కాయలు : నాలుగు (చిన్నవి),
వెల్లుల్లి రెబ్బలు (కొద్దిగా దంచుకున్నవి) : ఒక టేబుల్ స్పూన్,
ఉప్పు : తగినంత,
కారం : రెండు టేబుల్ స్పూన్లు,
పసుపు : చిటికెడు,
కరివేపాకు : ఒక రెమ్మ,
జీలకర్ర : పావు టీ స్పూన్,
ఆవాలు : పావు టీ స్పూన్,
వేగించిన జీలకర్ర మెంతుల పొడి : అర టీ స్పూన్,
నూనె : సరిపడా
తయారీ: ముందుగా మామిడికాయలను చిన్న ముక్కలుగా తరగాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి నూనె వేడి చేసి జీలకర్ర, ఆవాలు వేయాలి. అవి వేగాక కరివేపాకు, పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆపి నూనెను చల్లార్చాలి. ఆ నూనెలో కారం, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి వేయాలి. మిశ్రమాన్ని బాగా కలిపాక, అందులో మామిడికాయ ముక్కలు వేయాలి. అప్పటికప్పుడు తినాలనిపిస్తే... వెంటనే నాలుగు మామిడి కాయలను ఇలా పచ్చడి పెట్టుకుంటే సరి.