Telangana Kitchen : దసరా పండుగ అప్పలు.. సగ్గుబియ్యం చెక్కలు.. డ్రైఫ్రూట్స్ గరిజెలు.. !

దసరా పండుగ వచ్చిందంటే..స్కూల్, కాలేజీలకు సెలవులొస్తయ్. పిల్లలంతా అమ్మమ్మ ఇంటికో, నాన్నమ్మ ఇంటికో వెళ్తారు. ఊళ్లోకెళ్లి, ఇంట్లో అడుగుపెట్టడంతోనే... పిల్లలంతా వంట గదిలోకే ఉరుకుతారు. అవును మరి..! అమ్మమ్మ. నాన్నమ్మలు చేసే మురుకులు, కారపప్పులు (చెక్కలు), గరిజెల రుచి అలాంటిది. అయితే ఆ వంటకాలనే కొంచెం కొత్తగా ట్రై చేయొచ్చు ఇలా.

సగ్గుబియ్యం చెక్కలు

కావాల్సినవి :

సగ్గుబియ్యం (సాబుదానా); పావు కప్పు
బియ్యప్పిండి: మూడు కప్పులు
ఐటర్: మూడు టేబుల్ స్పూన్లు
ఉప్పు: తగినంత
పచ్చిమిర్చి: తొమ్మిది
కారం: కొద్దిగా (కావాలంటే)
అల్లం తరుగు: అర టీ స్పూన్
కరివేపాకు: రెండు రెమ్మలు
జీలకర్ర: ఒక టీ స్పూన్
శెనగపప్పు: పావు కప్పు
నూనె: సరిపడా 

తయారీ: శెనగపప్పును కప్పు నీళ్లలో రెండు గంటలు నానబెట్టాలి. అలాగే సగ్గుబియ్యాన్ని నీళ్లు లేదా పాలలో ఐదారు గంటలు నానబెట్టాలి. మరోవైపు మిక్సీలో పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, అల్లం తరుగు వేసి గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో బియ్యప్పిండి, ఉప్పు, బటర్, కొద్దిగా కారం, పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. అందులోనే నానబెట్టిన శెనగపప్పు. సగ్గుబియ్యం, సరిపడా నీళ్లు పోసి మెత్తగా కలపాలి. స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె రాసిన ప్లాస్టిక్ షీట్ మీద ఒక్కో పిండి ముద్దని పెట్టి  పల్చగా వత్తి మరుగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి.

డ్రైఫ్రూట్స్ గరిజెలు

కావాల్సినవి: 

గోధుమ పిండి : ఒకటిన్నర కప్పు

ఉప్మారవ్వ : పావు : కప్పు 
బాదం పప్పు పలుకులు : ఒక టేబుల్ స్పూన్
జీడిపప్పు తరుగు : ఒక టేబుల్ స్పూన్
ఎండుకొబ్బరి తురుము: అర కప్పు
ఇలాచీ పొడి : పావు టీ స్పూన్
బెల్లం తురుము లేదా చక్కెర: ఒక కప్పు
వేగించిన పల్లీలు : పావు కప్పు
కిస్మిస్ : అర టేబుల్ స్పూన్
గసగసాలు లేదా నువ్వులు : పావు టేబుల్ స్పూన్ (కావాలంటే)
నెయ్యి : పావు కప్పు
 నూనె : సరిపడా

తయారీ : ఒక గిన్నెలో గోధుమపిండి, ఉప్మారవ్వ, కొద్దిగా వేడి నూనె, సరిపడా నీళ్లు పోసి కలపాలి. స్టప్పై మరో గిన్నె పెట్టి నెయ్యి వేడి చేయాలి. అందులో జీడిపప్పు, బాదం పప్పు పలుకులు, కిస్మిస్ లు వేయాలి. అవి వేగాక గసగసాలు, నువ్వులు, ఎండుకొబ్బరి తురుము వేయాలి. తర్వాత బెల్లం తరుము లేదా చక్కెర, ఇలాబీ పొడి వేసి కలపాలి. మిశ్రమం గట్టిపడ్డాక స్టవ్ ఆపేయాలి. పక్కన పెట్టిన గోధుమపిండిని కొద్దికొద్దిగా తీసుకుని పూరీల్లా వత్తి, దాని మధ్యలో డ్రైఫ్రూట్ మిశ్రమం పెట్టాలి. తర్వాత వాటిని మడిచి, రెండు చివర్లు విడిపోకుండా చేత్తో లేదా గరికెల చెక్కలో పెట్టి వత్తాలి. ఇలా పిండి మొత్తాన్నీ చేశాక, గరిజెలను నూనెలో డిష్ ఫ్రై చేయాలి.

జొన్నపిండి మురుకులు

కావాల్సినవి:

జొన్నపిండి : ఒకటిన్నర కప్పు
ఉప్పు : తగినంత 
జీలకర్ర: అర టీ స్పూన్ 
పసుపు: పావు టీ స్పూన్
కారం : అర టీ స్పూన్ 
నువ్వులు : అర టీ స్పూన్ 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ముప్పావు టీ స్పూన్
నూనె : సరిపడా

తయారీ : ఒక గిన్నెలో జొన్నపిండి, ఉప్పు, కారం, జీలకర్ర, పసుపు, నువ్వులు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నూనె వేయాలి. తర్వాత సరిపడా గోరువెచ్చని నీళ్లు పోసి మెత్తగా కలపాలి. పిండిని కొద్దికొద్దిగా తీసుకుని, మురుకుల గిద్దెల్లో పెట్టి పేపర్ లేదా ప్లేట్ పై గుంద్రంగా వత్తాలి. స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో మురుకులను వేసి డీప్ ఫ్రై చేయాలి.

V6 వెలుగు, లైఫ్