తెలంగాణ కిచెన్.. సూప్​.. సూప్​..సూపర్!

చలికి గరంగరంగా గొంతు దిగాలంటే సూప్​ ఉండాల్సిందే.  వెజిటబుల్, నాన్​ వెజ్ సూప్​.. ఇలా ఎన్నో రకాలున్నాయి. వాటిలో థ్రిల్ చేసే త్రీ రెసిపీలే ఇవి. మరింకెందుకాలస్యం..  వెంటనే ఈ రెసిపీలు ట్రై చేయండి. 

గుమ్మడితో సూప్​ తయారీకి కావాల్సినవి 

  • గుమ్మడికాయ ముక్కలు :   పావు కిలో
  • ఉల్లిగడ్డ :   ఒకటి
  •  వెల్లుల్లి రెబ్బలు :   మూడు
  • నీళ్లు :  ఒక కప్పు 
  • జాజికాయ పొడి :  చిటికెడు
  • మిక్స్​డ్ హెర్బ్స్ :  అర టీస్పూన్

తయారీ విధానం : ప్రెజర్ కుక్కర్​లో గుమ్మడికాయ ముక్కలు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి తరుగు వేయాలి. అందులో నీళ్లు పోయాలి. మూతపెట్టి పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని మెత్తగా మెదపాలి. తర్వాత నూనె, ఒరెగానో, మిక్స్​డ్ హెర్బ్స్, జాజికాయ పొడి, ఉప్పు వేసి కలపాలి. వాటితోపాటు కావాలంటే చక్కెరకూడా వేసుకోవచ్చు. మరికాసేపు మిశ్రమాన్ని బాగా ఉడికించాలి. చీజ్ వేసుకుని తింటే టేస్ట్ సూపర్​గా ఉంటుంది​.


మష్రూమ్​ సూప్ తయారీకి కావాల్సినవి

  • బటన్ మష్రూమ్స్ :  పావు కిలో
  •  వెన్న : రెండు టేబుల్ స్పూన్లు
  •  బిర్యానీ ఆకు :   ఒకటి
  •  ఉల్లిగడ్డ :  ఒకటి 
  • వెల్లుల్లి రెబ్బలు :  మూడు
  • గోధుమపిండి :  ఒక టేబుల్ స్పూన్
  • మిరియాల పొడి :  అర టీస్పూన్
  • నీళ్లు, పాలు  : ఒక్కో కప్పు
  • ఉప్పు :  సరిపడా 
  • కొత్తిమీర :   కొంచెం

తయారీ విధానం: బటన్ మష్రూమ్స్​ని కడిగి, కట్ చేసుకోవాలి. పాన్​లో వెన్న వేడి చేసి అందులో బిర్యానీ ఆకు, ఉల్లిగడ్డ తరుగు, వెల్లుల్లి తురుము వేసి వేగించాలి. అవి వేగాక మష్రూమ్స్ తరుగు కూడా వేసి కలపాలి. పాన్​లో నీరంతా ఇంకిపోయాక, గోధుమపిండి వేసి కలపాలి. మూడు నిమిషాల వరకు కలుపుతూ వేగించాలి. తర్వాత మిరియాల పొడి వేసి కలపాలి. ఆపై నీళ్లు పోసి కలపాలి. కావాలంటే  వెజిటబుల్స్ లేదా మష్రూమ్​ ఉడికించిన నీటిని వాడొచ్చు. పాలు కూడా పోయాలి. చివరిగా ఉప్పు వేసి కలిపి, మూత పెట్టాలి. పొంగు వచ్చేవరకు మాదిరి మంట మీద ఉడికించాలి. మిశ్రమం దగ్గర పడ్డాక మరో ఐదు నిమిషాలు ఉడికించి, కొత్తిమీర చల్లాలి. 


సొరకాయతో సూప్​ తయారీకి కావలసినవి

  • సొరకాయ ముక్కలు : 350 గ్రాములు
  • నూనె :  ఒక టేబుల్ స్పూన్
  • ఉల్లిగడ్డ  :  పావు కప్పు
  •  వెల్లుల్లి తరుగు :  ఒక టీస్పూన్
  • నీళ్లు   : రెండు కప్పులు
  •  మిక్స్​డ్​ హెర్బ్స్  పౌడర్  :  ఒక టీస్పూన్
  • మిరియాల పొడి :  అర టీస్పూన్
  • ఉప్పు :  సరిపడా

తయారీవిధానం : ప్రెజర్ కుక్కర్​లో నూనె వేడి చేసి అందులో ఉల్లిగడ్డ, వెల్లుల్లి తరుగు వేసి వేగించాలి. అందులో సొరకాయ ముక్కలు వేసి కలపాలి. ఆపై నీళ్లు పోసి మూతపెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు లేదా పది నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత నీటిని వడకట్టి పక్కన ఉంచాలి. ఉడికిన సొరకాయ, ఉల్లిగడ్డ, వెల్లుల్లి తరుగును మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత అదే ప్రెజర్​ కుక్కర్​లో వేసి వడకట్టిన నీటిని కూడా పోయాలి. ఆ మిశ్రమంలో మిరియాల పొడి, మిక్స్​డ్​ హెర్బ్స్ పౌడర్, ఉప్పు వేసి కలపాలి. క్రీమ్​లా కావాలనుకుంటే చీజ్​ కూడా వేసుకోవచ్చు. ఈ సూప్​ నేరుగా తాగడమే కాకుండా.. బ్రెడ్ టోస్ట్​తో కూడా ఎంజాయ్ చేయొచ్చు.