తెలంగాణ కిచెన్ : అరటితో ఆరు రకాల వెరైటీలు

చినుకులు పడేటప్పుడు కరకరలాడే శ్నాక్స్ తినాలనిపిస్తుంది. ఇక శ్నాక్స్​ అనగానే ఎక్కువగా గుర్తొచ్చేది ఆలూ వెరైటీలే. కానీ, అరటితో కూడా బోలెడు వెరైటీలు చేయొచ్చు తెలుసా? పచ్చి అరటికాయతో... చిప్స్, పకోడీలు, బజ్జీలు, మిక్చర్, కట్​లెట్, మంచూరియా.. వంటి టేస్టీ​ శ్నాక్స్ చేయొచ్చు. అయితే ఇలాంటి శ్నాక్స్​ను వేరే వెజిటబుల్స్​తో టేస్ట్​ చేసే ఉంటారు. ఈసారి అరటికాయతో కూడా ట్రై చేయండి. ​

అరటికాయ మిక్చర్

కావాల్సినవి :

అరటికాయలు - రెండు
ఉప్పు - ఒకటిన్నర టేబుల్ స్పూన్
పసుపు - ముప్పావు టేబుల్ స్పూన్
నీళ్లు - పావు కప్పు
నూనె - వేగించడానికి సరిపడా
జీడిపప్పులు, బాదం - ఒక్కోటి పావు కప్పు చొప్పున
ఎండుద్రాక్షలు - ఇరవై
ఎండు మిర్చి - నాలుగు, కరివేపాకు - కొంచెం
చాట్ మసాలా మిరియాల పొడి - ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
 కారం - ఒక టీస్పూన్

తయారీ : ఒక గిన్నెలో ఉప్పు, పసుపు వేసి నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టాలి. లోతైన కడాయిలో నూనె వేడి చేసి జీడిపప్పులు, బాదం, ఎండుద్రాక్షలను వేరువేరుగా వేగించి పక్కన పెట్టాలి. తర్వాత అరటి కాయల తొక్క తీసేయాలి. మంట తగ్గించి మరుగుతున్న నూనెలో అరటి కాయల్ని తురమాలి. తురుము కాస్త వేగాక, అందులో పసుపు నీళ్ల మిశ్రమాన్ని చిలకరించి, కలపాలి. ఆ తరువాత మరికాసేపు వేగించి పక్కన పెట్టాలి. అదే నూనెలో ఎండు మిర్చి, కరివేపాకు విడివిడిగా వేగించి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో వేగించిన అరటి కాయ తురుము, జీడిపప్పులు, బాదం, ఎండుద్రాక్షలు, ఎండు మిర్చి, కరివేపాకు, చాట్ మసాలా, కారం, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిక్చర్​ చల్లారాక తింటే క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. గాలిచొరబడని జార్​లో వేసి మూతపెడితే రెండు వారాలు నిల్వ ఉంటాయి.

బనానా బజ్జీ 

కావాల్సినవి  :

అరటికాయలు -  రెండు,  జీలకర్ర -  ఒక టీస్పూన్
శనగపిండి -  ఒకటిన్నర కప్పులు
బియ్యప్పిండి -  రెండు టేబుల్ స్పూన్లు
పసుపు -  పావు టీస్పూన్, ఉప్పు, నీళ్లు -  సరిపడా
కారం -  ముప్పావు టీస్పూన్
వేడి నూనె -  రెండు టీస్పూన్లు
నూనె -  వేగించడానికి సరిపడా 

తయారీ : అరటికాయల తొక్క తీసి, వాటిని గుండ్రంగా కాకుండా కాస్త క్రాస్​గా తరగాలి. అలా తరిగితే కాస్త పొడవుగా ఉండి, బజ్జీలు వేసుకోవడానికి బాగుంటాయి. ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర, వేడి నూనె వేసి నీళ్లు పోస్తూ పిండిని కలపాలి. బజ్జీల పిండి తయారయ్యాక, అందులో అరటికాయ ముక్కల్ని ముంచి మరుగుతున్న నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్​ కలర్ వచ్చేవరకు వేగిస్తే వేడి వేడి బజ్జీలు రెడీ. 

పకోడి

కావాల్సినవి :

అరటికాయలు -  రెండు
ఉప్పు -  సరిపడా
నూనె -  వేగించడానికి సరిపడా
కారం -  ఒకటిన్నర టీస్పూన్
పసుపు -  అర టీస్పూన్
ధనియాల పొడి, గరం మసాలా, వాము -  ఒక్కో టీస్పూన్ చొప్పున
పచ్చిమిర్చి -  నాలుగు
పుదీనా -  పావు కప్పు
కరివేపాకు -  కొంచెం
అల్లం వెల్లుల్లి పేస్ట్ -  రెండు టీస్పూన్లు
శనగపిండి -  అర కప్పు
బియ్యప్పిండి, వేడి నూనె -  రెండు టేబుల్ స్పూన్ల చొప్పున

తయారీ : అరటికాయల తొక్క తీసి తొడిమలు కట్ చేయాలి. తర్వాత అరటికాయల్ని తురమాలి. ఆ తురుములో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, శనగపిండి, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులో వేడి చేసిన నూనె కొంచెం వేసి మరోసారి కలపాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో పిండి మిశ్రమాన్ని పకోడీల్లా వేయాలి. అవి క్రిస్పీగా వేగాక ప్లేట్​లోకి తీయాలి. అదే నూనెలో కరివేపాకు, పచ్చిమిర్చి వేగించాలి. వాటిని పకోడీలతోపాటు తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.  

మంచూరియా

కావాల్సినవి :

అరటికాయలు -  రెండు
ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెనిగర్ -  ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
మైదా -  నాలుగు టేబుల్ స్పూన్లు
కార్న్​ ఫ్లోర్, టొమాటో చిల్లీసాస్ -  రెండు టేబుల్ స్పూన్లు
రెడ్ చిల్లీసాస్ -  ఒక టేబుల్ స్పూన్
సోయాసాస్ -  ఒక టీస్పూన్ 
నూనె -  సరిపడా
ఉల్లిగడ్డ, క్యాప్సికమ్ -  ఒక్కోటి
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లికాడల తరుగు -  ఒక్కో టీస్పూన్ చొప్పున
కశ్మీరీ కారం -  అర టీస్పూన్

తయారీ : అరటికాయల తొక్క తీసి తురమాలి. అందులో మైదా, కార్న్​ఫ్లోర్, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేయాలి. ఒక చిన్న గిన్నెలో రెడ్ చిల్లీసాస్, టొమాటో చిల్లీసాస్, సోయాసాస్, వెనిగర్ వేసి కలపాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో మంచూరియా బాల్స్  వేగించాలి. వాటిని పక్కన పెట్టి, అదే నూనెలో ఉల్లిగడ్డ, క్యాప్సికమ్ ముక్కలు వేసి ఒక నిమిషం వేగించాలి. మరో పాన్​లో నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు, ఉల్లికాడల తరుగు కూడా వేగించాలి. అందులో కశ్మీరీ కారం వేసి కలపాలి. అందులో వేగించిన ఉల్లిగడ్డ, క్యాప్సికమ్ తరుగు వేసి కలపాలి. తర్వాత సాస్​ల​ మిశ్రమం కలపాలి. చివరిగా వేగించిన మంచూరియా బాల్స్ వేసి కలపాలి. కాస్త ఉప్పు, కొత్తిమీర తరుగు చల్లాలి. రెడీ అయిన మంచూరియాను ఒక గిన్నెలో వేసి ఉల్లికాడలు చల్లుకుని తింటే టేస్ట్ సూపర్​ ఉంటుంది!

కట్లెట్

కావాల్సినవి :

అరటికాయలు -  నాలుగు
కోడిగుడ్డు -  ఒకటి
ఉప్పు, నూనె -  సరిపడా
పచ్చిమిర్చి -  రెండు
కొత్తిమీర తరుగు -  మూడు టేబుల్ స్పూన్లు
వేగించిన ఉల్లిగడ్డ తరుగు -  పావు కప్పు
ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా -  ఒక్కో టీస్పూన్ చొప్పున
పసుపు -  పావు టీస్పూన్
నిమ్మరసం -  ఒక టేబుల్ స్పూన్

తయారీ : ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఉప్పు, పసుపు వేయాలి. తర్వాత అరటి కాయల తొడిమలు తీసి అందులో వేయాలి. మూత పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత అరటికాయ తొక్కల్ని తీసి, గుజ్జును మెత్తగా మెదపాలి. దాంట్లో ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, వేగించిన ఉల్లిగడ్డ తరుగు, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, నిమ్మరసం వేసి బాగా కలపాలి. తర్వాత గిలక్కొట్టిన కోడిగుడ్డు సొన కూడా వేసి కలపాలి. ముద్దలా అయ్యాక, చేతికి నూనె పూసుకుని కొంచెం తీసుకుని కట్లెట్​లా వత్తాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో కట్లెట్​లను రెండువైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగించాలి. వీటిని పచ్చిగానే నిల్వ చేసుకోవాలి అనుకుంటే.. కట్లెట్​లు చేశాక వాటిని ప్లేట్​లో పెట్టి ఫ్రిజ్​లో​ రెండు గంటలు పెట్టాలి. తర్వాత వాటిని బయటకు తీసి జిప్​లాక్​ కవర్​లో పెడితే రెండు నెలలు నిల్వ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసి వేగించుకుని తినొచ్చు.