ట్రెడిషనల్ క్రిస్మస్ ఫ్రూట్ కేక్
కావలసినవి :
నల్ల ద్రాక్ష(గింజలు లేని)- ఒకటిన్నర కప్పు
కర్జూరాల తరుగు - ముప్పావు కప్పు
ఆప్రికాట్ తరుగు - పావు కప్పు
ప్రూన్స్తరుగు - అర కప్పు
క్యాండిడ్ చెర్రీస్ తరుగు - అరకప్పు
ఎండుద్రాక్ష - అర కప్పు
డార్క్ రమ్ లేదా ఆపిల్ సిరప్ - ఒక కప్పు
చక్కెర (వేగించి) – పావు కిలో
మైదా – 200 గ్రాములు
వెనీలా ఎసెన్స్ – ఒక టీస్పూన్
అన్సాల్టెడ్ బటర్ – పావు కిలో
తయారీ : 20 సెంటీమీటర్ల గుండ్రటి కేక్ పాన్ తీసుకోవాలి. దానిపైన పర్చ్మెంట్ పేపర్ పరవాలి. అవసరమైతే కేక్ పాన్ సైడ్స్ కూడా పర్చ్మెంట్ పేపర్‌తో ఫోల్డ్ చేయాలి. ఒవెన్‌ను180 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ప్రి హీట్ చేయాలి. డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఒక గిన్నెలో వేసి అందులో రమ్ పోసి బాగా కలపాలి. వాటిని ఒక రాత్రంతా నానబెట్టాలి. అందులో పావు కప్పు నీళ్లు పోసి కారమిల్ మెత్తగా అయ్యేవరకు కలిపి పక్కన పెట్టాలి. మిక్సింగ్ బౌల్లో మైదా వేసి, అందులో ఉప్పు, స్పైస్ పౌడర్స్ అన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. వెన్న, చక్కెర, వెనిల్లాలను ఒక గిన్నెలోకి తీసుకుని క్రీమ్‌లా కలపాలి. తరువాత గుడ్డు సొన వేసి బాగా కలపాలి. ఇందులో సగం మైదా పిండి, సగం కారమిల్ వేసి, నెమ్మదిగా స్పూన్‌తో ఫోల్డ్ చేయాలి. తరువాత మిగిలిన మైదా, కారమిల్ వేసి మళ్లీ ఫోల్డ్ చేయాలి. తరువాత నానబెట్టిన ఫ్రూట్స్, నట్స్ వేసి బాగా కలపాలి. ఈ కేక్ మిశ్రమాన్ని తయారుచేసుకున్న బేకింగ్ పాన్‌లో స్పూన్‌తో సమంగా పరిచి, ఒవెన్‌లో బేక్ చేయాలి. బేకింగ్ పూర్తయ్యాక తాజా పండ్లు, దాల్చిన చెక్క పొడి, సిన్నమన్ షుగర్‌తో గార్నిష్ చేయొచ్చు. ట్రెడిషనల్ క్రిస్మస్ కేక్‌ను కొన్ని నెలల ముందే బేక్ చేస్తారు. ఈ కేక్ తయారీలో ప్రతి వారం రమ్ కలుపుతుంటారు. తయారైన ఆ కేక్‌ను క్రిస్మస్ రోజు డెకరేట్ చేస్తారు.
బెబింకా
కావలసినవి :
మైదా పిండి - 200 గ్రాములు
కోడిగుడ్డు పచ్చసొన - పది
పంచదార - 500 గ్రాములు
కొబ్బరి పాలు - 200 మిల్లి లీటర్లు
జాజికాయ పొడి - ఐదు గ్రాములు
వెన్న - 200 గ్రాములు
తయారీ : కొబ్బరిపాలు, మైదాపిండి, పంచదార, జాజికాయ పొడి, కోడిగుడ్డు పచ్చసొన కలిపి బ్రెడ్ క్రంబ్స్ ఎలాగైతే ఉంటాయో అలా పొడిపొడిగా చేయాలి. ఒవెన్ ప్రూఫ్ గిన్నెకు కరిగించిన వెన్న ఒక స్పూన్ పూయాలి. అందులో 75 ఎం.ఎల్. పిండిని వేసి సమంగా పరిచి, గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు బేక్ చేయాలి. తరువాత మరో స్పూన్ బటర్ పైన రాసి ఇంకో 75 ఎం.ఎల్. పిండిని దాని మీద సమంగా పరిచి, బేక్ చేయాలి. ఈ ప్రాసెస్‌ను తయారుచేసుకున్న పిండి పూర్తయ్యేవరకు చేయాలి. రెడీ అయిన బెబింకా డిసర్ట్ను వైర్ ర్యాక్ మీదకి మార్చి చల్లార్చాలి. తినే ముందు ముక్కలు కట్ చేయాలి.
పుడ్డింగ్‌లా ఉండే బెబింకా... గోవా డిసర్ట్. ఒక్కమాటలో చెప్పాలంటే పొరలు పొరలుగా ఉండే కేక్ అన్నమాట. సంప్రదాయ బెబింకా డిసర్ట్లో ఏడు నుంచి పదహారు లేయర్ల వరకు వేస్తారు. కానీ మీ ఓపిక బట్టి నచ్చినన్ని లేయర్లు తయారుచేయొచ్చు. టైం, ఓపిక ఉండి బెబింకాను తయారుచేసుకుంటే... దాన్ని తినేటప్పుడు మీరు అప్పటివరకు పడిన శ్రమంతా మర్చిపోవడం ఖాయం.
కుల్కుల్స్
కావలసినవి :
మైదా - రెండు కప్పులు
బొంబాయి(ఉప్మా) రవ్వ - అర కప్పు
పంచదార పొడి - రెండు టేబుల్ స్పూన్లు
వంటనూనె - రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు - పావు టీస్పూన్
కోడిగుడ్డు - ఒకటి
తాజా కొబ్బరి పాలు - అర కప్పు
వంట నూనె - వేగించడానికి సరిపడా
పంచదార పాకం కోసం :
పంచదార- ఒక కప్పు
నీళ్లు - ముప్పావు కప్పు
కుల్కుల్స్ రోల్ చేసేందుకు ఫోర్క్, కొత్త దువ్వెన ఉంటే సరిపోతుంది. లేదంటే ప్లాస్టిక్, రబ్బర్, చెక్క కుల్‌కుల్ రోలర్స్ (ఇవి మార్కెట్లో దొరుకుతాయి)కొబ్బరి పాల తయారీ అరకప్పు గోరు వెచ్చని నీళ్లలో ఒకటిన్నర కప్పుల తాజా కొబ్బరి తురుము లేదా కొబ్బరి పేస్ట్ వేయాలి. దీన్ని సన్నటి జల్లెడ లేదా పలుచటి బట్టలో వేసి చేతివేళ్లతో కొబ్బరిపాలు పిండాలి. ఇలా ముప్పావు కప్పు కొబ్బరిపాలు తయారుచేయాలి. మిగిలిన కొబ్బరి పిప్పిని పారేయొచ్చు లేదంటే వేరే వంటల్లో వాడుకోవచ్చు.
పిండి తయారీ
ఒక పెద్ద గిన్నెలో మైదా, పంచదార, ఉప్పు, నూనె వేయాలి. ఇందులోనే కోడిగుడ్డు సొన వేసి పొడిపొడిగా కలపాలి. తరువాత కొంచెంకొంచెంగా కొబ్బరి పాలు పోస్తూ పిండి ముద్ద చేయాలి. అవసరమైతే మరికొన్ని కొబ్బరి పాలు వాడొచ్చు. కలిపిన ముద్దను ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి. పావుగంట నుంచి 20 నిమిషాలు నానబెట్టాలి. ఉప్మారవ్వ వాడితే కనుక ముద్దను గంట లేదా రెండు గంటలు నానబెట్టాలి.
కుల్కుల్స్ తయారీ
ఫోర్క్ వెనకవైపు లేదా కొత్త దువ్వెనను వాడి కుల్కుల్స్చేయొచ్చు. కుల్కుల్స్ చేసే మౌల్డ్స్ ఉంటే పని సులువు అవుతుంది. కలిపిన పిండి ముద్దనుంచి చిన్న చిన్న ఉండలు చేయాలి. వీటిసైజ్ బటానీ గింజలకంటే కొంచెం పెద్దగా ఉండాలి. ఇవి తయారుచేస్తున్నప్పుడు మిగతా పిండి గాలికి పొడిబారకుండా పిండిముద్ద మీద మూత పెట్టాలి.చిన్న ఉండలను ఫోర్క్ లేదా దువ్వెన, మౌల్డ్ మీద పెట్టాలి. చేతి వేళ్లతో పిండి ముద్దను సమంగా వత్తాలి. అప్పుడది దీర్ఘచతురస్రాకారంగా వస్తుంది. దాన్ని ఒక చివర నుంచి మరో చివరకు రోల్ చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు అన్ని చివర్లు సరిగా వస్తున్నాయా లేదా గమనించుకోవాలి. ఇలా రోల్ చేసిన పిండినే కుల్‌కుల్(ఉంగరాలు) అంటారు. అన్నీ తయారుచేసుకున్నాక వాటిని పిండి చల్లిన ఒక ప్లేట్లో ఉంచాలి.
ఆ తర్వాత వేడి నూనెలో వాటిని వేగించాలి. అలాగని సలసల మరిగే నూనెలో కాదు. నూనె సరిగా వేడయిందా లేదా చూసేందుకు మొదట కొంచెం పిండి వేసి చూడాలి. నూనెలో వేసిన కుల్కుల్స్ వేగగానే పెద్దవి అవుతాయి. వాటిని అన్నివైపులా సరిగా కాల్చి పేపర్ టవల్ లేదా టిష్యూ పేపర్ మీద వేయాలి. నూనెలో నుంచి తీశాక కూడా అవి ఉడుకుతూనే ఉంటాయి. వీటిమీద పంచదార పొడి చల్లాలి అనుకుంటే వేడిగా ఉన్నప్పుడే చల్లాలి. పొడికాకుండా పాకంలో వేయాలనుకుంటే కనుక వాటిని చల్లారబెట్టాలి. అంతా అయ్యాక కాదు ముందే స్వీట్‌గా తయారు చేసుకోవాలి అనుకుంటే పిండిలోనే స్వీట్ కలిపితే సరి.
పంచదార పాకం తయారీ :
మొదట పంచదారను వేడిచేయాలి. అదే పాన్‌లో నీళ్లు పోసి, తీగపాకం పట్టాలి. ఆ పాకంలో చల్లారిన పాకంలో వేయాలి. లేదా ఒక స్పూన్‌తో కుల్కుల్స్ మీద పాకం కోటింగ్‌లా వేయొచ్చు. తరువాత వాటిని పెద్ద ప్లేట్లోకి మార్చి ఫోర్క్‌తో వేరు చేస్తే ఒకదానికొకటి అతుక్కుపోవు. పూర్తిగా ఆరాక గాలిసోకని డబ్బాలో నిల్వ చేయాలి. వీటిలో కొబ్బరి పాలు కలపడం ఇష్టపడని వాళ్లు మామూలు పాలు కలిపి చేసుకోవచ్చు.
నాన్ కటయ్
కావలసినవి :
గోధుమ పిండి లేదా మైదా పిండి- ముప్పావు కప్పు
శనగపిండి - పావు కప్పు
బొంబాయి రవ్వ - ఒక టేబుల్ స్పూన్
బేకింగ్ పౌడర్ - పావు టీస్పూన్
బేకింగ్ సోడా - చిటికెడు
యాలకులు - మూడు(పొడి చేసి)
పంచదార పొడి - అర కప్పు
నెయ్యి - ముప్పావు కప్పు లేదా బటర్ - సరిపడా
తయారీ : ఒక గిన్నెలో గోధుమపిండి, శనగపిండి, బొంబాయి రవ్వ, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి, నెయ్యి కొద్దికొద్దిగా పోస్తూ పిండి కలపాలి. అవసరమైనంత మేరకే నెయ్యి పోయాలి. పిండిని గట్టిగా పిసకొద్దు. ఈ పిండి ముద్దను12ఉండలు చేయాలి. తరువాత చేతితో నెమ్మదిగా వత్తాలి. వాటిమీద ఫోర్క్‌తో చిన్న డిజైన్ వేయాలి.
వీటిని పదినిమిషాలు బేక్ చేయాలి. లేదంటే గోల్డెన్ రంగు వచ్చేవరకు ఉంచాలి. ఒవెన్ సైజ్ వాడుతున్న ట్రే బట్టి ఈ టైం మారుతుంది. వైర్ ర్యాక్‌ను వెంటనే తీసేయాలి. నాన్ కటయ్ చల్లారాక గాలిచొరబడని సీసాలో నిల్వ చేయాలి. మూడు వారాల వరకు తాజాగా ఉంటాయి. పాలు లేదా టీతో వీటిని తింటే యమ్మీగా ఉంటాయి.
ఒవెన్ లేకుండా
ఒవెన్ లేని వాళ్లు మందపాటి పాన్ లేదా ప్రెజర్ కుక్కర్‌తో చేయొచ్చు. కుక్కర్ లేదా పాన్‌లో ఒక అంగుళం మందం రాతి ఉప్పు పోయాలి. దాని మీద రింగ్ లేదా స్టాండ్ పెట్టాలి. పదినిమిషాలు లేదా పావుగంట వేడి చేయాలి. ఆ తరువాత నాన్ కటయ్లను ప్లేట్లో పెట్టి స్టాండ్ మీద పెట్టాలి. ఇలా పెట్టేటప్పుడు కుక్కర్ సెంటర్లో కుకీస్ ఉండాలి. గ్యాస్కెట్ తీసేసి మూతపెట్టాలి. పది నిమిషాలు సన్నటి మంట మీద బేక్ చేయాలి.