ఫోన్​ట్యాపింగ్​ కేసు విచారణ... హైకోర్టు పర్యవేక్షణలో జరగాలి

టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు కీలకపాత్ర పోషించిన ఫర్హాత్ ఇబ్రహీంను కేసీఆర్ వాడుకుని వదిలేశాడు. కేసీఆర్, తలసాని యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిపై అవినీతి కేసులు పెట్టాలని ఇబ్రహీం నా వద్దకు వచ్చి వివరాలు చూపించాడు. కానీ, ఒక ముఖ్యమంత్రిపై  కేసు పెట్టాలంటే  గవర్నర్ అనుమతి కావాలి.  అందువల్ల ఫర్హాత్ ఇబ్రహీం ఈ కేసు చంద్రబాబు నాయుడు పెడితే బాగుంటుందని వైఎస్ చౌదరికి చెప్పాడు. ఇబ్రహీం ఇచ్చిన ఈ పిటీషన్​ను  వైఎస్ చౌదరి తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడుకు ఇచ్చాడు.  చంద్రబాబు నాయుడు  రామోజీరావుతో ఇంకా ఇతరులతో  సంప్రదించి, ఓటుకు నోటు కేసు ఉంది కాబట్టి సెటిల్మెంట్​ చేసుకోవచ్చని,  అందువల్ల ఈ కేసు పెట్టకుండా ఉండడమే మంచిదని నిర్ణయించుకున్నారు.  ఈ విధంగా చంద్రబాబు,  కేసీఆర్ మధ్య సెటిల్మెంట్​ జరిగిందని,  అంటే  చంద్రబాబు అవినీతి కేసు పెట్టకూడదు, బదులుగా కేసీఆర్  ఓటుకు నోటు కేసులో చూసి చూడకుండా వ్యవహరించాలన్న రాజీ కుదిరిందని.. అందువల్లనే  చంద్రబాబు వెనక్కు తగ్గి కేసు పెట్టలేదని ఇబ్రహీం అభిప్రాయం. 

టీఆర్ఎస్​ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా..

ముఖ్యమంత్రి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిపై అవినీతి కేసు విచారణకు అనుమతించాలని స్వయంగా  ఫర్హాత్  ఇబ్రహీం   గవర్నర్ దగ్గర పిటీషన్  పెట్టుకున్నాడు.  కానీ, దానికి అనుమతి పొందలేకపోయారు. హైకోర్టులో అనుమతి కోసం రిట్ వేశాడు.  అయితే,  ఆయనకు అనుకూలంగా తీర్పు రాలేదు.  చంద్రబాబు, కేసీఆర్ మధ్య సెటిల్మెంటుకు ఫర్హాత్ ఇబ్రహీమే కారణమయ్యాడు. కానీ, చంద్రబాబు కేసు  రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్న కేసు, అలాంటి కేసులో కూడా,  సాక్ష్యాలు ఉన్నప్పటికీ  సునీల్చౌదరి  అనే హైకోర్టు  న్యాయమూర్తి  చంద్రబాబుకు  అనుకూలంగా వ్యవహరించి  కేసును  రద్దు చేశారు. ఈ న్యాయమూర్తి   రిటైర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన్ను కన్స్యూమర్ ఫోరమ్ అధ్యక్షుడిగా చేశాడు.  

ఆ తర్వాత ఆ కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది.  సుప్రీంకోర్టులో అడ్మిట్ అయ్యింది.  ఓటుకు నోటు కేసు జరుగుతున్నప్పుడు అరెస్టుకు భయపడి చంద్రబాబు ఇక్కడి ఉమ్మడి రాజధాని నుంచి రాత్రికి రాత్రి ఆంధ్రాకువెళ్ళిపోయాడు. ఓటుకు నోటు కేసు  బయటపడింది కూడా ఫోన్ ట్యాపింగ్ వల్లనే.  బీజేపీకి చెందిన బీఎల్ సంతోష్ ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వేటాడి వారిని బీజేపీలోకి లాక్కునే ప్రయత్నాలు చేశారన్న ఆరోపణల్లో సంతోష్ పేరు బయటకు వచ్చింది. ఇది కూడా అనధికారికంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్. 

విశ్వాసఘాతుక నేరం

కేసీఆర్,  కేటీఆర్, హరీష్ రావులు తప్ప ఫోన్ ట్యాపింగ్ చేసినవాళ్లు గతంలో ఎవరు లేరు.  ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని రూల్ 419-A ప్రకారం భారత ప్రభుత్వ హోం కార్యదర్శి అనుమతి లేదా రాష్ట్రంలో హోం కార్యదర్శి అనుమతి ఇవ్వాలి. ఆ అనుమతి కూడా రివ్యూ కమిటీకి పంపాలి. కానీ,తెలంగాణలో  రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, న్యాయ మూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయడానికి ఒక్క ఆర్డరు కూడా లేదు.  అంటే  ఫోన్ ట్యాపింగ్ ఇష్టానుసారంగా చేశారు.  ప్రాథమిక హక్కులను భంగపరిచారు.  ప్రతిపక్ష నేతలు,  వ్యాపారస్తులు, వాణిజ్య ప్రముఖులు, న్యాయమూర్తులు అందరి ఫోన్లు ట్యాప్ చేశారు. అధికార దుర్వినియోగం చేశారు. డెకాయిటీ, రాబరీ, మోసం, దగా, విశ్వాసఘాతుకం, దోపిడీల కన్నా హీనమైన నేరం ఇది.  రాజరికాల కాలంలో కూడా ఇలా జరగలేదు. 

ప్రజలను పరిపాలించిన రాజే  దొంగతనం చేసిన వ్యవహారమిది. అప్పట్లో  హోం సెక్రటరీ బుర్ర  వెంకటేశం, ఐఏఎస్, నీతి, నిజాయితీ ఉన్న అధికారి. ఆయన బహుశా అక్రమ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంతకాలు పెట్టలేదు. కాబట్టి ఆయనను  హోం సెక్రటరీ పదవి నుంచి అంతగా ప్రాముఖ్యం లేని మరో స్థానానికి బదిలీ చేశారు. ఆ తర్వాత తీసుకొచ్చిన కొత్త హోం సెక్రటరీ నుంచి కూడా పర్మిషన్ ఏదీ తీసుకోలేదు. ఇష్టారాజ్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫోన్లు ట్యాపింగ్ చేయించారు.  ఇది    టెలిగ్రాఫిక్  చట్టాన్ని ఉల్లంఘించడమే కాదు. ఇది అవినీతి కేసు. 

న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్

న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు.  ఇది మరింత తీవ్రమైన విషయం.  న్యాయవ్యవస్థ స్వేచ్ఛను, స్వతంత్ర ప్రతిపత్తిని హరించే చర్య.    తీవ్రమైన  నేరస్వభావం ఉన్న కేసు ఇది. ఇలా చేసి  ఏకఛత్రాధిపత్యంగా  రాష్ట్రాన్ని ఏలాలని చూశారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు.  కేసు పెడితే ఏమవుతుందని వీళ్లు అనుకుంటున్నారు.  ఈ కేసులు పెద్ద కేసులు కావని అనుకుంటున్నారు.  ఇవన్నీ బెయిలబుల్ నేరాలనుకుంటున్నారు.  కానీ,  ఇది భారీ అవినీతి.  పెద్దస్థాయిలో జరిగిన కుంభకోణంగా దీన్ని చూడాలి.  అవినీతి  నిరోధక  చట్టాన్ని  వర్తింపజేయాలి.  ఫోన్ ట్యాపింగ్  కేసు  గతంలో  అమెరికా అధ్యక్షుడు రాజీనామా చేయవలసి వచ్చిన కేసు.  ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన నేరాలకు పాల్పడి, ప్రజాస్వామ్యాన్ని  కూల్చేసి ఏకఛత్రాధిపత్యంగా కుటుంబ పాలన చేయడం క్షమించరాని నేరం.  కానీ,  ఎందుకో ఈ ప్రభుత్వం ఇంకా తాత్సారం చేస్తోంది.  

ఇది అవినీతి కేసు కూడా.. నిందితులను అరెస్టు చేయాలి

హైకోర్టు  న్యాయమూర్తి  ఫోను కూడా ట్యాపింగ్ చేశారన్న వార్తల తర్వాత హైకోర్టు సూమోటోగా ఈ కేసును  స్వీకరించింది.  ఇది హర్షించదగిన నిర్ణయం. తీవ్రవాదులను,  ఉగ్రవాదులను పసిగట్టడానికి ఉపయోగించే పరికరాలను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయడానికి ఉపయోగించారు . హైకోర్టు స్వయంగా కేసు చేపట్టింది. కాబట్టి  ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని హైకోర్టు నియమించి,  హైకోర్టు  పర్యవేక్షణలో కేసు విచారణ రోజువారీ కొనసాగేలా చర్యలు తీసుకోవాలి. 

ప్రజాస్వామిక విలువలు, గోప్యత హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలు,  రాజ్యాంగ ప్రమాణాలను, నైతిక స్ఫూర్తిని కాలరాసే ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. పైగాన్యాయమూర్తుల ఫోన్లు కూడా చట్టవిరుద్ధంగా ట్యాప్ చేయడం న్యాయవ్యవస్థపై  ఒత్తిడి తీసుకువచ్చే కుట్రపూరిత ఉద్దేశ్యాలతో  చేసిన పని.  న్యాయవ్యవస్థ స్వతంత్ర  ప్రతిపత్తిని  హరించడానికి చేసిన ప్రయత్నం.  ఇలాంటి చర్యలను ఉపేక్షించరాదు. ఇప్పుడు నడుస్తున్న  కేసులో అవినీతి నిరోధక చట్టం సెక్షన్లను కూడా వర్తింపజేసి, నిందితులను అరెస్టు చేయాలి. కస్టోడియల్ ఇంటరాగేషన్ చేసి నిజానిజాలు బయటకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.  తీవ్రమైన ఈ నేరంలో దోషులకు చట్టపరంగా శిక్షలు పడాలి.  

సీఎం రేవంత్​ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా,  ధనబలం  ఉపయోగపడుతుందని,  పెద్ద చర్యలేవీ ఉండవని చాలామంది అనుమానిస్తున్నారు. ఈ అనుమానాలు తొలగాలంటే  ఈ వ్యవహారంలో  విచారణ జరగవలసిన అవసరం ఉంది.  ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి రోజువారీ విచారణ కొనసాగాలి.  ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఎక్విప్​మెంట్,  పరికరాలు ఎలా కొన్నారు?  ఇదేమీ అధికారికంగా,  అవసరమైన అనుమతులతో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కాదు.  అనధికారిక,  చట్టవిరుద్ధ  ఫోన్ ట్యాపింగ్ కోసం పరికరాలు,  కార్యాలయం  వగైరా  హంగులన్ని  సమకూర్చుకోడానికి  ప్రభుత్వ ధనాన్ని ఎలా ఖర్చు చేశారు?  ఇవన్నీ  విచారణ జరగాలి.  

ఇప్పటికే  ఒకరు విదేశాలకు వెళ్ళిపోయాడు.  ఇది ఒక హీనమైన నేరం.  ప్రజాస్వామ్యాన్ని, వ్యక్తి స్వేచ్ఛను హరింపజేసి లబ్ధి పొంది, కోట్లు సంపాదించడానికి చేసిన నేరం.  ఇది ఒక పెద్ద దోపిడీగా పరిగణించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ  తీసుకోవాలి. సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ ఫోన్​ను ట్యాపింగ్ చేశారని ఒక నిందితుడు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఎంత ఇష్టారాజ్యంగా  ఫోన్ ట్యాపింగ్ చేశారో  దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.  

ఫోన్ ట్యాపింగ్ నేరాలు - శిక్షలు

1) భారత టెలీగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం.. చట్టవిరుద్ధంగా, అవసరమైన అనుమతి లేకుండా ఫోను ట్యాపింగ్ చేస్తే, ఈ నేరానికి మూడేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు.  
2) సెక్షన్ 25(సి) ప్రకారం ఫోను ట్యాపింగ్ నేరానికి మూడేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. సెక్షన్ 26 ప్రకారం ఏ అధికారి అయినా అక్రమ ఫోన్ ట్యాపింగ్ చేస్తే , మెసేజ్ రిసీవ్ చేసుకుని వేరెవరికైనా అందిస్తే అది కూడా నేరం.
3) ఇండియన్ పీనల్ కోడ్  ప్రకారం చూస్తే,  అధికారులు కుట్రపూరితంగా, మంత్రులు, ఉన్నతాధికారుల  ప్రోద్బలం వల్ల,  కొన్ని  ప్రయోజనాలు ఆశించి ఫోన్ ట్యాపింగ్​కు పాల్పడితే, అలా చేసినవారందరికీ  శిక్ష పడుతుంది. ఇది క్రిమినల్  కాన్సిపరసీ అంటే  నేరపూరిత కుట్ర అవుతుంది. సెక్షన్ 120/B  కింద శిక్షార్హమైన నేరం.  ఇది రాజ్యాంగ విరుద్ధం,  ప్రజాస్వామ్య విరుద్ధం,  ప్రాథమిక హక్కులకు విరుద్ధం. 

4) ఫోన్​ట్యాపింగ్ అనేది కేవలం టెలీగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రమే కాదు. ఇది తీవ్రమైన అవినీతికి సంబంధించిన నేరం.
అవినీతి నిరోధక చట్టంలోని  సెక్షన్లు 7, 7ఏ, 8, 13 ప్రకారం పబ్లిక్ సర్వెంట్లు అంటే ప్రజాసేవకులు ఎవరైనా లంచం తీసుకున్నా, అవినీతికి పాల్పడినా శిక్షార్హులే.  పదవిని, అధికారాన్ని దుర్వినియోగం చేసి ఫోన్ ట్యాపింగ్ చేస్తే శిక్షార్హులవుతారు.  

గరిష్టంగా 7 సంవత్సరాల వరకు,  కనిష్టంగా 3 సంవత్సరాల కాలం శిక్షపడుతుంది.  ఇది కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ నేరం. పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా సెక్షన్ 7ఎ ప్రకారం చట్టవిరుద్ధంగా  గ్రాటిఫికేషన్ అంటే  ప్రయోజనాలు పొందడం చేస్తే, అది డబ్బురూపంలో కావచ్చు,  మరో రూపంలో కావచ్చు  ప్రయోజనాలు పొందితే ఈ నేరానికి సెక్షన్లు  7,  7ఎ,  8 కింద  ఏడు సంవత్సరాల శిక్ష  పడుతుంది.  మంత్రులు,  ఎమ్మెల్యేలు,  టెలీగ్రాఫ్  ఆఫీసర్ , పోలీసు ఆఫీసర్  పబ్లిక్ సర్వెంట్లు కాబట్టి ఉద్దేశ్యపూర్వకంగా చట్టవిరుద్ధంగా తమ హోదాను దుర్వినియోగం చేసి  ప్రయోజనలాసిస్తే  ఐపీసీ చట్టంలోని  సెక్షన్ 13 ప్రకారం క్రిమినల్ మిస్ కండక్ట్ అంటే నేరపూరిత వ్యవహారశైలి అవుతుంది.

 జస్జిస్ ఈశ్వరయ్య,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 
హైకోర్టు పూర్వ  తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి