ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోండి

  • ఆలోగా విచారణ షెడ్యూల్ రూపొందించండి
  • స్పీకర్​ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం
  • లేదంటే తామే సుమోటోగా విచారిస్తామని వెల్లడి 
  • స్పీకర్‌‌ మౌనంగా ఉన్నా కోర్టులు మౌనంగా ఉండలేవని కామెంట్ 
  • ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు 

హైదరాబాద్, వెలుగు : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. ఈ పిటిషన్లపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని, ఆలోగా విచారణ షెడ్యూల్​రూపొందించాలని స్పీకర్‌‌‌‌‌‌‌‌ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది. పిటిషన్లకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ తక్షణమే స్పీకర్​ముందుంచాలని చెప్పింది. ‘‘అనర్హత పిటిషన్లపై ఇరుపక్షాలకు అవకాశం ఇచ్చి డాక్యుమెంట్ల సమర్పణ, ప్లీడింగ్, వాదనలు తదితరాలకు షెడ్యూల్​ నిర్ణయించి.. దాన్ని హైకోర్టు జ్యుడీషియల్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌కు సమర్పించాలి.

ఒకవేళ అలా చేయని పక్షంలో ఈ కేసును సుమోటోగా స్వీకరించి ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించింది. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లో చేరిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన్ వేశారు. అలాగే దానం నాగేందర్‌‌‌‌‌‌‌‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టి, సుదీర్ఘ వాదననలు విన్న జస్టిస్‌‌‌‌‌‌‌‌ బి.విజయ్‌‌‌‌‌‌‌‌సేన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి..

గత నెల 10న తీర్పు రిజర్వు చేశారు. సోమవారం 51 పేజీలతో తీర్పు వెలువరించారు. ‘‘ప్రతి వ్యవస్థ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌‌‌‌‌‌‌‌ నిర్ణయం తీసుకోకపోతే ఎంతకాలం న్యాయ సమీక్ష చేయకుండా వేచి ఉండాలన్న ప్రశ్న తలెత్తుతుంది. సభ గడువు ముగిసే దాకా ఐదేండ్లు వేచి ఉండాలని చెప్పలేరు. సభ కాలపరిమితి ముగిసేదాకా స్పీకర్‌‌‌‌‌‌‌‌ మౌనంగా ఉన్నా కోర్టులు మౌనంగా ఉండవు. స్పీకర్‌‌‌‌‌‌‌‌ రాజ్యాంగ, గౌరవ హోదాను దృష్టిలో ఉంచుకుని స్పీకర్‌‌‌‌‌‌‌‌ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశాం” అని తీర్పులో పేర్కొన్నారు. 

ఇవీ వాదనలు.. 

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘‘బీఆర్ఎస్ తరఫున​ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్‌‌‌‌‌‌‌‌ రాజీనామా చేయకుండానే మరో పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అంతేకాకుండా మూడింట రెండొంతుల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన వెంట వస్తారని ప్రకటించారు. అందువల్ల ఈ పిటిషన్లపై జాప్యం జరిగితే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ఈ సమయంలో కోర్టులు జోక్యం చేసుకోకపోతే ప్రజాస్వామ్యానికి మచ్చ ఏర్పడుతుంది. అంతేకాకుండా పార్టీ ఫిరాయింపులు ఒక వ్యాపారంలా మారుతాయి” అని అన్నారు.

అడ్వొకేట్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ వాదనలు వినిపిస్తూ.. ‘‘కోర్టులు స్పీకర్‌‌‌‌‌‌‌‌కు ఉత్తర్వులు ఇవ్వలేవు. స్పీకర్‌‌‌‌‌‌‌‌ నిర్ణయం తీసుకునేదాకా వేచి చూడాల్సి ఉంటుంది” అని అన్నారు. ఈ సందర్భంగా ఎ.ఎ.సంపత్‌‌‌‌‌‌‌‌కుమార్, కేశం మెగాచంద్ర కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. ఒక్కో కేసులో ఒక్కో రకమైన పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. ‘‘అసెంబ్లీ కాల పరిమితి ముగిసే దాకా స్పీకర్‌‌‌‌‌‌‌‌ నిర్ణయం తీసుకోకపోతే పిటిషనర్లకు మరో ప్రత్యామ్నాయం ఉండదు.

ఏప్రిల్, జులైలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆగస్టులో వాదనలు ముగిశాయి. కానీ అనర్హత పిటిషన్లు ఏ దశలో ఉన్నాయో ఎలాంటి సమాచారం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పిటిషనర్లు ఉపశమనానికి అర్హులే. అందువల్ల అనర్హత పిటిషన్లపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలి. ఆలోగా విచారణ షెడ్యూల్ ను రూపొందించాలి. ఆ పిటిషన్లను స్పీకర్ కార్యాలయ కార్యదర్శి ఆయన ముందుంచాలి” అని ఆదేశించింది. లేదంటే సుమోటోగా తీసుకుని, తామే విచారణ చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ విచారణను ముగించింది.