పాలన తడబడుతోంది..సరి చూసుకోండి!

తెలంగాణ రాష్ట్రం 2014లో  ఆవిర్భవించింది.  మొదటి  పది సంవత్సరాలు రాష్ట్రంలో పాలన సాగించిన  బీఆర్ఎస్  ప్రభుత్వం అన్ని రంగాలను విధ్వంసం చేసింది.  రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో దించింది.  అప్రజాస్వామిక,  నియంతృత్వ పాలన సాగించి ప్రజలకు దూరమైంది.  ఫలితంగానే 2023 నవంబర్​లో జరిగిన ఎన్నికలలో ఆ పార్టీని  తెలంగాణ ప్రజలు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.  ఎన్నికలలో  కేసీఆర్​ ప్రభుత్వ ఓటమికి ఆయన అనుసరించిన విధానాలు ప్రధాన కారణమైనా,  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు,  ఇతర హామీలు కూడా ఓటింగ్ సమయంలో ప్రజలు  మార్పువైపు ఆలోచించడంలో ప్రభావం చూపాయి.  2023 డిసెంబర్ 7 నుంచి  పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి  రేవంత్ ప్రభుత్వం  తొలిదశలో  రాష్ట్ర  ప్రజలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం కలిగించేలా ప్రగతి భవన్​ను  ప్రజావాణి కేంద్రంగా మార్చింది.  ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు తొలగించడం, గ్రామస్థాయికి  అధికారులు వెళ్లి  ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవడం లాంటి చర్యలు చేపట్టింది.  

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం,  పేద, మధ్యతరగతి  కుటుంబాలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్  సరఫరా,  ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపులాంటి చర్యలు  ప్రజలలో ప్రభుత్వ పాలనపై  ఒక పాజిటివ్  దృక్పథాన్ని కల్పించాయి. అలాగే  రాష్ట్ర  ఆర్థిక పరిస్థితిపై,  విద్యుత్,  సాగునీటి  రంగాలపై,  ముఖ్యంగా  కాళేశ్వరంపై  విడుదల చేసిన శ్వేతపత్రాలు  కూడా  గత ప్రభుత్వం తప్పులను, నేరాలను  ప్రజలకు అర్థమయ్యేలా చేశాయి.  కేసీఆర్​ పాలనా వైఫల్యాలను, అవినీతిని ఈ పత్రాలు బయటపెట్టాయి. ఇల్లు లేని పేద  కుటుంబాలకు ఐదు లక్షలతో ఇంటి నిర్మాణం పథకాన్ని ప్రారంభించినా అది పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలలో అమలుకావడం లేదు.  అయితే, అప్పటికే  నిర్మాణం పూర్తయిన డబుల్  బెడ్ రూమ్  ఇండ్లను అన్నిచోట్లా అర్హులను ఎంపిక చేసి మొదటి 100 రోజులలోనే  పంపిణీ చేపట్టి ఉంటే బాగుండేది. 

ప్రజల మెడపై కేసు కత్తి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక నిర్మల్ జిల్లా దిలావర్ పూర్​లో కూడా ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడిన రెండు గ్రామాల  ప్రజలపై (70 మందిపై) పోలీసులు హత్యా ప్రయత్నం సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.  ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకులు కూడా ఈ  కేసుపై రాష్ట్ర ముఖ్యమంత్రిని కలసి వివరించి కేసులు ఎత్తేయాలని కోరారు. ఈ  కేసుల్లో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు  చేయకపోయినా,  ప్రజల మెడపై  కేసు కత్తి వేలాడుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో  కొత్త పారిశ్రామిక విధానాలను తయారు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న తరుణంలో  ఫార్మా, ఇథనాల్, ఇతర కాలుష్య కారక పరిశ్రమలపై లోతైన సమీక్ష  చేయాల్సి ఉంటుంది. 

స్థానికులకే ఉద్యోగ, ఉపాధి లభించాలి

రాష్ట్రంలో వస్తున్న పరిశ్రమలు, సంస్థలు కాలుష్యం వెదజల్లకుండా ఉండడం,  ఆయా సంస్థలలో  స్థానికులకే ఉద్యోగాల కల్పన,  ఆయా సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు, కార్మికులకు  కార్మిక చట్టాల అమలు, ఈ  పరిశ్రమలలో ఉపయోగించే ముడి సరుకులను ఉత్పత్తి చేసే స్థానిక రైతులు,  ఇతర ఉత్పత్తిదారులకు లేదా ప్రభుత్వ అధీనంలో ఉండే ఖనిజాలు, ఇసుక, నీళ్లు, భూమిలాంటి  సహజ వనరులకు న్యాయమైన ధరలు అందడం లక్ష్యంగా కొత్త పారిశ్రామిక విధానం ఉండాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎంత ఆర్థిక సహకారం అందించినా, పెద్ద కార్పొరేట్ సంస్థల రవాణా అవసరాలకు తప్ప,  రాష్ట్ర ప్రజల నిజమైన అవసరాలకు రీజనల్ రింగ్ రోడ్డు అవసరమా అన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి.  ఈ రింగ్ రోడ్లు  రాష్ట్రంలో  వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మార్చడం  తప్ప రాష్ట్ర ప్రజల జీవనోపాధులకు పెద్దగా  ఉపయోగపడడం లేదు. పైగా భూముల విలువలు బాగా పెరిగిన నేపథ్యంలో రైతులకు  తక్కువ పరిహారం చెల్లించి భూములు లాక్కోవడం అన్యాయం.  వరంగల్ జిల్లాలో గ్రీన్ ఎక్స్​ప్రెస్​ హైవే కోసం భూ సేకరణ చేస్తూ రైతులకు సరైన పరిహారం చెల్లించకపోవడం చూస్తున్నాం.  ఇదే రీజనల్ రింగ్ రోడ్డు విషయంలోనూ పునరావృతం అయ్యే అవకాశం ఉంది.  

మరిన్ని మార్పులు చేసుకోవాలి

కేసీఆర్​ ప్రభుత్వం పదేండ్ల పాలనా కాలంలో  తెలంగాణలో ప్రజాపక్ష  మేధావులు  ప్రొఫెసర్స్ హరగోపాల్,  పద్మజా షా,  ఖాసింలతో పాటు,  డాక్టర్ గోపీనాథ్, ఎన్. వేణుగోపాల్,  వి.సంధ్య  సహా  అనేకమంది  ప్రజా సంఘాల కార్యకర్తలపై  ‘ఉపా’ కేసులు నమోదు చేసింది.  కేసీఆర్​ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు సహా,  కొత్త ప్రభుత్వ కాలంలో జరిగిన ఘటనలన్నిటినీ లోతుగా పరిశీలించి రివ్యూ చేయాలి.  కేసులు ఎత్తేయాలని,  ప్రజాస్వామిక హక్కులను కాపాడడానికి అక్రమ కేసులు బనాయించకుండా పోలీసులను అదుపు చేయాలని కాంగ్రెస్  ​ప్రభుత్వాన్ని పౌర సమాజ బృందాల సభ్యులు ఇప్పటికే  కోరి ఉన్నారు. కానీ,  అటువైపు ఎటువంటి అడుగులు పడుతున్నాయో ఇంకా స్పష్టత రాలేదు.  ఇప్పటివరకూ పేర్కొన్న అన్ని అంశాలను  రాష్ట్ర  ప్రభుత్వం  సద్విమర్శగా  తీసుకుని  తమ పాలనలో మరిన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరముంది.  

ఉద్యమ నేతలపై కేసీఆర్​ ఉక్కుపాదం

పారిశ్రామిక రంగంలో కాలుష్య భరితమైన ఫార్మా సిటీ రద్దు ప్రకటన ప్రజలకు సంతోషాన్ని ఇచ్చింది. కానీ, అదే నోటితో రాష్ట్రంలో చాలా చోట్ల ఫార్మా విలేజెస్  ఏర్పాటు చేస్తామనే  ప్రకటన నిరాశనూ కల్గించింది.  కాలుష్యం ఒక దగ్గర  కేంద్రీకరించి ఉన్నా, వివిధ చోట్లకు విస్తరించినా అది కాలుష్యమే.  రాష్ట్రంలో వరి బియ్యం ఆధారంగా 15 చోట్ల  ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు గత  ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.  నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు గ్రామంలో ఉత్పత్తి  ప్రారంభించిన ఈ పరిశ్రమ  విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లడంతో అక్కడి ప్రజలు ఆ పరిశ్రమను  తొలగించాలని సంవత్సరం పాటు ఉద్యమించారు. ఆ ఉద్యమంపై నిర్బంధం  ప్రయోగించిన కేసీఆర్  ప్రభుత్వం ఉద్యమ నాయకులను చిత్రహింసలు పెట్టి  జైళ్లకు పంపింది.  కనీసం 100 మంది గ్రామీణ ప్రజలపై హత్యా ప్రయత్నం కింద కేసులు నమోదు చేసింది.  కేసీఆర్​ నిర్బంధ విధానాలను ఎండగట్టిన ఈ ప్రాంత ప్రజలు బీఆర్ఎస్​ పార్టీని శాసనసభ ఎన్నికలలో ఓడించడానికి కృషి చేశారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2024 జనవరిలో చిత్తనూరు ప్రజలు  ఎటువంటి ఆందోళనలు చేపట్టకపోయినా, ఆ ఉద్యమ నాయకులు నలుగురిపై  పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఈ  ఘటన  ప్రస్తుత ప్రభుత్వంపై  ప్రజల అంచనాలను మార్చేసింది.

మారని పోలీసుల వ్యవహార శైలి   

ఎన్నికల సందర్భంగా ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని 7వ గ్యారంటీగా ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం , ప్రజలకు, ప్రజాసంఘాలకు ఉండే  ప్రజాస్వామిక హక్కులను హరిస్తున్న  పోలీసులను అదుపు చేయలేక ఇంకా తడబడుతూనే ఉంది. ప్రొఫెసర్  హరగోపాల్  వస్తున్నాడనే  కారణంగా  పౌర హక్కుల సంఘం  మహాసభల  సందర్భంగా ఊరేగింపు అనుమతి నిరాకరించడం, బహిరంగంగా  ప్రజా క్షేత్రంలో పనిచేస్తున్న  న్యూ డెమోక్రసీ పార్టీని  నిషేధిత పార్టీగా ఒక జిల్లా పోలీసు అధికారులు ప్రకటించడం,  వరంగల్  కాకతీయ యూనివర్సిటీలో  సెక్యులర్  రైటర్స్ ఫోరం  సమూహ  ఆధ్వర్యంలో రచయితలు,  కవులు, కళాకారులు  సమావేశం ఏర్పాటు చేసుకుంటే,  హిందూత్వ అరాచక శక్తులు గొడవ చేసి,  రచయితలను  కొట్టి వెళ్లగొడితే ఇంతవరకూ వారిలో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్టు చేయలేదు.  పైగా  దాడికి గురైన రచయితలపైనే కేసులు నమోదు చేసి వరంగల్ పోలీసులు నోటీసులు పంపారు. ఇవన్నీ ప్రభుత్వం మారినా, మారని పోలీసుల వ్యవహార శైలికి అద్దం పడుతున్నాయి.  

- కన్నెగంటి రవి, 
తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ