తెలంగాణలో గ్రీన్ బెంచ్?.. లేదా రాష్ట్ర స్థాయి గ్రీన్ ట్రిబ్యూనల్!

 

  •  కాలుష్యం, చెరువుల కేసులకు సత్వర పరిష్కారం
  •  నీటివనరులపై హైకోర్టు నియమించిన కమిటీ నివేదికలో వెల్లడి
  •  13 చెరువుల్లో 1,100 ఆక్రమణలను గుర్తింపు
  • ఎఫ్టీఎల్ పై అధ్యయనం అవసరమని వెల్లడి

హైదరాబాద్: నీటి వనరుల సంరక్షణ, కాలుష్యం, పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు ఎన్జీటీ తరహాలో రాష్ట్రంలో గ్రీన్ బెంచ్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ఈ తరహా బెంచ్ లు ఉన్నాయి. చెరువులు, కుంటలు, నీటి వనరుల ఆక్రమణలపై హైకోర్టుకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో దీనిపై ఉన్నత న్యాయస్థానం కమిటీ వేసింది. ఈ కమిటీ 13 నీటి వనరులను పరిశీలించి ఎఫ్టీఎల్, బఫర్  జోన్లలో 1,100 అక్రమ నిర్మాణాలు జరిగినట్టు నిర్ధారించింది. ఈ క్రమంలో పర్యావరణ కేసుల పరిష్కారానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ తరహాలో రాష్ట్ర స్థాయిలో గ్రీన్ ట్రిబ్యూనల్ లేదా ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయవచ్చని తెలిపింది. 

పట్టాదారులకు నోటీసులు ఇచ్చే ముందు ఎఫ్టీఎల్ పై శాస్త్రీయ అధ్యయనం జరగాలని సూచించింది. గ్రీన్ బెంచ్ ఏర్పాటుకు తెలంగాణ హైకోర్టు సానుకూలంగా ఉందని తెలంగాణ డిప్యూటీ సొలిసిటర్  జనరల్ గాడి ప్రవీణ్​ కుమార్ మీడియాకు తెలిపారు. ముఖ్యంగా కాలుష్యం, ఇతర  సమస్యలను పరిష్కరించేందుకు ఈ బెంచ్ వారానికి రెండు, మూడు సార్లు విచారణ చేపట్ట వచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రవీణ్ కుమార్ కమిటీ సభ్యులలో ఒకరు.  గత మార్చిలో నీటివనరుల్లో ఆక్రమణలు, వాటి స్థితిగతులపై హైకోర్టుకు కమిటీ నివేదిక సమర్పించింది.