మూసీ రివర్​ బెడ్​లో సర్వే షురూ

  • అక్కడి వాళ్లను ఒప్పించి.. ఖాళీ చేయిస్తున్న స్పెషల్​ టీమ్స్​
  • డబుల్​ బెడ్రూం ఇండ్లకు 11 కుటుంబాల తరలింపు
  • గండిపేట్​ ఏరియాలో 32 షెడ్లను స్వచ్ఛందంగా కూల్చేసుకున్న నిర్వాహకులు
  • వారంలోనే రివర్​ బెడ్​ ఏరియాలో కూల్చివేతలు?

హైదరాబాద్ సిటీ/ ఎల్బీనగర్, వెలుగు : మూసీ రివర్​ బెడ్​లో స్పెషల్​ టీమ్స్​  సర్వే మొదలైంది. అక్కడ నివసిస్తున్న వాళ్ల వివరాలు తెలుసుకొని,  వాళ్లను ఖాళీ చేసేలా ఒప్పించడంతో పాటు వాళ్ల ఇండ్లకు మార్కింగ్​చేసే పనిలో టీమ్స్​ నిమ్నగమయ్యాయి. తొలిరోజు గురువారం రివర్​ బెడ్​ ఏరియాల్లోని పలు ఇండ్లకు టీమ్స్​లోని అధికారులు మార్కింగ్​ చేశారు. ఇక్కడి వారికి ప్రభుత్వం ఇచ్చే డబుల్​ బెడ్రూం ఇండ్ల గురించి వివరించారు. 

ఇక్కడ ఉంటే వరదలతో సమస్యలు వస్తాయని, ఇప్పటికే ఎన్నోసార్లు తిప్పలు పడ్డారని.. డబుల్​ బెడ్రూం ఇండ్లలోకి వెళ్లాలని అవగాహన కల్పించారు. వరద ముప్పు నుంచి హైదరాబాద్​ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా ఉప్పల్​మండలంలోని రివర్​ బెడ్​ ఏరియాలో అధికారులు ఒక అడుగు ముందుకువేసి.. పదకొండు కుటుంబాలకు వనస్థలిపురంలోని డబుల్​బెడ్రూం ఇండ్ల  తాళాలు కూడా అప్పగించారు. వారిని ఒప్పించి, రివర్​ బెడ్​ ఏరియా నుంచి ఖాళీ చేయించి డబుల్​ బెడ్రూం ఇండ్లలో గృహ ప్రవేశం చేయించారు.  

ఉదయం 9 గంటలకే ఫీల్డ్​లోకి..

సర్వే కోసం మొత్తం 25 టీమ్స్​ఏర్పాటు చేయగా.. ఇందులో హైదరాబాద్ జిల్లా పరిధిలో 16, రంగారెడ్డి జిల్లా పరిధిలో 4, మేడ్చల్ మల్కాజ్​గిరి​జిల్లా పరిధిలో ఐదు టీమ్స్ పనిచేస్తున్నాయి. మూసీ రివర్​బెడ్​లో నిర్మాణాలు అధికంగా ఉన్న బహదూర్​పురాలో ఐదు టీమ్స్, హిమాయత్​నగర్​లో మూడు టీమ్స్, నాంపల్లిలో మూడు టీమ్స్ పని చేస్తున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకే ఫీల్డ్​పైకి వెళ్లిన టీమ్​లోని అధికారులు ప్రతి ఇల్లు తిరుగుతూ ‘ఆర్బీఎక్స్’ మార్క్​వేశారు. యజమానులతో మాట్లాడుతూ ‘‘సొంత ఇల్లా? కిరాయికి ఉంటున్నారా? ఎన్నేండ్ల నుంచి ఉంటున్నారు? 

ఎంతమంది ఉంటున్నారు? ఆధార్ కార్డ్, రేషన్​కార్డ్, కరెంట్ బిల్లు, ఇంటి పేపర్లు, యజమాని ఎవరు?’’ అని అడుగుతూ డాక్యూమెంట్లు పరిశీలిస్తూ వివరాలు నమోదు చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లాలో 1,071 ఇండ్లు, కమర్షియల్​కట్టడాలుండగా.. గురువారం 780 ఇండ్లకు మార్కింగ్​చేశారు. మేడ్చల్​మల్కాజ్​గిరి జిల్లాలో 239 ఇండ్లు ఉండగా 75 ఇండ్లకు, రంగారెడ్డి జిల్లాలో 332 ఇండ్లు ఉండగా రాజేంద్రనగర్​మండలంలో 150 ఇండ్లకు మార్క్​చేశారు. ఇక్కడ 32 షెడ్లను నిర్వాహకులే స్వయంగా తొలగించుకున్నారు. 

ఇల్లెక్కడ కావాల్నో చెప్పాలంటూ..!

‘‘ఇప్పుడు ఉంటున్న ఇండ్లకు వరదల ముప్పు ఉంటుంది. ఎప్పటికైనా నివాసాలకు అనువుగా ఉండదు. డబుల్​బెడ్రూం ఇండ్లు ఇస్తాం తీసుకోండి. ఏ ప్రాంతంలోని డబుల్​బెడ్రూం ఇల్లు కావాలన్నా ఇస్తాం. సెలెక్ట్​చేసుకోండి’’ అంటూ చాయిస్​కూడా అధికారులు ఇస్తున్నారు. సామాన్లు ఖాళీ చేయడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పనిలేదని, ట్రాన్స్​పోర్టు ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల విషయంలో పోటీ ఉంటే డ్రాను కూడా మీతోనే తీయిస్తామని వారికి చెప్తున్నారు.  

డబుల్​బెడ్రూం ఇండ్లలోకి  11 కుటుంబాలు 

మేడ్చల్​మల్కాజిగిరి జిల్లా కొత్తపేట భవానినగర్ రోడ్​నంబర్​10లో ఉంటున్న పదకొండు కుటుంబాలను జిల్లా అడిషనల్ కలెక్టర్​విజయేందర్ రెడ్డి, అధికారులు ఒప్పించి వనస్థలిపురంలోని డబుల్​బెడ్రూం ఇండ్లలోకి వెళ్లేలా చేశారు. డీసీఎం వ్యాన్లు తెప్పించి వాళ్ల సామాన్లను డబుల్​బెడ్రూం ఇండ్లలోకి షిఫ్ట్ చేశారు. రివర్​బెడ్​లో ఉంటున్న కుటుంబాలను  సాధ్యమైనంత వరకు ఒప్పించి తరలిస్తామని విజయేందర్​రెడ్డి తెలిపారు. అలా రానివారి గురించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని, తర్వాత ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామన్నారు.  

స్వచ్ఛందంగా తొలగించుకున్నారుగండిపేట్​శివపురికాలనీలో రివర్​బెడ్​పరిధిలో నిర్మించిన 32 షెడ్లను స్వయంగా నిర్వాహకులే తొలగించుకున్నారు. గురువారం అధికారులు రివర్​బెడ్​పరిధిలో సర్వే నిర్వహిస్తున్న క్రమంలో వాటిని తొలగించేశారు. ఈ షెడ్లలో కార్​రిపేరింగ్ వంటి షెడ్లు ఉన్నాయి. 

వారంలో కూల్చివేతలు?  

మూసీ రివర్ బెడ్​లో ఉంటున్నవారిని డబుల్​బెడ్రూం ఇండ్లలోకి తరలించే ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. ప్రాథమిక సర్వేలో రివర్​బెడ్​లో 2,166 ఇండ్లను గుర్తించారు. ప్రస్తుత సర్వేలో ఆ ఇండ్లకు మార్కింగ్ ​చేస్తూ రీ చెక్​ చేసుకుంటున్నారు. శనివారం వరకూ సర్వే చేస్తారని అనుకున్నా శుక్రవారం నాటికే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని బట్టి వారంలో అందరినీ డబుల్​బెడ్రూం ఇండ్లలోకి తరలించి, రివర్​ బెడ్​లోని ఇండ్ల కూల్చివేత పనులు మొదలుపెట్టే  చాన్స్​ ఉంది. 

బఫర్​జోన్ ​వాసుల ఆందోళన  

రివర్​ బెడ్​ ఏరియాలో అధికారులు సర్వే చేస్తుంటే.. బఫర్​ జోన్​లోని కొందరు అక్కడికి వచ్చి ఆందోళన నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా చైతన్యపురిలోని సత్యానగర్ కాలనీలో ఉన్న మూసీ రివర్​బెడ్​ప్రాంతంలో సర్వేకు వెళ్లిన అధికారులను, సిబ్బందిని బఫర్​జోన్​లోని స్థానికులు అడ్డుకున్నారు. వెంట తీసుకువెళ్లిన రంగుల డబ్బాను గుంజుకున్నారు. అధికారులు రాసుకున్న పేపర్లను చింపేశారు. ఏండ్ల నుంచి ఇక్కడ ఉంటున్న తమను ఖాళీ చేయండంటే ఎట్ల అని ప్రశ్నించారు. లక్షలు పెట్టి ఇండ్లు కట్టుకున్నామని, ఎలా వదిలేస్తామన్నారు. దీంతో అధికారులు.. 

ప్రస్తుతం రివర్​బెడ్​పరిధిలో మాత్రమే సర్వే చేస్తున్నామని, బఫర్​జోన్​కు సంబంధించిన సర్వే స్టార్ట్​ కాలేదని వివరించారు. ఎవరికీ అన్యాయం జరగదని, బఫర్​జోన్​లో ఉన్నవారికి నష్టపరిహారంతో పాటు డబుల్​బెడ్రూం ఇండ్లు కూడా ప్రభుత్వం ఇస్తుందని నచ్చజెప్పారు. రాజేంద్ర నగర్ ఏరియాలో కూడా బఫర్​జోన్​లో ఉన్నవారు ఆందోళనకు దిగగా అధికారులు అర్థమయ్యేలా చెప్పడంతో ఆందోళన విరమించారు.  

రివర్​బెడ్ ​వాళ్లకు కూడా నష్ట పరిహారమివ్వాలి 

ఐదారేండ్ల కింద ఈ జాగను వేరే వ్యక్తి నుంచి కొన్న. కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఈ మధ్యే ఇల్లు కూడా కట్టుకున్న. ప్రస్తుతం మా ఇంట్లో నాలుగు ఫ్యామిలీలుంటున్నయ్​.  ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తే సరిపోదు. భూమి కొనుక్కుని ఇల్లు కట్టుకున్న వారికి ఇల్లుతో పాటు నష్టపరిహారం కూడా ఇవ్వాలి.  

- ఇస్మాయిల్ (చాదర్​ఘాట్, చోటా బ్రిడ్జి, రివర్​ బెడ్​ ఏరియా)

మూడు ఫ్యామిలీలున్నయ్..మూడు ఇండ్లు ఇవ్వండి

18 ఏండ్ల నుంచి ఇక్కడే ఉంటున్నం. రెవెన్యూ ఆఫీసర్లు వచ్చి ఆధార్, రేషన్, ఇతర డాక్యుమెం ట్స్ చూశారు. నాకు ముగ్గురు కొడుకులున్నారు. అందరికీ పెండ్లయి పిల్లలున్నారు. అందరికీ సెప రేట్​ రేషన్​కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో రూములో ఒక్కో ఫ్యామిలీ ఉంటున్నది. అధికారు లు ఒకటే డబుల్ బెడ్రూం ఇస్తాం.. ఖాళీ చేయం డని చెప్తున్నారు. ఒక్క ఇంట్లో 3 ఫ్యామిలీలతో ఎలా ఉండాలి. మూడు ఇండ్లు ఇస్తేనే పోతాం. 

- మాలతి పాండే (వినాయక వీధి, ఛాదర్​ఘాట్, రివర్​ బెడ్​ ఏరియా)