కేశవాపూర్​ ప్రాజెక్టుకు బ్రేక్​.. మేఘా కాంట్రాక్టు రద్దు

  • ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
  • ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 5,461 కోట్లకు పెంచాలన్న మేఘా కంపెనీ
  • తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటిదాకా పనులు చేయకపోవడంపై సీరియస్​
  • గత బీఆర్​ఎస్​ పాలనలోనే టెండర్లు దక్కించుకున్న మేఘా
  • ఆర్థిక భారం, ఎక్కువ స్టేజీల్లో పంప్​హౌస్​లు ఉండటంతో రద్దు చేసిన ప్రభుత్వం
  • తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు పూర్తయ్యేలా రీ రూట్​
  • కొండపోచమ్మసాగర్​కు బదులు మల్లన్నసాగర్​ నుంచి నీటి తరలింపు!
  • త్వరలో టెండర్లు పిలవాలని వాటర్ ​బోర్డుకు సీఎం ఆదేశాలు

హైదరాబాద్​, వెలుగు: కేశవాపూర్​ ప్రాజెక్టు​ను, ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం మేఘా సంస్థకు గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం కట్టబెట్టిన కాంట్రాక్టునూ రాష్ట్ర సర్కార్​ రద్దు చేసింది. ఆర్థిక భారం, ఎక్కువ స్టేజీల్లో  పంప్​హౌస్​లు ఉండడంతో ఆ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి 2017 అక్టోబర్​లోనే నాటి బీఆర్​ఎస్​ సర్కారు కేశవాపూర్​ ప్రాజెక్టు కోసం రూ.4,777.59 కోట్లతో పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. కొండపోచమ్మసాగర్​ నుంచి కేశవాపూర్​ రిజర్వాయర్​కు.. అక్కడి నుంచి ఐదు స్టేజీల్లో హిమాయత్​సాగర్​, ఉస్మాన్​సాగర్​ను నింపాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టు 2017 నవంబర్​ 9న ఒకసారి, అదే ఏడాది డిసెంబర్​ 28న రెండోసారి టెండర్లను పిలిచారు. 2018 ఫిబ్రవరి 3న మేఘా సంస్థకు అప్పటి ప్రభుత్వం టెండర్​ అప్పగించింది. కానీ, పలు కారణాలతో ఇన్నేండ్లు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. కేశవాపూర్​కు నీటిని తరలించే స్లూయిస్​ల వరకు పనులు చేసినా.. మిగతా పనులేవీ మొదలు కాలేదు. భూసేకరణ చిక్కులతో పాటు అలైన్మెంట్ తీరు వల్ల పనులు ముందుకు సాగలేదు. 

గత ప్రభుత్వం అటవీ భూములు, రక్షణ శాఖ భూముల నుంచి ప్రాజెక్టును డిజైన్ చేయడం, ఎంచుకున్న పైపులైన్ రూట్ సరిగ్గా లేకపోవటంతో  పనులు జరగలేదు. దీంతో తాజాగా మేఘా సంస్థ ఆ ప్రాజెక్టు ఖర్చుల విషయంలో మెలిక పెట్టింది. 2017 నాటి ధరలతో పనులు చేయలేమని, 2024 ధరలకు తగ్గట్టు వ్యయాలను సర్దుబాటు చేయాలని కాంగ్రెస్​ సర్కారుకు లేఖ రాసింది. అంచనా వ్యయాన్ని రూ.5,461 కోట్లకు పెంచాలని లేఖలో పేర్కొంది. అయితే, రాష్ట్ర సర్కారు అందుకు ఒప్పుకోలేదు. ఇప్పటిదాకా పనులు చేయకపోవడంపైనా మేఘా సంస్థపై సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టుతో పాటు మేఘా కాంట్రాక్ట్​నూ సంస్థ రద్దు చేసింది. తాజా నిర్ణయంతో ప్రభుత్వానికి రూ.2 వేల కోట్లు ఆదా అవుతాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రాజెక్టు, కాంట్రాక్టు రద్దుపై మున్సిపల్​, పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీ దాన కిషోర్​ ఉత్తర్వులు జారీ చేశారు. 

రీ రూట్​తో తగ్గనున్న భారం

కేశవాపూర్​ ప్రాజెక్టుకు బదులుగా తక్కువ ఖర్చుతో పూర్తయ్యేలా గోదావరి ఫేజ్​ 2 ప్రాజెక్ట్​లో భాగంగా మల్లన్నసాగర్​ నుంచి ఆ ప్రాజెక్టును రీరూట్​ చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్​ సిటీకి 10 టీఎంసీల తాగునీటిని సరఫరా చేయడంతో పాటు మూసీ పునరుజ్జీవం కోసం జంట జలాశయాల (హిమాయత్​సాగర్​, ఉస్మాన్​సాగర్​)కు 5 టీఎంసీల నీటిని మల్లన్నసాగర్​ నుంచి తరలించాలని డిసైడ్​ అయింది. ఆ పనులకు సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవాలని హైదరాబాద్​ వాటర్​ బోర్డు అధికారులను సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు. కొండపోచమ్మసాగర్​ నుంచి తరలించడంతో పోలిస్తే మల్లన్నసాగర్​ నుంచి నీటి తరలింపు సులభం కానుంది. కొండపోచమ్మసాగర్​ నుంచి ఐదు పంప్​హౌస్​లను నిర్మించాల్సి వస్తున్నది. అదే మల్లన్నసాగర్​ నుంచి తరలిస్తే కేవలం రెండు స్టేజీల్లోనే నీటిని తరలించుకునేందుకు వీలుంది. తద్వారా ఖర్చు, కరెంట్​ చార్జీల భారం చాలా వరకు తగ్గనుంది.  

  కొండపోచమ్మ సాగర్​ నుంచి తరలించే కేశవాపూర్​ ప్రాజెక్టులో స్లూయిస్​ లెవెల్​ 605 మీటర్ల వద్దే 7 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటాయి. పైగా అక్కారం, మర్కూరు, కొండపోచమ్మసాగర్​, బొమ్రాసిపేట, ఘన్పూర్​ వంటి 5 చోట్ల నీటిని పంపింగ్​ చేయాల్సి వస్తున్నది. ఆ రిజర్వాయర్​లో పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం కూడా 15 టీఎంసీలే. కానీ, మల్లన్నసాగర్​ నుంచి నీటిని కేవలం రెండు స్టేజీల్లో అంటే మల్లన్నసాగర్​, ఘన్​పూర్​ వద్ద పంపింగ్​ చేసి నీటిని తరలించేందుకు అవకాశం ఏర్పడుతుంది. రిజర్వాయర్​ సామర్థ్యం 50 టీఎంసీలుండడం.. స్లూయిస్​ లెవెల్​ 517 మీటర్ల వద్ద నుంచి నీటిని తీసుకెళ్లేందుకు వీలుండడంతో డెడ్​ స్టోరేజీలోనూ నీటి తరలింపు సులభమవుతుంది. 

 కొండపోచమ్మసాగర్​తో పోలిస్తే మల్లన్నసాగర్​ నుంచి సిటీకి నీటిని తరలించడం ద్వారా పైప్​లైన్ల పొడవు పెరగనుంది. కొండపోచమ్మసాగర్​ నుంచి చేపట్టే కేశవాపూర్​ ప్రాజెక్టుకు 71.9 కిలోమీటర్ల పొడవైన పైప్​లైన్లు వేయాల్సి వస్తుండగా.. మల్లన్నసాగర్​ ద్వారా చేపట్టే ప్రాజెక్టుకు 149.25 కిలోమీటర్ల మేర పైప్​లైన్లు వేయాల్సి ఉంటుంది. 50 కిలోమీటర్ల వరకు 36 మీటర్ల వ్యాసం ఉన్న పైపులు, కిలోమీటరున్నర వరకు 30 మీటర్లు, 40 కిలోమీటర్లు 24 మీటర్లు, 58 కిలోమీటర్ల మేర 22 మీటర్ల వ్యాసమున్న పైపులను మల్లన్నసాగర్​ ద్వారా చేపట్టే గోదావరి ఫేజ్​ 2 ప్రాజెక్టులో వాడతారు. వాటికితోడు ఉస్మాన్​సాగర్​ వద్ద 120 ఎంఎల్​డీ, హిమాయత్​సాగర్​ వద్ద 70 ఎంఎల్​డీల సామర్థ్యం ఉన్న నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. 

  మల్లన్నసాగర్​ నుంచి చేపట్టే ఈ ప్రాజెక్టుకు మొత్తంగా రూ.5,560 కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అందులో ప్యాకేజీ 1లో భాగంగా నిర్మించే మల్లన్నసాగర్​ టు ఘన్​పూర్​ స్టేజీలకు రూ.3,020 కోట్లు, ఘన్​పూర్​ నుంచి ఉస్మాన్​సాగర్​, హిమాయత్​సాగర్​లకు తరలింపునకు మరో రూ.2,540 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. అదే కేశవాపూర్​ ప్రాజెక్ట్​ ద్వారా అయితే నిర్మాణ సంస్థ పెంచాలని చెప్పిన రేట్ల ప్రకారం రూ.5,461 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే భూసేకరణ సమస్యలు అడ్డుగా మారాయి. కేశవాపూర్​ ప్రాజెక్టుకు 1615 ఎకరాల భూమి అవసరం కాగా.. రూ.135 కోట్లతో 1180 ఎకరాలను సేకరించారు. మిగతా 435 ఎకరాల విషయంలో చిక్కులు వస్తున్నాయి. చాలా మంది భూములు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. ఆ 435 ఎకరాల భూములకు రూ.130 కోట్లు చెల్లించాల్సి వచ్చేది. 

ఈ నేపథ్యంలోనే అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కేశవాపూర్​ ప్రాజెక్టును రద్దు చేసి.. మల్లన్నసాగర్​ నుంచి నీటిని తరలించాలన్న నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం గోదావరి, కృష్ణా నుంచి హైదరాబాద్​కు ఒక రోజు కిలో లీటర్​ తాగునీటి తరలింపునకు రూ.48 ఖర్చవుతుండగా.. మల్లన్నసాగర్​ నుంచి చేపట్టే ప్రాజెక్టు పూర్తయితే కేవలం రూ.4 మాత్రమే ఖర్చవుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.