తెలంగాణ ఆలయ భూముల్లో సోలార్​ ప్లాంట్లు

  • రెండు విడతలుగా ఏర్పాటుకు నిర్ణయం.. రాష్ట్రంలో ఇదే తొలిసారి 
  • మొదటి విడత 5  జిల్లాల్లోని 231 ఎకరాల్లో ప్లాంట్ల నిర్మాణం 
  • రెండో విడత 21.34 ఎకరాల్లో  ఏర్పాటుకు  ప్రణాళికలు 
  • మహిళా సంఘాలకు ఆలయ భూముల లీజ్​ 
  • మహిళలకు చేయూతనిచ్చేందుకు రుణ సదుపాయం
  • భూముల రక్షణతో పాటు విద్యుదుత్పత్తికి సర్కారు ప్లాన్

హైదరాబాద్, వెలుగు: దేవాదాయ శాఖ భూముల పరిరక్షణపై రాష్ట్ర సర్కారు దృష్టిపెట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. మరో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఆలయ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి కసరత్తు చేస్తున్నది. దీని ద్వారా దేవుడి మాన్యాలను కబ్జాదారుల చెరనుంచి రక్షించడంతోపాటు విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నది.  రాష్ట్రంలో దేవాదాయ శాఖ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. 

మొదటి విడత 5 జిల్లాల్లో 231.05 ఎకరాల్లో, రెండో విడతలో 21.34 ఎకరాల్లో  సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రణాళికలు రచించింది.  ఇప్పటికే ఆయా జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న భూమి, అక్కడ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నివేదికలు రూపొందించింది. అన్ని  నివేదికలను పరిశీలించిన ప్రభుత్వం  ఈ ప్లాంట్ల నిర్మాణానికి ముందుకొచ్చింది.  ఈ ఆలయ భూములను మహిళా సంఘాలకు లీజ్​కు ఇచ్చి సోలార్​ ప్లాంట్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తున్నది.  మహిళా సంఘాలకు ఆర్థిక భారం కాకుండా ప్రభుత్వం బ్యాంకు నుంచి రుణాలు ఇవ్వనున్నది. 

5 జిల్లాల్లో 231.05 ఎకరాల్లో..

రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, వాటి ఆదాయ వనరులను పెంచడంతోపాటు దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా  రాష్ట్రంలోనే తొలిసారిగా ఆలయ భూముల్లో సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నది.  ఇందుకోసం తొలి విడతలో ఐదు జిల్లాలను ఎంపిక చేయగా.. అందులో సిద్దిపేట, మెదక్, నిర్మల్, నిజామాబాద్, నల్లొండ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో భూములున్నాయో దేవాదాయ శాఖ ఇప్పటికే గుర్తించింది.

  5 జిల్లాల్లో వివిధ ఆలయాల  పరిధిలో మొత్తం 284.09 ఎకరాల భూమి ఉన్నట్లు తేలగా..  ఇందులో 231.05 ఎకరాల విస్తీర్ణంలో సోలార్​ప్లాంట్లను నిర్మించేందుకు రంగం  సిద్ధం చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి వివిధ సర్వే నంబర్లలో 9.06 ఎకరాల భూమి ఉండగా.. ఈ భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. మెదక్ జిల్లాలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ పరిధిలో 148.04 ఎకరాల భూమి ఉండగా..100 ఎకరాల విస్తీర్ణంలో, నిర్మల్ జిల్లాలోని బైంసా శ్రీ గోశాల ఆధ్వర్యంలో 96.36 ఎకరాల్లో, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిధిలో 9.10 ఎకరాల భూమి ఉండగా.. ఇందులో సోలార్​ప్లాంట్లను నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు. 

 నల్గొండ జిల్లా మోత్కురు మండలం బిజ్జలాపురం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 20.33 ఎకరాల భూమి ఉండగా.. ఇందులో 15.33 ఎకరాల విస్తీర్ణంలో సోలార్ ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు.  కాగా,  భూములకు 2 నుంచి 3 కిలో మీటర్ల దూరంలోనే 33/ 11కేవీ విద్యుత్ సబ్​ స్టేషన్లు ఉన్నాయి.  

మొత్తంగా 252 ఎకరాల్లో..

మొదటి, రెండో విడతల్లో 252.39 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లను నిర్మించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. మొదటి విడతలో ఐదు జిల్లాలు, రెండో విడతలో హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని భూములు గుర్తించారు. రెండు జిల్లాల్లో 21.34 ఎకరాల్లో ప్లాంట్లు నిర్మించనున్నారు.  మహబూబాబాద్​ జిల్లా తొర్రూర్​ మండలం మాటేడు​ గ్రామంలో వేణుగోపాల స్వామి  టెంపుల్

​ పరిధిలో 3.03 ఎకరాల భూమి ఉండగా.. 2 గుంటల్లో..,  ఇదే జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెంలోని అగస్తేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన 14.25 ఎకరాల్లో, మహుబూబాబాద్ పట్టణంలోని  శివాలయం టెంపుల్​కు చెందిన 3.29 ఎకరాల భూమిలో, హన్మకొండ నగరంలోని రాగన్నధర్వాజ లోని సీతారామచంద్ర స్వామి (చిన్నకోవెల)  3.00 ఎకరాల భూమిలో సోలార్​ ప్లాంట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. మొదటి విడత విజయవంతంగా పూర్తయితే, రెండో విడతలో  ఈ రెండు జిల్లాల్లోని ఆలయ భూముల్లో ఈ  కేంద్రాలు నిర్మించనున్నారు.  మొదటి, రెండు విడతలు కలిపి మొత్తం ఏడు జిల్లాల్లో 308.26 ఎకరాల భూమిని గుర్తించగా.. ఇందులో 252.39 ఎకరాల్లో సోలార్​ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.

మహిళలకు ఆర్థిక భరోసా 

దేవాదాయ శాఖ భూములను మహిళా స్వయం సహాయక సంఘాలకు లీజ్ కు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. సోలార్ ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణ కోసం సంఘాలకు ప్రభుత్వం రుణ సదుపాయం కల్పించనున్నది.  విస్తీర్ణం బట్టి ప్లాంట్లకు అయ్యే ఖర్చు మహిళా సంఘాలకు లోన్ రూపంలో  అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తితోపాటు మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తుందని  ప్రభుత్వం ఆలోచిస్తున్నది. అలాగే, ఆలయాలకు లీజ్​ రూపంలో ఆదాయం రావడంతోపాటు భూములకు రక్షణ కవచంలా సోలార్ ప్లాంట్లు ఉంటాయని భావిస్తున్నది. 

గత పాలకుల నిర్లక్ష్యం.. దేవుడి మాన్యం మాయం.. 

గత పాలకుల నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపం దేవుడి మాన్యాలకు శాపంగా మారింది.  భూముల ధరలకు రెక్కలు రావడం..   ఆలయ భూముల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో  బడాబాబులు, ప్రజా ప్రతినిధులు కొందరు వందల ఎకరాలు కబ్జా చేసి  రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. వారంతా కోట్లకు పడగలెత్తారు.  దీంతో  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దేవుడి మాన్యాలపై ప్రత్యేక ఫోకస్​ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలవారీగా ఎక్కడెక్కడ ఆలయాల భూములున్నాయి? ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి? అక్రమార్కుల చెరలో ఎన్ని ఎకరాలు ఉంది? దేవాదాయ శాఖ పరిధిలో ఎన్ని ఎకరాల భూమి ఉన్నది?  

అనే వివరాలను సేకరించింది.  రాష్ట్రవ్యాప్తంగా మొత్తం  91,827 ఎకరాలు ఉండగా.. అందులో 25 వేల ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. ఇందులో ఆరు వేల ఎకరాలు తెలంగాణ సరిహద్దు  రాష్ట్రాల్లో అన్యాక్రాంతమైనట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఇక మీదట భూములు ఆక్రమణలు గురికాకుండా ప్రత్యేక దృష్టిసారించింది.  ఇందులో భాగంగా జియోట్యాగింగ్ ప్రక్రియ చేపట్టింది. ఇప్పటి వరకూ 34,092.00 వేల ఎకరాల భూమికి జియోట్యాగింగ్ పూర్తి చేసింది.  భవిష్యత్తులో  ఆలయ భూముల జోలికి ఎవరూ రాకుండా సరికొత్త ఆలోచనకు నాంది పలికింది. ఇందులో భాగంగానే దేవాదాయ భూముల్లో సోలార్ ప్లాంట్లతోపాటు  పామాయిల్ తోటలు సాగు చేసే దిశగా కసరత్తు చేస్తున్నది.