వీసీ పోస్టుకు ఫుల్ డిమాండ్ .. 158 మంది ప్రొఫెసర్ల దరఖాస్తు

  • నేటితో ముగియనున్న వీసీ మల్లేశ్‌‌‌‌‌‌‌‌ పదవీ కాలం
  • తాత్కాలికంగా ఐఏఎస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా నియమించే చాన్స్ 
  • నెలాఖారులోగా కొత్త వీసీని ప్రకటించనున్న సర్కార్ 

కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీ వీసీ పోస్టుకు ఫుల్ డిమాండ్ నెలకొంది. వర్సిటీ వైస్ చాన్స్ లర్ గా మూడేళ్లుగా పనిచేస్తున్న ప్రొఫెసర్ సంకశాల మల్లేశ్ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. ఆయన స్థానంలో కొత్త వీసీని నియమించేందుకు ప్రభుత్వం జనవరి 27న నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.  దీంతో వర్సిటీ వీసీ పదవి కోసం రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన 158 మంది ప్రొఫెసర్లు అప్లై చేసుకున్నారు. గతంలో ఇదే యూనివర్సిటీలో వీసీలుగా, రిజిస్ట్రార్లుగా పనిచేసిన ప్రొఫెసర్లతోపాటు ఇతరులు కూడా పోటీ పడుతున్నారు. 

త్వరలో సెర్చ్ కమిటీ భేటీ

శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ఎంపిక కోసం ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురితో సెర్చ్ కమిటీని నియమించింది.  ఈసీ నామినీగా కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ సాయన్న, యూజీసీ నామినీగా మాజీ వీసీ ప్రొఫెసర్ దేవదత్ శర్మ, సీఎస్ శాంతి కుమారి సభ్యులుగా వ్యహరించనున్నారు. ఈ కమిటీ సమావేశమై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను ప్రతిపాదించి గవర్నర్ కు సిఫార్సు చేయనున్నారు. ఇందులో ఒకరి పేరును గవర్నర్ ఆమోదిస్తారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తయి కొత్త వీసీని ప్రకటించే అవకాశముంది. అయితే కొత్త వీసీ నియామకానికి మరో వారం, పది రోజులు సమయం పట్టవచ్చు. దీంతో అప్పటివరకు తాత్కాలికంగా ఐఏఎస్ ఆఫీసర్ ను ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి బాధ్యతలు అప్పగించే అవకాశముంది. 

సిఫార్సులకు యత్నాలు?

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వీసీ పోస్టులను పూర్తిగా పొలిటికల్ పోస్టులుగా మార్చారనే విమర్శలు ఉన్నాయి. అందుకే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా సమర్థులైన అడ్మినిస్ట్రేటర్, అకాడమిషియన్లను వీసీలుగా నియమించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అయినప్పటికీ కొందరు ప్రొఫెసర్లు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సిఫార్సు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.  

బీసీ వీసీ కోసం డిమాండ్..

శాతవాహన యూనివర్సిటీని నెలకొల్పాక తొలిసారి మైనార్టీ సామాజికవర్గానికి చెందిన మహ్మద్ ఇక్బాల్ అలీ, ఆ తర్వాత ఓసీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ కడారి వీరారెడ్డి, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ప్రొఫెసర్ సంకశాల మల్లేశ్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం రెగ్యులర్ వీసీలుగా నియమించింది. రెగ్యులర్ వీసీల్లో ఇప్పటివరకు బీసీలు లేరని, ఈసారైనా ఆ సామాజిక వర్గానికి కేటాయించాలనే డిమాండ్ వినిపిస్తోంది.