గుడ్ గవర్నెన్స్ దిశగా తెలంగాణ

తెలంగాణలో వేగంగా జరుగుతున్న అనేక పరిణామాలు రాజకీయాలకు సంబంధించినవి కావు. పాలనాపరమైన మార్పు కోసం రేవంత్​రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఆశ్చర్యకరంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పర్యావరణం, సరస్సుల గురించి మాట్లాడుతోంది.  రాష్ట్ర  భవిష్యత్తు, ప్రజాపాలనపై  రేవంత్​ సర్కార్​ ప్రధానంగా దృష్టి సారించింది.

దివంగత గొప్ప ఇంజినీర్ విశ్వేశ్వరయ్య ఫుల్ ట్యాంక్ లెవెల్, లేక్స్‌‌‌‌పై  ఎక్కువగా తన మాటల్లో ప్రస్తావిస్తుండేవారు. ఆకస్మికంగా అలాంటి వ్యాఖ్యలు, మాటలు తెలంగాణ రాజకీయాల్లో వినపడుతుండటంతో ప్రజల్లో ఆసక్తితోపాటు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి  నీటివనరుల పరిరక్షణ కోసం తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి  విభిన్న రాజకీయ నాయకుడిగా దేశం మొత్తం ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.

సా ధారణంగా వార్తల మాదిరిగా మంత్రి పదవులు, ఫిరాయింపులు, రాజకీయ శత్రుత్వం గురించి కాకుండా  పబ్లిక్ డిస్కోర్స్‌‌‌‌లో ఇది భిన్నమైన పరిమాణం అని చెప్పవచ్చు.  కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి పురాతన నీటివనరులు, చెరువులు, సరస్సులు పునరుద్ధరణ, వరదల నివారణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వాస్తవానికి  తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రెండింటిలోనూ వరదలు,  ప్రకృతి విపత్తులు భారీస్థాయిలో ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

జనజీవనం స్తంభించిపోతోంది. ఎడతెరిపిలేని భారీ వర్షాలతో పెల్లుబుకుతున్న వరదలతో దైనందిన జనజీవితం అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో  మనం గమనిస్తే తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దార్శనికతతో ఏం చేస్తున్నాడో అర్థం అవుతోంది.  రాజకీయ నాయకుడికి ఇది అరుదైన ప్రయాణం. రాజకీయ నాయకులు సాధారణంగా రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి సుపరిపాలనను గాలికి వదిలేస్తారు.  ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు,  వారి ఉన్నతి,  గుడ్ గవర్నెన్స్​ గురించి పట్టించుకోరు. ప్రజలు సుపరిపాలనను అంతగా పట్టించుకోరని, వారి ఓట్లను ‘ఉచితాలు’కు అమ్ముకుంటారని నేతలు ప్రధానంగా విశ్వసిస్తారు.  

ఆక్రమణలపై సీఎం రేవంత్ ఉక్కుపాదం

సాధారణంగా అధికారంలో ఉన్న  నాయకులు తమ రాజకీయ శత్రువులైన ఆక్రమణదారులపైనే ఎక్కువగా దృష్టిసారించి వారి ఆక్రమణలను తొలగిస్తారు. ఈక్రమంలో కొంతమంది రాజకీయ నాయకులు తప్పించుకుంటారు. ఎందుకంటే ఆక్రమణల తొలగింపు కొంతమంది ఓటర్లలో ఆగ్రహాన్ని సృష్టిస్తుంది. వారు పాలకులకు వ్యతిరేకంగా మారతారు. అందుకని ఆక్రమణలపై చాలామంది రాజకీయ నాయకులు ఉదాసీనంగా వ్యవహరిస్తారు. ఇదే విధానాన్ని రాజకీయ నేతలు ఎక్కువగా అనుసరిస్తారు. కాగా, 1945లో  హిట్లర్‌‌‌‌ను ఎదుర్కోవడానికి నిరాకరించిన బ్రిటిష్  ప్రధాన మంత్రి నెవిల్లే చాంబర్‌‌‌‌లైన్  ‘నిద్రపోతున్న శునకాలు అబద్ధాలను చెప్పనివ్వండి’ అన్నాడు. అంటే స్వార్థ ప్రయోజనాలకు భంగం కలిగించొద్దు లేకపోతే అవి మీపై దాడి చేస్తాయి అని అర్థం.

వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి బలమైన, ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటిపై కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ..రేవంత్ మంచి చేస్తున్నాడు. కానీ, ఆయన దూకుడు తగ్గించి నిర్ణయాలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు. వీరిలో కొంతమంది ఆక్రమణదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్నవారు కూడా ఉన్నారు.  ముఖ్యమంత్రి రేవంత్​కి ప్రముఖ హైదరాబాద్ ఎంపీ నుంచి సవాల్​ ఎదురైంది. సరస్సులపై నిర్మించిన ఆయన విద్యాసంస్థలను తాకే ధైర్యం ఉందా అని  చాలెంజ్​ చేశారు.  బదులుగా వెనక్కు తగ్గిన రేవంత్ రెడ్డి నిజాం వారసత్వాన్ని మాత్రమే కాపాడుతున్నామని అన్నారు. చెరువుల ఆక్రమణలు తొలగించి క్లియర్​అప్ చేస్తామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి చేపట్టిన చర్యల జాబితా చాలా పెద్దగా ఉంది.  కానీ, ఆయన ఒక గొప్ప మొండితనం, దూరదృష్టితో ముందుకువెళుతున్నారు. నిజాం, కాకతీయ రాజవంశాలు నీటి వనరుల పరిరక్షణపై శ్రద్ధ వహించాయి. 

సీఎం గట్టి పట్టుదల

నీటివనరుల పరిరక్షణలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డికి ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు అండగా ఉంది.  రేవంత్ రెడ్డి ఈ మంచి పనిని కొనసాగిస్తారా లేక వెనక్కి తగ్గుతారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు రేవంత్​ తన మొండి పట్టుదలతో పాటు రాజకీయ చాతుర్యం కూడా చూపించారు. కానీ, ఒక విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు. చెరువులు, సరస్సుల ఆక్రమణలను తొలగించడానికి ప్రభుత్వానికి తగినంత అధికారం ఉంది. భూకబ్జాదారులు లేదా  ఒక శక్తిమంతమైన రాజకీయ నాయకుడు సరస్సులను ఆక్రమించి కళాశాలలు ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి చేయాల్సింది విద్యాశాఖకు నోటీసులివ్వాలని ఆదేశించడమే. కోర్టులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రేవంత్ పక్షాన నిలిచాయి. సీఎం రేవంత్ రెడ్డికి పూర్తిగా సపోర్టు చేస్తున్నాయి. 

మంచిని ప్రజలెప్పుడూ సమర్థిస్తారు

మరోవైపు అవినీతికి వ్యతిరేకంగా, ఆక్రమణదారుల తొలగింపునకు ప్రజల మద్దతు కూడా సంపూర్ణంగా ఉంది. కాగా,  మోదీ ప్రభుత్వం తమపై ఈడీ, సీబీఐని ప్రయోగిస్తోందని పలువురు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ, ఈడీ లేదా సీబీఐ దాడులు చేసిన రాజకీయ నాయకులకు మద్దతుగా ప్రజలు స్పందించలేదు. సానుభూతి ప్రకటించలేదు. కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరెస్టు అయినా, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్​ జైలు పాలైనప్పుడు ఒక్కరు కూడా నిరసన వ్యక్తం చేయలేదు. ఈనేపథ్యంలో చాలామంది రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డికి జనం పెద్దఎత్తున మద్దతు పలకడంతో షాక్ అవుతున్నారు. 

సంప్రదాయ రాజకీయాలకు అతీతంగా రేవంత్​

సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫ్రీబీస్,  ఫ్యాక్షన్,  సంప్రదాయ రాజకీయాలకు అతీతంగా వెళ్తున్నారు. సహజంగానే రేవంత్ రెడ్డి తనదైన మార్క్​ సుపరిపాలన దిశగా పయనిస్తున్నారు. అతి ముఖ్యమైనది ఒక పాలకుడు అతిముఖ్యంగా చేయగలిగినది ‘గుడ్​ గవర్నెన్స్​’ ఇవ్వడం. రేవంత్ ఆ దారిలో ఉన్నాడు.  రేవంత్ పాలనాతీరు ఆయన  ఇమేజ్​ను భారీగా పెంచుతోంది. చాలామంది ముఖ్యమంత్రులు పబ్లిక్ ఖర్చుతో చార్టర్డ్ విమానాల్లో విదేశాలకు వెళ్లడం ఆసక్తికరంగా ఉంటుంది. వారంతా పదే పదే అభివృద్ధి మంత్రం చెపుతుంటారు. కానీ, వారిలో చాలామంది ప్రజాపాలనకు ప్రాముఖ్యతను ఇవ్వరు.

గుడ్​ గవర్నెన్స్​కు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో తమ ప్రాభవాన్ని కోల్పోతుంటారు. మనం  భవిష్యత్తును కచ్చితంగా అంచనా వేయలేం. అయితే, రేవంత్ రెడ్డి  ముఖ్యమంత్రిగా విభిన్న పాలన కోసం  ప్రయత్నిస్తారని నేను ఎన్నడూ ఊహించలేదు. భవిష్యత్తులో దేశంలోనే హైదరాబాద్‌‌‌‌ అతిపెద్ద నగరంగా,  ఆర్థిక కేంద్రంగా మారనుంది.  కానీ, దీనికి తగినట్లుగా  తెలంగాణ తన  పర్యావరణ  పరిరక్షణ పట్ల జాగ్రత్తగా వహించాలి.  సీఎం రేవంత్ ఆ దిశగానే ప్రయత్నిస్తున్నట్లు 
తెలుస్తోంది.

సీఎం రేవంత్​కు ప్రజామద్దతు

హైదరాబాద్‌‌‌‌లో ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన భవనం ఎన్​ కన్వెన్షన్​ను హైడ్రా కూల్చివేసింది. ఈ బుల్-డోజింగ్ దేశవ్యాప్తంగా రాజకీయనేతలతోపాటు, సినీవర్గాలు, ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది.  దీనిపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి విమర్శలకంటే ఎక్కువగా ప్రశంసలే  లభించాయి.  ప్రముఖ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర  మంత్రి ఆస్తుల కూల్చివేతపై నాయకుల్లో ఒకింత అసహనం బయటపడింది. అయితే,  రేవంత్‌‌‌‌రెడ్డి న్యాయంవైపు నిలబడ్డారని ప్రజలు గ్రహించారు. కాంగ్రెస్  నాయకుల అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేస్తుండటంతో రేవంత్​ నిబద్ధతపై ప్రజల్లో విశ్వాసం పెంచింది.

- డా. పెంటపాటి పుల్లారావు