తెలంగాణ ఆలయాల్లోని లడ్డూలకూ టెస్టులు

 

  • ప్రముఖ గుళ్లలోని నెయ్యి,  ఇతర పదార్థాల శాంపిల్స్ ల్యాబ్​కు..
     
  • తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో దేవాదాయ శాఖ అప్రమత్తం
  • అన్ని టెంపుల్స్​లో తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు
  • ఇకపై ప్రసాదాల తయారీకి విజయ నెయ్యి, పాలనే వాడాలని ఆర్డర్ 

హైదరాబాద్, వెలుగు:తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదాల తయారీలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ముందస్తు చర్యలు చేట్టింది. ఇందులో భాగంగా అన్ని ఆలయాల్లో తనిఖీలు చేపట్టాలని దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. లడ్డూలు, పులిహోర తయారీలో వాడే నెయ్యి, యాలకుల పొడి, జీడిపప్పు, చక్కెర పాకం, బూందీ  ఇతర ముడి సరుకుల నాణ్యతను పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. ఇకపై అన్ని ఆలయాల్లో ప్రసాదాల తయారీకి విజయ నెయ్యి, పాలనే వాడాలని ఆదేశాలు జారీ చేసింది. దేవాదాయ శాఖ ఆదేశాలతో ఈవోలు ఆలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నెయ్యి శాంపిల్స్ ను హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపించారు. ఇక కొన్ని ఆలయాల్లో ప్రత్యేకంగా టెస్టింగ్ కమిటీల ఆధ్వర్యంలో లడ్డూలు తయారు చేస్తున్నారు. 

ల్యాబ్​కు శాంపిల్స్.. 

రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలైన వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, హనుమకొండ భద్రకాళి ప్రసాదాల్లో వినియోగిస్తున్న నెయ్యి, ఇతర పదార్థాలను పరీక్షల కోసం ఇప్పటికే హైదరాబాద్ లోని ల్యాబ్​కు పంపించారు. వీటికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రసాదంలో వినియోగిస్తున్న నెయ్యి శాంపిల్స్ ను సేకరించి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చర్లపల్లిలోని ల్యాబ్​కు పంపించారు. టెస్టులకు సంబంధించిన నివేదిక నాలుగైదు రోజుల్లో రావొచ్చని ఆలయ ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు తెలిపారు. ఇక్కడ కొన్నేండ్లుగా మదర్​డెయిరీ నెయ్యి వాడుతున్నారు.

నెలకు సుమారు 20 వేల నుంచి 25 వేల కిలోల నెయ్యిని వినియోగిస్తున్నారు. ఇక భద్రాచలంలో ప్రసాదాల తయారీకి ప్రత్యేక కమిటీని నియమించినట్టు ఆలయ ఈవో రమాదేవి చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా నెయ్యి శాంపిల్స్ ను టెస్టులకు పంపించామని తెలిపారు. ఆలయంలో రోజూ 3 వేల నుంచి 4 వేల లడ్డూలు తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే వేములవాడ ఆలయంలో లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యిని 20 రోజుల క్రితమే పరీక్షలకు పంపించారు.

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి చాలా రోజులుగా కరీంనగర్​డెయిరీ నెయ్యిని వాడుతుండగా, దేవాదాయ శాఖ ఆదేశాలతో వారం నుంచి విజయ డెయిరీ నెయ్యిని వినియోగిస్తున్నామని ఈవో విజయరామారావు తెలిపారు. హనుమకొండలోని భద్రకాళి టెంపుల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టి, ప్రసాదాల నాణ్యతను పరిశీలించారు. శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్​కు పంపించారు.