ప్రభుత్వ ఉద్యోగుల డేటా ఆన్​లైన్​ .. కసరత్తు చేస్తున్న తెలంగాణ సర్కారు

  • ఎవరు, ఎక్కడ, ఎంతకాలం పని చేశారో తెలిసేలా ప్రత్యేక సాఫ్ట్​వేర్
  • వాళ్ల పని తీరు, రివార్డులు, రిమార్కులు తెలిసేలా ఏర్పాటు
  • హెచ్​ఆర్​ వ్యవస్థ ఏర్పాటుపైనా సమాలోచన

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డేటాను ఆన్​లైన్​ చేయాలని సర్కారు భావిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్​​వేర్​ను సిద్ధం చేయనున్నది.  అందులో ఉద్యోగి అపాయింట్​అయినప్పటి నుంచి రిటైర్మెంట్ వరకు పూర్తి వివరాలు ఉండేలా చూస్తున్నది. అవసరమైతే హెచ్ఆర్​ వ్యవస్థను తీసుకువస్తే ఎలా ఉంటుందనే దానిపైనా కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.

గత పదేండ్లలో ఆలిండియా సర్వీసు మినహా.. కిందిస్థాయి పోస్టుల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేశారనే దానిపై ప్రభుత్వం దగ్గర పూర్తి డేటా లేదు.  ఏ అధికారి ఏ రకంగా ఎఫిషియెంట్, అధికారి చేసిన పనులు, రిమార్కులు వంటివి తెలియడం లేదు. ఫలితంగా బదిలీలు  చేసే సమయంలో  ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైగా ఉద్యోగులకు సంబంధించి ఒక డేటా సమగ్రంగా లేకపోవడంపైనా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్​ అయినట్టు సమాచారం. దీంతో ఉద్యోగుల కోసమే ప్రత్యేకంగా ఒక సాఫ్ట్​వేర్​ ను తీసుకురానున్నారు. ఇందులోనే కాంట్రాక్టు, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులకు కూడా ఒక ఆప్షన్​ ఇవ్వాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఆలిండియా సర్వీసు అధికారుల దగ్గర నుంచి కింద క్లర్క్​ వరకు వివరాలు ఉండేలా సాఫ్ట్​వేర్​ రెడీ చేసి, ఒక వెబ్​ పోర్టల్​ను అందుబాటులోకి తీసుకురానున్నారు. 

ఆన్​లైన్​లో  అన్ని వివరాలు..

ప్రభుత్వ శాఖల్లోని హెచ్​వోడీ ఆఫీసుల్లో వివిధ విభాగాల దగ్గర నుంచి జిల్లాలు, మండల కేంద్రాలు , గ్రామాల్లో   ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వంలో మాత్రమే కాకుండా ప్రభుత్వరంగ సంస్థలు, యూనివర్సిటీలు, ఇతర ప్రభుత్వ ఇన్​స్టిట్యూషన్స్​లో పనిచేస్తున్నవాళ్లు ఉన్నారు. వీళ్లందరి డేటాను ఆన్​లైన్​ చేయనున్నారు. ఏయే శాఖలో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారో తెలుసుకోవడంతోపాటు ఎవరెవరు ఎప్పుడు రిటైర్​ అవుతున్నారు ?  

ఖాళీలు ఎన్ని ఉంటున్నాయి ? ఎవరి పనితీరు ఏంటి ? వారికున్న రివార్డులు, రిమార్కులు ఏమిటి ? ఏమైనా చార్జ్​మెమోలు ఉన్నాయా ? ఎక్కడ.. ఎంత కాలం పనిచేశారు ? లాంటి అన్ని వివరాలు ఇందులో పొందుపర్చనున్నారు. ఎవరిని ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ చేస్తున్నారనే వివరాలు కూడా ఆన్​లైన్​ చేసేలా ప్లాన్​ చేస్తున్నారు. దీంతో ఈజీగా పని అవుతుందని, ఉద్యోగుల సెలవులు, ఈఎల్స్​,​ ఇతరత్రావంటివన్నీ అందులోనే నమోదు చేసేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది.