హైడ్రాపై ఆర్డినెన్స్! ఈ నెల 20న కేబినెట్​ భేటీలో నిర్ణయం

  • హైడ్రాపై ఆర్డినెన్స్!
  • చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ
  • ఈ నెల 20న కేబినెట్​ భేటీలో నిర్ణయం
  • ఆర్​ఓఆర్​‌‌--2024కు కూడా ఆర్డినెన్స్​
  • రేషన్​ కార్డులు, హెల్త్​ ప్రొఫైల్ ​కార్డుల పంపిణీపై చర్చ
  • కులగణన, రైతు భరోసా గైడ్​లైన్స్​ విడుదల చేసే చాన్స్​
  • 200 కొత్త పంచాయతీల ఏర్పాటుకూ ఆమోదం?

హైదరాబాద్​, వెలుగు: కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. హైడ్రా ఇప్పటి వరకు జీవో 99 ద్వారా మాత్రమే కొనసాగుతున్నది. హైడ్రా చేపడ్తున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై కోర్టుల్లో కొందరు కేసులు వేశారు. దీంతో భవిష్యత్​లోనూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చట్టబద్ధత కల్పించడానికి ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం భావిస్తున్నది. కేబినెట్​ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్‌‌ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఇందులో హైడ్రాతోపాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఆస్తులు, వారసత్వ సంపదను రక్షించేందుకు రెండున్నర నెలల కింద హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి కబ్జాలపై ముఖ్యంగా ఎఫ్​టీఎల్​, బఫర్​జోన్లలో కట్టిన అక్రమ నిర్మాణాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. హైడ్రా కూడా అంతే వేగంగా కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను విడిపిస్తున్నది.హైదరాబాద్​ పరిసరాల్లోని చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నది. ఎన్​ కన్వెన్షన్​ సహా పలు కబ్జాలను నేలమట్టం చేసింది. అయితే.. హైడ్రాకు చట్టబద్ధత లేదని, దాని చర్యలు కరెక్ట్​ కావంటూ కొందరు ఇటీవల కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుముందు ఎలాంటి లీగల్​ ఇష్యూస్​ రాకుండా  హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగానే ఈ నెల 20 కేబినెట్​లో ఆర్డినెన్స్​ తీసుకురావడంపై  కీలకనిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

రైతుభరోసా, రేషన్​ కార్డులపైనా..!

కేబినెట్​ భేటీలో హైడ్రాతోపాటు ఆర్​ఓఆర్, బీసీ కులగణన, రైతు భరోసా అంశాలపైనా చర్చించనున్నారు. రికార్డ్స్​ ఆఫ్ రైట్స్​ (ఆర్​ఓఆర్​–2024)ను చట్టంగా తెచ్చేందుకు కేబినెట్​లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆర్​ఓఆర్​పై నెల రోజుల పాటు ప్రజల నుంచి సలహాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరించింది. దీనిపైనా చర్చించి కేబినెట్​ ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. 

కులగణనపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు ఇచ్చే రైతుభరోసా స్కీమ్​పై కేబినెట్​ సమావేశంలో డిస్కస్​ చేసే చాన్స్​ ఉంది. వానాకాలం సీజన్​ ప్రారంభం కావడంతో దసరా నుంచి రైతుభరోసా నిధులు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. విధివిధానాల కోసం ఇప్పటికే కేబినెట్​ సబ్ కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటించి సలహాలు, సూచనలను తీసుకున్నది. వాటి ఖరారుకు కేబినెట్ భేటీలో ఆమోదం తీసుకోనున్నట్లు తెలిసింది. 

ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను దెబ్బతీశాయి. ఆ వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి, సాయం కోరుతూ కేబినెట్​ భేటీలో తీర్మానం చేయనున్నారు. 

కొత్తగా మరో 200 గ్రామ పంచాయతీల ఏర్పాటుకు కేబినెట్​ సమావేశంలో ఆమోదం తీసుకోనున్నారు. 

ఈ నెల 17 నుంచి గ్రామాల్లో ప్రజాపాలన శిబిరాలు ఏర్పాటు చేసి కొత్త రేషన్​ కార్డులు, హెల్త్​ ప్రొఫైల్​ కార్డుల ప్రాసెస్​ చేపట్టాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఆ రోజు ప్రజాపాలన దినోత్సవం, వినాయక నిమజ్జనం వంటి కార్యక్రమాలు ఉన్నాయి. దీంతో ప్రజాపాలన శిబిరాలను ఎప్పటి నుంచి చేపట్టాలని.. కొత్త రేషన్​ కార్డులు, హెల్త్​ ప్రొఫైల్​ కార్డుల పంపిణీకి ఎలాంటి విధివిధానాలు ఖరారు చేయాలనే దానిపై కేబనెట్​లో చర్చించనున్నారు.