మిల్లర్ల కట్టడికి తెలంగాణ సర్కారు కొత్త రూల్స్

  • జరిమానా, బ్యాంకు గ్యారెంటీ, ఇద్దరు ష్యూరిటీలతో వడ్ల కేటాయింపు 
  • బీఆర్​ఎస్​ పాలనలోని పాత పద్ధతులకు స్వస్తి
  • కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర సర్కారు

 నిజామాబాద్​, వెలుగు: కస్టమ్ మిల్లింగ్​ కోసం తీసుకున్న  వడ్లు పక్కదారి పడితే ఊరుకోమంటూ కాంగ్రెస్ సర్కారు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రెండేండ్లలో ఒక్కసారికి మించి వడ్లను మాయం చేస్తే జరిమానాలు విధిస్తామని తెలిపింది. ఇందు కోసం బ్యాంకు గ్యారెంటీని, ఇద్దరి ష్యూరిటీలతోనే కొత్తగా సీఎంఆర్​ వడ్లు కేటాయించాలని ఆదేశించింది.

డిఫాల్టర్​ అయితే ఇక కష్టమే

జిల్లాలో చిన్నా పెద్ద కలిపి 203 రైస్​ మిల్స్​ ఉన్నాయి. వాటి కెపాసిటీని ప్రామాణికంగా తీసుకొని ఖరీఫ్​, యాసంగి సీజన్​లో సీఎంఆర్​ వడ్లను కేటాయిస్తారు. వడ్లను రైస్​గా  చేసి గవర్నమెంట్​కు పంపడానికి కస్టం మిల్లింగ్​ ఛార్జ్​ను చెల్లిస్తారు.  ఖరీఫ్​లో ప్రతి క్వింటాల్​ వడ్లకు 68 కిలోల బియ్యం, యాసంగి సీజన్​లో 67 కిలోల చొప్పున విధిగా పంపాలి.  సీఎంఆర్​ సేకరణకు ప్రతి సీజన్​లో సర్కారు గడువు విధిస్తుంది. 

కేవలం మిల్లింగ్​ ఛార్జ్​ కోసం తీసుకునే వడ్లను కొందరు మిల్లర్లు  ఏకంగా మార్కెట్​లో అమ్మేస్తున్నారు.  తర్వాత మరోసీజన్​లో ఇబ్బంది లేకుండా కొత్త కేటాయింపులు పొందుతున్నారు. వాటి తాలూకు రైస్​ ఎఫ్​సీఐ గోదాంకు చేరే దాకా భరోసా లేదు. ఈ రకంగా జనవరి 2024 నాటికి తొమ్మిది మంది రైస్​ మిల్లర్లు రూ. 52.88 కోట్ల విలువ 2.44 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు మాయం చేశారు.  

వారందరిపై ఆర్​ఆర్​ యాక్ట్​ కింద పోలీస్​ కేసులు నమోదయ్యాయి.  మరో 30 మంది మిల్లర్ల నుంచి నిరాశాజనకంగా రైస్​ సప్లై నడుస్తోంది.  గత బీఆర్​ఎస్​ సర్కారు ఆధ్వర్యంలోని కొన్ని విధానాలు  అవినీతికి మూల కారణమయ్యాయి.  ఇక నుంచి లొసుగులకు చాన్స్​ లేకుండా కాంగ్రెస్​ గవర్నమెంట్​ పాలసీ రూపొందించింది.   దీని ప్రకారం ఒకసారికి మించి తప్పు చేసే మిల్లర్లకు షరతులు విధించి సీఎంఆర్​ వడ్లు పంపుతారు. 

రెగ్యూలర్​గా ఉంటే ఇబ్బంది లేదు

క్రమం తప్పకుండా సీఎంఆర్​ రైస్​ అప్పగించే మిల్లర్లకు ఏ ఢోకా లేదు. వారికి గవర్నమెంట్​ అండదండ ఉంటుంది.  రెండేండ్ల కాలంలో  ఏదైనా  కారణంతో ఒక సీజన్​ రైస్​ సకాలంలో పంపనట్లయితే వాటిని రాబట్టుకునే దాకా ఆఫీసర్లు వదలరు.  రెండోసారి వడ్లు కేటాయించుకోడానికి మిల్లర్​ బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలి. ప్లస్​ రైస్​ మిల్లర్ల అసోసియేషన్​ నుంచి ఇద్దరు మిల్లర్లు ష్యూరిటీ ఉండాలి.  రైస్​ కూడా 125 అప్పగించాలి. అంటే వంద కిలోల బియ్యం ఇవ్వాల్సిన చోట 125 కిలోలు గవర్నమెంట్​కు ఇవ్వాల్సి  ఉంటుంది. 

మిల్లర్లకు నోటీసులు

గవర్నమెంట్​ రూపొందించిన కొత్త ఆర్డర్స్​ అందుకున్న సివిల్​ సప్లయి ఆఫీసర్లు స్లో మిల్లింగ్​ చేస్తున్న 30 మందికి శుక్రవారం నోటీసులు ఇచ్చారు. డిఫాల్టర్​ కింద పడితే ఏం జరుగుతుందో చెబుతున్నారు. 2023-– 24 ఖరీఫ్​ సీజన్​ రైస్​ సేకరణ స్పీడప్​ చేశారు. 3.21 మెట్రిక్​ టన్నుల బియ్యంలో ఇప్పటికి 1.05 టన్నులు సేకరించారు. మిగితా వాటిని సెప్టెంబర్​ గడువుతో పూర్తి చేసి యాసంగి బియ్యం కలెక్ట్​ చేయడానికి ప్లాన్​ ప్రిపేర్​ చేశారు.