అంగన్​వాడీలు అప్ గ్రేడ్..జిల్లాలో మొత్తం 788 సెంటర్లు

  • తాజాగా ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా డెవలప్ చేసేందుకు సర్కారు చర్యలు
  • మొదటి విడతలో 227 కేంద్రాల్లో సదుపాయాలు
  • మౌలిక వసతులతోపాటు పెయింటింగ్ పనులు
  • రెండో విడతలో మరిన్నింటికి సన్నాహాలు

హనుమకొండ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అంగన్​వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా డెవలప్ చేస్తోంది. ఇందులో భాగంగానే అంగన్ వాడీల రూపురేఖలు మారుస్తోంది. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అంగన్ వాడీలు నిర్లక్ష్యానికి గురి కాగా, వందలాది కేంద్రాలకు కనీసం కరెంట్ కనెక్షన్, తాగునీరు, టాయిలెట్స్ సదుపాయం కూడా లేదు. దీంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా డెవలప్ చేసేందుకు అంగన్ వాడీల్లో కనీస సౌకర్యాలు కల్పించడంపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు హనుమకొండ జిల్లాలో విడతల వారీగా అంగన్ వాడీలను అప్ గ్రేడ్ చేసేందుకు ప్రణాళికలు రచించింది. ఇటీవల మొదటి విడత పనులు మొదలు కాగా, మరికొద్ది రోజుల్లోనే రెండో విడత పనులు కూడా చేపట్టనున్నారు. 

నో కరెంట్, నో వాటర్..​

హనుమకొండ జిల్లాలో 788 అంగన్​వాడీ కేంద్రాలున్నాయి. అందులో 200 కేంద్రాలు ఓన్ బిల్డింగ్, 293 రెంట్ ఫ్రీ భవనాల్లో, 291 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అద్దె భవనాలు మినహా మిగతా బిల్డింగుల్లో కొనసాగుతున్న అంగన్ వాడీ కేంద్రాల్లో దాదాపు 80 శాతం వాటికి సరైన కరెంట్ కనెక్షన్​ లేదు. ఫ్యాన్ సౌకర్యం లేక పిల్లలు, అంగన్​వాడీ సిబ్బంది ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, టాయిలెట్స్ సదుపాయం కూడా లేదు. దీంతో పిల్లలు ఇండ్ల నుంచి బాటిళ్లను తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

మొదటి విడతలో 210  కేంద్రాలకు సదుపాయాలు

ప్రభుత్వం అంగన్​వాడీ సెంటర్లను ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా అప్​గ్రేడ్ చేసే క్రమంలో ముందుగా మౌలిక సదుపాయాల కల్పనపై ఫోకస్ పెట్టింది. పిల్లలకు నర్సరీ నుంచి మూడో తరగతి వరకు విద్యా బోధన అందించనుండగా, అందుకు తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో మొదటి విడతలో 227 కేంద్రాలను ఎంపిక చేసి, బిల్డింగ్ రిపేర్లు, మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 10 కేంద్రాల బిల్డింగులకు రిపేర్లు, కరెంట్, పెయింటింగ్ పనులు చేపట్టడంతోపాటు 50 కేంద్రాలకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, 150 సెంటర్లలో టాయిలెట్స్ రిపేర్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆయా పనులకు రూ.82.10 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన కేంద్రాలకు సంబంధించిన పనులు ప్రారంభం కాగా, తొందర్లోనే అవన్నీ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ఆకట్టుకుంటున్న పెయింటింగ్స్..

జిల్లాలోని 788 సెంటర్లలో మొత్తంగా 9 వేలకుపైగా చిన్నారులు నమోదై ఉన్నారు. వారికి అనుగుణంగా కేంద్రాల్లో ఆహ్లాదంతోపాటు అక్షర జ్ఞానం పెంచేలా పెయింటింగ్స్ వేయిస్తున్నారు. ముందుగా 17 కేంద్రాల్లో దాదాపు రూ.10 లక్షలతో పనులు చేపట్టగా, గోడలపై చైల్డ్ లైన్, డయల్ 112 నెంబర్లు కూడా రాయిస్తున్నారు. ఇప్పటికే సగం స్కూళ్లలో పనులు పూర్తయ్యాయి. మొదటి విడతలో భాగంగా 227 కేంద్రాలను అప్​ గ్రేడ్ చేసే పనులు మొదలుపెట్టగా, రెండో విడతలో మిగతా కేంద్రాల్లో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు 
చెబుతున్నారు.