హైదరాబాద్​ చుట్టూ ఉల్లి క్లస్టర్..40 వేల ఎకరాల్లో పంట సాగు

  • వికారాబాద్, మెదక్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో జోరు
  • హార్టికల్చర్ శాఖ ప్రోత్సాహంతో ముమ్మరంగా సాగు
  • డిమాండ్ ఉండడంతో ముందుకు వస్తున్న రైతులు

హైదరాబాద్​, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ప్రభుత్వం ఉల్లి క్లస్టర్ ఏర్పాటు చేసింది. రైతులను ప్రోత్సహించడంతో ఈ ఏడాది 40 వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతున్నది. ఇంతకుముందు మన అవసరాలకంటే తక్కువ సాగైన పంట.. ఇప్పుడు మన అవసరాలు తీర్చేలా జోరందుకున్నది. ఐసీఎంఆర్​ గైడ్​లైన్స్​ ప్రకారం రాష్ట్రంలోని ప్రజల అవసరాలకు 41.75 లక్షల టన్నుల ఉల్లి అవసరం ఉండగా.. ఇక్కడ 22.32 లక్షల టన్నుల్లో మాత్రమే దిగుబడి వస్తున్నది. దీంతో డిమాండ్​కు తగిన సరఫరా లేక ప్రస్తుతం మార్కెట్​లో ఉల్లి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. హైదరాబాద్​ మలక్​ పేట్​ హోల్​ సేల్​ మార్కెట్లో గరిష్టంగా రూ.40 ఉండగా, రైతుబజార్​లో రూ.45

బహిరంగ మార్కెట్​లో కిలో ఉల్లి రూ.50 నుంచి రూ.60 వరకు ధర పలుకుతున్నది.  ఈ నేపథ్యంలో ఉల్లిసాగుకోసం హార్టికల్చర్​ శాఖ రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్​నగర్​, వనపర్తి, గద్వాల, నారాయణపేట్​తదితర జిల్లాల్లో ప్రత్యేక కస్టర్లను గుర్తించింది. ఆయా జిల్లాల్లోని రైతులు ఉల్లిసాగుపై దృష్టిసారించేలా ప్రోత్సహించింది. మార్కెట్లో ఉల్లి ధర ఆశాజనకంగా ఉండడంతోపాటు ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలాలు పెరగడం, చెరువులతోపాటు బావుల్లో నీరు పుష్కలంగా రావడంతో కూరగాయల పంటలతోపాటు రైతులు జోరుగా ఉల్లి సాగు చేశారు.  

గ్రేటర్​ చుట్టూ ఉన్న జిల్లాల క్లస్టర్లలో సాగు ఇలా..

వికారాబాద్‌‌ జిల్లా పరిధిలోని తాండూరుతో పాటు  జిల్లాలోని మర్పల్లి, పంచలింగాల్, బిల్‌‌కల్‌‌, దార్గులపల్లి, తుమ్మలపల్లి, నర్సాపూర్‌‌, గుండ్లమర్పల్లి, సిరిపురం, వీర్లపల్లి, కొత్లాపూర్‌‌, పట్లూర్‌‌,  మొగిలిగుండ్ల, కొంషెట్‌‌పల్లి,  కోట్‌‌మర్పల్లి, కల్‌‌ఖోడా, బూచన్‌‌పల్లి, రావులపల్లి తదితర గ్రామాల్లో ఉల్లి పంటను సాగు చేస్తున్నారు. అలాగే,  మెదక్‌‌ జిల్లాలోని నారాయణఖేడ్‌‌, జహీరాబాద్, ఆందోల్​ ప్రాంతాల్లో ఉల్లిపంట అధికంగా సాగవుతున్నది. తుమ్నూర్, రాణాపూర్, ఎల్గోయి, దుదొగొండ, దోసపల్లి, మాయికోడ్, జి. హోక్రాన, పంచాగామ, పిప్రి, ముగ్ధుంపూర్

ఉట్పల్లి, శెల్గిర, డొవ్వూర్ తదితర గ్రామాల్లో ఎక్కువ సంఖ్యలో ఉల్లి సాగు జరుగుతున్నది. మహబూబ్‌‌నగర్‌‌లోని కొల్లాపూర్‌‌,  జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌‌, వనపర్తి జిల్లాలోని చిన్నంబావి, నల్గొండ జిల్లాలోనూ కొన్ని  ప్రాతాల్లో ఇలా ఈ క్లస్టర్​లో 40 వేల  ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తున్నారు. పుష్కలంగా వర్షాలు కురవడంతో బోర్లు, బావుల్లో నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం ఉల్లి పంటకు మార్కెట్​లో మంచి డిమాండ్ ఉండడంతో సాగుపై రైతన్నలు మొగ్గుచూపారు. వానాకాలంలో వేసిన పెసర, మినుము, సోయా పంటలకు అధిక వర్షాలతో నష్టం వాటిల్లింది. దీంతో ఆ భూముల్లో రైతులు ప్రస్తుతం ఉల్లి పంట వేశారు. 

వంద రోజుల్లోనే పంట చేతికి..

ఉల్లి పంట సాగుకు భూమిని చదును చేసి, నారు పోసుకోవడానికి ఎకరానికి రెండు కిలోల చొప్పున విత్తనాలు చల్లాల్సి ఉంటుంది. ఎదిగిన నారు 45 రోజులకు వరకు నాటు వేసుకోవచ్చు. నాటు వేసిన 100 రోజులకు పంట కోతకు వస్తుంది. ఎకరా భూమిలో ఉల్లి పంట సాగు చేసేందుకు రూ.60 వేల వరకు ఖర్చు వస్తుందని రైతులు పేర్కొంటున్నారు.  ఒక ఎకరంలో పంట బాగా పండితే సుమారు 70 నుంచి 80 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వస్తుంది.  

ఉల్లిగడ్డ  పంట 100 రోజుల్లో  చేతికి వస్తుండడంతో తక్కువ వ్యవధిలో ఎక్కువ లాభం వస్తుందనే ఆశతో రైతులు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు.   వర్షాలతో పంటలు నష్టపోయిన వారంతా ఉల్లి నాట్లేశారు. పంట చేతికొచ్చాక మార్కెట్​లో  క్వింటాల్‌‌కు 2వేల నుంచి రూ.2,500 ధర పలికితే ఖర్చులు పోను కొద్దిమేర లాభం వస్తుందని రైతులు అంటున్నారు.

వర్షాల ఎఫెక్ట్​తో తగ్గిన లారీ లోడ్లు 

రాష్ట్రానికి ఎక్కువగా మహారాష్ట్ర, ఏపీలోని కర్నూల్​ నుంచే ఉల్లి దిగుమతి అవుతున్నది. ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో ఉల్లిపంట దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి. వర్షాలతో ఉల్లి పంటను తీయడానికి ఇబ్బందిగా మారింది. మరోవైపు  ఉల్లి మడుల్లో నీరు నిలిచి  గడ్డలు మురిగిపోయే పరిస్థితి నెలకొన్నది. ఏపీ, మహారాష్ట్రలో వర్షాలతో ఉల్లి పంట చాలా వరకు దెబ్బతిన్నది.  

ఉల్లి  దిగుబడి తగ్గడంతో రాష్ట్రానికి రావాల్సిన ఉల్లి దిగుమతి గణనీయంగా తగ్గింది.  దీంతో మార్కెట్​లో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. వర్షాల ఎఫెక్ట్ తో రాష్ట్రానికి రావాల్సిన ఉల్లి లారీ లోడ్లు తగ్గిపోయాయి. పీక్​ టైమ్​లో యావరేజ్​గా రోజు కనీసం 70 లారీల వరకు వచ్చేవి. కానీ ఈమధ్య కాలంలో సగం  అంటే 30 నుంచి 40 లారీలే వస్తున్నాయి. పదివేల బస్తాలు కూడా మార్కెట్​కు రావడం లేదు.  రాష్ట్రంలో 40వేల ఎకరాల్లో సాగవుతున్న  ఉల్లి పంట నవంబర్​లో మార్కెట్​కు వస్తుందని మార్కెటింగ్​ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.  వచ్చే నెల నుంచి పెద్ద ఎత్తున  ఉల్లి పంట వస్తే  ధరలు తగ్గే అవకాశం  ఉంటుందని చెబుతున్నారు.

25 ఏండ్ల నుంచి సాగు చేస్తున్నా..

మా గ్రామంలో 25 ఏండ్లుగా పెద్ద ఎత్తున ఉల్లి సాగు చేస్తున్నాం. నేను ఈ యేడు 6 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేస్తున్నా.  మా ఒక్క గ్రామంలోనే దాదాపు 1500 ఎకరాల్లో ఉల్లి  వేశారు. ఈ యేడు నీటి వసతి పెరగడంతో ఉల్లి సాగు కూడా పెరిగింది. వచ్చే నెల నుంచి పంట దిగుబడి వస్తుంది. వర్షాలతో దిగుబడి 50 నుంచి 70 క్వింటాళ్ల వరకే వచ్చే అవకాశం ఉంది. మార్కెట్​లో కనీసం గిట్టుబాటు ధర క్వింటాల్‌‌ కు రూ.3 వేల నుంచి రూ.3,500  వరకు ఉంటే లాభం వస్తుంది. ప్రస్తుతం ఉన్న ధరలు ఇలాగే ఉంటే కొంతైనా లాభం ఉంటుంది.- బడికెల బాలు యాదవ్​ ​, ఉల్లి రైతు, కొప్పునూరు (వనపర్తి) 

మా ఊర్లో 400 ఎకరాలకు పైగా సాగు

మా  ఊర్లో  ఏటా 400 ఎకరాలకు పైగా ఉల్లి సాగుచేస్తాం. నేను చాలా ఏండ్ల నుంచి ఉల్లి సాగు చేస్తున్నా. ఈ యేడు ఉల్లి ధరలు బాగున్నాయని మా గ్రామాన్ని చూసి ఇతర గ్రామాల రైతులు పంట సాగుపై మొగ్గుచూపారు.  తెల్లరకం ఉల్లిగడ్డ పండిస్తం. మా జిల్లాలో పంచలింగాల ఉల్లిగడ్డకు మంచి డిమాండ్​ ఉంటుంది. 

- జనార్దన్, రైతు, పంచ లింగాల (వికారాబాద్)