భాషల గౌరవాన్నిపెంచిన రేవంత్​ సర్కార్

గత ప్రభుత్వాలకు భిన్నంగా సంస్కృతికి పెద్దపీట వేసి  కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేతంగా భాషాపండితుల దశాబ్దాల కల సాకారం చేసింది. ఏండ్ల నుంచి పెండింగ్ లో ఉన్న భాషా పండిట్, పీఈటీలకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్లు ఇచ్చింది.  దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10వేల మంది భాషా పండితుల కుటుంబాల్లో ఆనందం నింపింది. ఏండ్ల కల సాకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ పెద్దలకు సదా రుణపడి ఉంటాం.  రాష్ట్రంలో భాషాపండితుల పోస్టుల అప్​ గ్రేడేషన్ తెలంగాణ ఉద్యమానికి తీసిపోకుండా రెండు దశాబ్దాల కాలంగా పండితుల పోరాటంతో ముందుకుసాగింది. అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతులు ఇవ్వడం మొదలు.. నిరసనలు, ఆందోళనలు, అదనపు పనిగంటల పని ఇలా అనేక రూపాల్లో పోరాటం చేశాం. చివరికి సహాయ నిరాకరణ ఉద్యమం కూడా చేపట్టాం. 

గత ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభల వేదికగా భాషాపండితులకు మేలు జరిగే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఆర్ యూపీపీతో పాటు టీచర్ల సంఘాల ప్రాతినిధ్యంతో అప్పర్ ప్రైమరీ స్కూళ్లతో పాటు హైస్కూళ్లలోని లాంగ్వేజీ పండిట్ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్​ గ్రేడ్​ చేస్తూ రాతపూర్వకంగా ప్రభుత్వం ప్రకటించింది. 

సమస్యల పరిష్కారానికి పోరాటం

2001లో సర్వీసు రూల్స్ అపాయింట్​మెంట్ క్వాలిఫికేషన్​లో  వేరే పోస్టులకు లేనటువంటి ఎంఏ అర్హతను చేర్చి భాషాపండితులకు న్యాయంగా దక్కాల్సిన ప్రమోషన్లను ఎస్​జీటీలకు దక్కేలా చేశారు. దీంతో లాంగ్వేజీలకు లాభం జరగకపోగా  రాష్ట్రంలో ఓరియంటల్ కళాశాలల ఉనికే ప్రశ్నార్థకంగా మారడానికి కారణమైంది.  మామూలు ఎంఏ తెలుగుకు డిమాండ్ పెరిగింది. బీఏ ఎల్బీఓఎల్, బీఓఎల్, ఎంఏఎల్ చదువులు అడిగేవారే కరువయ్యారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని ఓరియంటల్ కళాశాలలమూసివేతకు దారితీసింది. మరీ ముఖ్యంగా హైస్కూళ్లలో భాషాబోధనలో తిరోగమనం మొదలై,  భాష తియ్యదనం తెలిపేవారి సంఖ్య పడిపోయింది.  2005లో సుప్రీంకోర్టులో పండితులు పోరాడి సాధించుకున్న గ్రేడ్1 అర్హతలున్న గ్రేడ్ 2 పండితులందరికీ, గ్రేడ్1 స్కేలు ఇవ్వాలనే తీర్పును నాటి పాలకులు అమలు చేస్తామని చెప్పి మాట తప్పి 1/2005 యాక్ట్ తెచ్చి భాషాపండితుల నోళ్ళలో మట్టి కొట్టారు. 

2009లో రాష్ట్రంలో 32 వేల పోస్టులను అప్​గ్రేడ్​ చేసి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను, 3000కు పైగా జీహెచ్ఎం పోస్టులను అప్​గ్రేడ్ చేసిన నాటి ప్రభుత్వం భాషాపండితులకు ఒక్క పోస్టంటే ఒక్క పోస్టు కూడా కేటాయించలేదు, అప్​గ్రేడ్ చేయలేదు. అప్పుడు కూడా పండితులు ఒంటరిగా పోరాటం చేయగా జీఓ 80ని విడుదల చేసి రాష్ట్రంలో 10వేలకు పైగా భాషాపండితులు, పీఈటీ పోస్టులను అప్​గ్రేడ్  చేయాల్సి ఉందని లెక్కలు మాత్రమే ప్రకటించారు. కంటి తుడుపుగా వెయ్యికి పైగా పోస్టులను అప్​గ్రేడ్ చేశారు. 2016లో భాషాపండితుల సమస్యల పరిష్కారానికి పండితులు సాహసోపేతంగా మలిదశ పోరాటం మొదలుపెట్టారు. ఈ  పోరాట పంథా భిన్నమైన దారుల్లోకి మళ్ళించి.. రాష్ట్రంలో భాషల నాణ్యత ఏవిధంగా మార్పుకు గురౌతున్నదో  ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ముందుకు సాగింది.

భాషలు, క్రీడలకు పట్టాభిషేకం

కోర్టుతీర్పును డివిజన్ బెంచ్​లో సవాలు చేస్తూ పండితులు పోరాటం చేయగా సీనియర్ కౌన్సిల్ శ్రీ మాదిరాజు సురేందర్ రావు, శ్రీ మాదిరాజు శ్రీనివాసరావు వాదనలతో డివిజన్​ బెంచ్​ సంతృప్తి చెందిప్రభుత్వం అప్​గ్రేడ్ చేసిన భాషాపండితులు పోస్టులలో,  పీఈటీ పోస్టులలో కేవలం పండితులు, పీఈ టీలు మాత్రమే అర్హులని విస్పష్టంగా ప్రభుత్వ నిర్ణయాన్ని అమలుచేసుకునేలా తీర్పును వెలువరించింది. ఉత్తర్వుల అమలులో  సీఎం సాహసోపేత నిర్ణయం అంతర్గతంగా పనిచేయడం కొసమెరుపు.  విద్యాశాఖ ఉన్నతాధికారులను పిలిచి ఎలాగైనా సరే పండితుల పదోన్నతులను ఈ షెడ్యూల్లోనే పూర్తిచేయాలని ఆదేశించడం రాష్ట్రంలోని వేలాదిమంది భాషాపండితులకు, విద్యార్థులకు వరంలా మారింది. కానీ విషయం ఢిల్లీ సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. కానీ, న్యాయస్థానం కేసును డిస్మిస్ చేస్తూ డివిజన్ బెంచ్ తెలంగాణ తీర్పును సమర్థిస్తూ తెలంగాణలోని వేలాది భాషాపండితుల పీఈటీల కలలను, నిజం చేస్తూ ఢిల్లీ సాక్షిగా భాషలకు, క్రీడలకు పట్టాభిషేకం చేసింది. ఈసారి ఈ ప్రక్రియలో ప్రభుత్వం తమ పూర్తి అండదండలు అందించింది, 10వేల మంది భాషాపండితులు ప్రత్యక్షంగా మరో 5వేల మంది గ్రేడ్1 పండితులు పరోక్షంగా పీఈటీలు 2వేల మంది, 700 మంది దాకా పీడీలు, రాష్ట్రంలోని 25లక్షలమంది విద్యార్థులు ప్రత్యక్షంగా, విద్యావేత్తలు, సంఘాల నాయకులు, తల్లిదండ్రులు హర్షాతిరేకాలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

భాషా పండితుల జీవితాల్లో వెలుగు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో భాషాపండితుల పోరాటం కూడా విజయవంతం అవుతుందన్న నమ్మకం పండితుల్లో మొలకెత్తింది. అలుపెరగని పోరుబాటలో  భాషాపండితుల జీవితాల్లో వెలుగు, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల జీవితాల్లోకి నాణ్యమైన భాషాబోధనను అందించడమే లక్ష్యంగా  జరిగింది.  ప్రభుత్వం  జీఓ 17, 18లను ప్రకటించడం చారిత్రాత్మక సందర్భం.  వాటిని ఇతర ఉపాధ్యాయులు కోర్టులో సవాలు చేసినా హైకోర్టు జీఓల్లోని సారాన్ని స్వాగతించింది.  సర్వీసు రూల్స్ మార్చుకోకుండా జీఓలను ఉన్నవి ఉన్నట్లు  అమలుచేయడానికి కుదరదు కనుక ముందుగా  ప్రభుత్వం సర్వీసు రూల్స్​లో కావలసిన మార్పులుచేసి పిల్లలకు నాణ్యమైన భాషాబోధన అందించడానికి భాషాపండితుల పోస్టులను అప్​గ్రేడ్ చేసి వాటిని వారికే పదోన్నతుల ద్వారా అందించాలని ప్రభుత్వానికి సూచించింది.  ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తూ కావలసిన మార్పులను చేయాల్సిందిగా అధికారులను ఆదేశించినా పెద్దసంఘాల ఒత్తిడితో అధికారులు కూడా మిన్నకుండి పోవడం కొసమెరుపు.  ప్రభుత్వం కొత్త సర్వీసు రూల్స్​ను రూపొందింపజేసి అమలుకు చర్యలు తీసుకుంది. ఇంతటితో సమస్య పరిష్కారమయితే అయిపోయేదే కానీ అలా జరగలేదు. గతంలో ప్రభుత్వం సాంక్షన్ చేసిన అప్​గ్రేడ్ పోస్టులలో తమకు కూడా భాగం కావాలని కోర్టు మెట్లు ఎక్కారు. సింగిల్ బెంచ్ ప్రభుత్వ చర్యలను తప్పుపడుతూ పండితులతోపాటు, ఎస్.జి.టీ  ఉపాధ్యాయులు కూడా పదోన్నతులకు అర్హులు అని తీర్పును ఇవ్వడం జరిగింది.

- చింతకుంట జగదీశ్, ఆర్​యూపీపీటీఎస్ స్టేట్​ ప్రెసిడెంట్