మహబూబ్​నగర్‌‌లో స్కూల్​ ఎడ్యుకేషన్​పై​ సర్కార్​ ఫోకస్

  • ఏఏపీసీ కింద డెవలప్​ చేసేందుకు సర్కారు చర్యలు
  • మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాలకు రూ.30.60 కోట్లు మంజూరు
  • గత ప్రభుత్వం హయాంలో పాలమూరు జిల్లాలో 48 స్కూళ్లకు తాళాలు

మహబూబ్​నగర్, వెలుగు: పాఠశాల విద్యపై రాష్ట్ర సర్కారు స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. ప్రతి గ్రామంలో ఒక బడిని ఏర్పాటు చేసేలా ప్లాన్​ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న స్కూళ్లను బలోపేతం చేసేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ(ఏఏపీసీ)ని అమల్లోకి తెచ్చింది. ఈ కమిటీ ద్వారా బడుల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు జిల్లాల్లో విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీలతో చర్చించి, నిర్ణయాలు తీసుకోనుంది.

ఫేస్–1లో 958 స్కూల్స్..

మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో 1,500 సర్కారు బడులు ఉండగా, ఇందులో ఏఏపీసీ ఫేస్–1లో 958 బడులను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన బడులను ఐదు కాంపోనెంట్లుగా డివైడ్​ చేసి పనులు ప్రారంభించారు. మొదటి కాంపోనెంట్​లో తాగునీటి సౌకర్యం, రెండో కాంపోనెంట్​లో బడుల్లో మైనర్​ రిపేర్లు, మూడో దాంట్లో టాయిలెట్ల రిపేర్లు, నాల్గో దాంట్లో కరెంట్​ పనులు, ఐదో కాంపోనెంట్​లో కొత్త టాయిలెట్ల నిర్మాణాలు చేపడతారు. రెండు జిల్లాలకు ఫేస్–1 కింద సర్కారు ఇటీవల రూ.30.60 కోట్లు శాంక్షన్​ చేసింది. ఇందులో పాలమూరు జిల్లాకు రూ.18.30 కోట్లు, నారాయణపేటకు రూ.12.30 కోట్లు కేటాయించారు. 

ఈ నిధులతో పాలమూరు జిల్లాలోని 490 బడులను, నారాయణపేటలో 468 బడులను గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి నుంచే పనులు మొదలు కాగా, ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం లోకల్​ బాడీస్​ ఎమ్మెల్సీ బై పోల్​ కోడ్​ కారణంగా, గత నెల 10న ఈ స్కీం కింద డెవలప్​మెంట్​ పనులు స్టార్ట్  అయ్యాయి. జూన్​ 12 నాటికి గుర్తించిన బడుల్లో అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే గత  ప్రభుత్వం అమలు చేసి, గాలికొదిలేసిన ‘మన ఊరు–-మన బడి’ స్కీం కింద మిగిలిన పనులను చేయడానికి కూడా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ‘మనఊరు–-మన బడి’ స్కీం కింద ఎంపికైన బడుల్లో ఇప్పటి వరకు వంద శాతం పనులు పూర్తి కాలేదు. కొన్ని చోట్ల అసలు పనులు కూడా స్టార్ట్​ కాలేదు. ఈ బడులను రాష్ట్ర ప్రభుత్వం ఫేస్–2 కింద ఎంపిక చేయనుంది.

డిజిటల్​ బోధనపై దృష్టి..

బడుల్లో డిజిటల్​ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే మహబూబ్​నగర్​ జిల్లాలో కొన్ని బడుల్లో డిజిటల్​ విద్యా బోధనకు కావాల్సిన పరికరాలను సమకూర్చింది. టెన్త్​ క్లాస్​ ఎగ్జామ్స్​కు ప్రిపేర్​ అవుతున్న స్టూడెంట్లకు పెద్ద మొత్తంలో స్టడీ మెటీరియల్ పంపిణీ చేసింది. దీంతో ఇటీవల రిలీజ్​ అయిన టెన్త్​ రిజల్ట్స్​లో ప్రైవేట్​ స్కూల్స్​ కంటే సర్కారు బడుల్లో చదువుకున్న స్టూడెంట్లే ఎక్కువ మొత్తం గ్రేడ్–​-ఏతో ఉత్తీర్ణులయ్యారు.

గత ప్రభుత్వ హయాంలో 48 బడులు మూత..

గత బీఆర్ఎస్​ ప్రభుత్వం బడులపై పూర్తి నిర్లక్ష్యం కనబర్చింది. స్కూల్​ ఎడ్యుకేషన్​పై ఎలాంటి దృష్టి పెట్టలేదు. దీంతో జిల్లాల్లో సర్కారు బడులు అధ్వానంగా తయారయ్యాయి. 2021 నుంచి గత విద్యా సంవత్సరం వరకు ఒక్క పాలమూరు జిల్లాలో 48 స్కూల్స్​ మూతబడ్డాయి. గిరిజన తండాల్లోని బడులను ఎక్కువగా మూసివేయడం పట్ల అప్పట్లో విమర్శలు వచ్చాయి. దీనికితోడు ‘మనఊరు–-మనబడి’ స్కీం కింద జిల్లాలోని 837 బడుల్లో 280 బడులను మాత్రమే ఎంపిక చేసింది. ఇక ఫండ్స్​ రిలీజ్​ చేయకపోవడంతో చాలా బడుల్లో పనులు ప్రారంభించలేదు. కొన్ని బడుల్లో ఉపాధి హామీ స్కీం కింద టాయిలెట్ల రిపేర్లు చేయించి చేతులు
 దులుపుకున్నారు.

చైర్​పర్సన్లుగా మహిళలు..

ఏఏపీసీ చైర్​ పర్సన్లుగా ప్రభుత్వం మహిళలకు అవకాశం కల్పించింది. బడులను రీ ఓపెన్​ చేశాక చైర్​పర్సన్లను ఎంపిక చేయనుంది. చైర్​పర్సన్​ ఆధ్వర్యంలో రెండు, మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించి, బడుల్లో సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోనుంది. బడుల్లో చేయాల్సిన అభివృద్ధి పనులు, మెరుగైన ఫలితాలు సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి ఉన్నతాధికారులకు ఈ కమిటీలు నివేదించనున్నాయి.