లిఫ్ట్​లు, చెరువుల రిపేర్లపై నజర్

  • మండలాల నుంచి వివరాలు తెప్పించుకుంటున్న ఆఫీసర్లు
  • సాగునీరు అందించడంపై రాష్ట్ర సర్కారు దృష్టి
  • పాలమూరు, నారాయపేటలో జిల్లాల్లో సాగులోకి రానున్న 2 లక్షల ఎకరాలు

మహబూబ్​నగర్, వెలుగు: చెరువు కట్టలు, తూముల రిపేర్లు, కెనాల్స్​లో పేరుకుపోయిన పూడిక తీసే కార్యక్రమాలు చేపట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. చిన్న చిన్న రిపేర్లతో మూత పడిన మినీ లిఫ్ట్​లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. జిల్లాల వారీగా లిఫ్ట్​లు, చెరువుల వివరాలు తెప్పించుకొని విడతల వారీగా పనులు చేసేందుకు చర్యలు చేపడుతోంది. చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించి, రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని భావిస్తోంది. మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో మినీ లిఫ్ట్​లు, చెరువులకు రిపేర్లు చేయడం ద్వారా రెండు లక్షల ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది.

ఫేజ్–2 కింద కోయిల్​సాగర్..​

వర్షాకాలం మొదలు కానుండడంతో రాష్ట్రంలోని డ్యామ్​ల భద్రతపై మంగళవారం హైదరాబాద్​లోని జలసౌధలో స్టేట్​ డ్యామ్​ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్​వో), ఆపరేషన్​  అండ్​ మెయింటెనెన్స్​(ఓఅండ్ఎం) ఆఫీసర్లు రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఇందులో భాగంలో ప్రస్తుతం డ్యామ్​ల పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో 174 మీడియం, మేజర్  ప్రాజెక్టులు ఉండగా, అందులో కోయిల్​సాగర్​ ప్రాజెక్టు కూడా ఉంది. డ్యామ్​ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్​లో కోయిల్​సాగర్​ ప్రాజెక్టును ఫేజ్–2 కింద ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టును త్వరలో డ్యామ్​ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్​ ఆఫీసర్లు సందర్శించనున్నారు. ఫ్లడ్​ ఎక్కువగా వస్తే ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఎలాంటి డీటెయిల్స్​ అవసరం ఉంటుందనే వివరాలను సేకరించనున్నారు. ప్రాజెక్ట్​ కట్టను నిర్మించి 50 ఏండ్లు దాటిపోవడంతో డ్యామ్​ కట్ట పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని​తెలుసుకోనున్నారు. 

మినీ లిఫ్ట్​ల రిపేర్లపై చర్చ..

కృష్ణా, భీమా నదులను సోర్స్​గా చేసుకొని మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో కలహల్లి, హిందూపూర్, గుడ్డెబల్లూర్​ ఫేజ్–-1, గుడ్డెబల్లూర్​ ఫేజ్–-2, మురహార్​దొడ్డి ఫేజ్–-1, మురహార్​దొడ్డి ఫేజ్–-2, ముడుమాల్–1, ముడుమాల్–-2, పుంజనూరు, కురుమూర్తి రాయ, పస్పుల, ముస్లాయిపల్లి-–1, ముస్లాయిపల్లి-–2, కొండదొడ్డి మినీ లిఫ్ట్​లు నిర్మించారు. వీటి కింద 80 వేల నుంచి లక్ష ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం హిందూపూర్, గుడ్డెబల్లూరు ఫేజ్–-1, మురహార్​ దొడ్డి స్కీమ్స్​ తప్ప..  మిగతావి రన్నింగ్​లో లేవు. మోటార్ల రిపేర్లు, కాల్వల్లో పూడిక తీత పనులు చేయాల్సి ఉండగా, గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మెయింటెనెన్స్​ను గాలికొదిలేసి, నీటి తీరువా సంఘాల ఏర్పాటును కూడా విస్మరించింది. దీంతో పదేండ్లుగా ఈ స్కీమ్​లు బంద్​ కావడంతో, వీటి కింద దాదాపు 60 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. అయితే కాంగ్రెస్​ ప్రభుత్వం రూ.కోటి లోపు ఫండ్స్​తో రిపేర్లు అయ్యే స్కీమ్​లను గుర్తించి, వాటిని వినియోగంలోకి తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. మంగళవారం జరిగిన డ్యాం సేఫ్టీ మీటింగ్ లో మినీ లిఫ్ట్​లకు రిపేర్లు చేసి, ఆయకట్టుకు సాగునీరు అందించాలనే చర్చ చేశారు. రూ. కోటి లోపు చేసే పనులకు ప్రభుత్వం ద్వారా అనుమతులు తీసుకోవాలని, రూ.కోటి కన్నా ఎక్కువ ఖర్చు అయ్యే స్కీమ్​ల గురించి సర్కారు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.

చెరువు కట్టలు భద్రమేనా?

మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో 2,155  చెరువులుండగా, అందులో పాలమూరులో 1,265, నారాయణపేటలో 890 చెరువులున్నాయి. అయితే గత ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు చెరువుల్లో పెద్ద మొత్తంలో ఒండ్రు మట్టిని తవ్వి అమ్ముకున్నారు. దీంతో చెరువు కట్టలు బలహీనపడ్డాయి. ఏడాదిన్నర కిందట నవాబ్​పేట మండలం యన్మన్​గండ్ల పెద్ద చెరువుకు గండి పడి కట్ట తెగిపోయింది. వెంటనే ఆఫీసర్లు రింగ్​ బండ్​ వేయించినా, రిపేర్లు చేసినా వారం రోజుల తర్వాత వర్షాలు పడడంతో మళ్లీ కట్టకు గండి పడింది. ప్రస్తుతం ఈ కట్టకు రిపేర్లు జరుగుతున్నాయి. అయితే రెండు జిల్లాల్లో ఉన్న చెరువుల వివరాలను ఉన్నతాధికారులు సేకరించే పనిలో ఉన్నట్లు తెలిసింది. బలహీనంగా ఉన్న చెరువుల కట్టలు, వాటి తూములు, వరద కాల్వలు, కెనాల్స్ ​పరిస్థితిపై వివరాలను తెప్పించుకునే పనిలో ఉన్నారు. కెనాల్స్​లో పూడికతీత పనులు చేపట్టి నీళ్లు చివరి ఆయకట్టు వరకు వెళ్లేలా యాక్షన్​ ప్లాన్​ను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

పర్మిషన్​ రాగానే వర్క్స్​ స్టార్ట్​ చేస్తాం..

కోయిల్​సాగర్​ ప్రాజెక్ట్​ కట్ట నిర్మించి 50 ఏండ్లు దాటిపోయింది. ఈ ప్రాజెక్టును స్టేట్​ డ్యామ్​ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఫేజ్–-2 కింద కొద్ది రోజుల కిందటే ఎంపిక చేసింది. ప్రభుత్వం నుంచి అనుమతులు, ఫండ్స్​ రాగానే పనులు మొదలుపెడతాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్​ కింద లెఫ్ట్​, రైట్​ కెనాల్​తో పాటు లింక్​ కెనాల్స్​ వర్క్స్​ చేయాల్సి ఉంది. వీటికి కొత్త ఎస్టిమేషన్లు చేయాల్సి ఉంది. అలాగే 18 వేల ఎకరాల కొత్త ఆయకట్టును ప్రాజెక్ట్​ కింద చేర్చాల్సి ఉంది.

- ప్రతాప్​ సింగ్​, ఈఈ, కోయిల్​సాగర్​ ప్రాజెక్ట్