దొడ్డు వడ్లే సాగు చేస్తున్రు

  • సన్నాలకు రూ. 500 బోనస్​ ఇస్తామన్న సర్కారు
  • అయినా సన్నాల సాగుపై ఆసక్తి చూపని రైతులు
  • ఈసారి 34 వేల ఎకరాల్లో సన్నాల సాగు
  • 2.41 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం 

యాదాద్రి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు బోనస్​ ప్రకటించినా యాదాద్రి జిల్లా రైతులు మాత్రం ఎక్కువగా దొడ్డు రకం వడ్లే సాగు చేస్తున్నారు. జిల్లాలో సాగవుతున్న వరిలో కేవలం 13 శాతం విస్తీర్ణంలో మాత్రమే సన్నవడ్లు సాగు చేస్తున్నారు. సన్నాల సాగుకు పెట్టుబడి ఎక్కువ కావడం, దిగుబడి తక్కువగా ఉండడంవల్ల రైతులు దొడ్డు రకాలకే మొగ్గు చూపుతున్నారు. 

 దొడ్డు రకాలే ఎక్కువ 

రేషన్ షాపుల ద్వారా ప్రజలకు సన్న బియ్యం అందించాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ యేడు సన్నవడ్ల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. సన్న రకాలు పడించాలని రైతులకు సర్కారు సూచించింది. సన్నాలు సాగు చేసినా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా రైతులకు అండగా ఉండాలని భావించి .. సన్నాలకు క్వింటాల్​కు రూ. 500 బోనస్​ ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సన్నాల సాగు పెరుగుతుందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేశారు.

కానీ అందుకు భిన్నంగా ఈసారి కూడా యాదాద్రి జిల్లా రైతులు దొడ్డు రకాలే వేసుకున్నారు. జిల్లాలో ప్రతి సీజన్​లో నిర్వహించే పంటల నమోదులో భాగంగా రైతుల సాగు వివరాలను అగ్రికల్చర్​ ఆఫీసర్లు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా 2.76 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా అందులో 35 వేల ఎకరాల్లోనే సన్న రకం సాగు చేస్తున్నారని తేలింది. 2.41 లక్షల ఎకరాల్లో దొడ్డు రకమే సాగు చేస్తున్నారని పంటల నమోదులో అగ్రికల్చర్​ ఆఫీసర్లు గుర్తించారు. 

దిగుబడి తక్కువని.. 

దొడ్డు రకం కంటే సన్నాల సాగుకు పెట్టుబడి ఎక్కువ అవసరమవుతుంది. దీంతోపాటు దిగుబడి తగ్గుతోంది. సన్నాలను చీడ పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. పురుగుల మందు వాడకం ఎక్కువ కావడంతో ఎకరానికి రూ. 5 వేలకు పైగా అధికంగా పెట్టుబడి పెట్టాల్సివస్తుందని రైతులు అంటున్నారు. దొడ్డు రకం ఎకరానికి 25 క్వింటాళ్ల నుంచి 35 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తే.. సన్నాలు ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది.

ఓవరాల్​గా ఐదు నుంచి ఏడు క్వింటాళ్లకు పైగా దిగుబడి తగ్గుతోంది. ప్రభుత్వం అదనంగా 500 బోనస్​ ఇచ్చినా చీడపీడల బారిన పడి దిగుబడి తగ్గితే నష్టపోవాల్సివస్తుందన్న ఆందోళనతో రైతులు సన్నొడ్ల సాగును తగ్గిస్తున్నారు. కొందరు రైతులు తమ ఇంటి అవసరాలకు మాత్రం సన్నొడ్లను పండిస్తుంటే.. మరికొందరూ అసలే పండించడం లేదు.