పెండింగ్​ ప్రాజెక్టులకు బడ్జెట్ బూస్టింగ్

  •      ఆశించిన మేర నిధులు కేటాయించిన ప్రభుత్వం
  •     వేగంగా పనులు పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ, వాటర్​బోర్డు అధికారుల నిర్ణయం
  •     స్పీడప్​కానున్న  ఓఆర్ఆర్ వాటర్ ప్రాజెక్ట్-2

హైదరాబాద్, వెలుగు : నిధుల కొరతతో ఇన్నాళ్లు వాటర్​బోర్డు, జీహెచ్ఎంసీ చేపట్టిన కీలక ప్రాజెక్టులు పెండింగ్​పడుతూ వచ్చాయి. గురువారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్​లో ఈ రెండు డిపార్ట్​మెంట్లకు భారీగా నిధులు కేటాయించారు. వాటర్​బోర్డుకు రూ.3,385 కోట్లు, జీహెచ్ఎంసీకి హెచ్– సిటీ కింద రూ.2,654 కోట్లను కేటాయించింది. దీంతో కీలక ప్రాజెక్టులకు బూస్టింగ్​ఇచ్చినట్లు అయింది. పనులను వేగవంతం చేసి, యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆయా శాఖల అధికారులు ప్లాన్​చేస్తున్నారు.

వాటర్​బోర్డు అధికారులు గ్రేటర్​తోపాటు శివారులో తాగునీటి సమస్యకు చెక్​పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిధుల కొరతతోరెండేళ్లుగా సుంకిశాల ప్రాజెక్టు నత్తనడకన నడిచింది. సరిపడా నిధులు అలాట్​చేయడంతో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వేసవిలో నాగార్జున సాగర్​ డెడ్​స్టోరేజీకి చేరినా, పుట్టంగండి నుంచి పంపింగ్​చేసేందుకు వీలుకలుగుతుంది. ఎమర్జెన్సీ పంపింగ్​కోసం ఏటా అధికారులు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

ఈ ఖర్చును తగ్గించుకునేందుకు కోదండపూర్ లోని నీటి శుద్ధి కేంద్రానికి నీరు సరఫరా చేసేందుకు పైప్​లైన్​నిర్మాణం చేపడుతున్నారు. వాటర్ బోర్డు అధికారులు రెండేండ్ల కింద రూ.2,215 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. పూర్తయితే 50 ఏండ్లు సిటీని నీటి సమస్య ఉండదు. తాజాగా ప్రభుత్వం  కేటాయించిన నిధుల్లో నుంచి ఈ ప్రాజెక్టుకు వెయ్యి కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిసింది.

ఓఆర్ఆర్​ వాటర్ ప్రాజెక్ట్​–2 

ఔటర్ రింగ్​రోడ్​పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీలతోపాటు విల్లాలకు నీటి సరఫరా చేపట్టేందుకు వాటర్​ప్రాజెక్ట్–2ను స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా మొత్తం 73 సర్వీస్​రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. మొదటి దశ పనులు పూర్తి కాగా, రెండో దశ పనులు జరుగుతున్నాయి. రెండో దశలో రూ.1,200కోట్లతో 38 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 13 రిజర్వాయర్లు పూర్తయ్యాయి. మిగిలినవి 90 శాతం పనులు జరిగాయి. తాజా కేటాయించిన నిధుల్లో ఓఆర్ఆర్​ప్రాజెక్టుకు వెయ్యి కోట్లు ఖర్చు చేయనున్నారు.

ఉచిత నీటి పథకానికి రూ.300 కోట్లు

గ్రేటర్​పరిధిలో అమలు చేస్తున్న ఉచిత నీటి పథకానికి భారీగా నిధులు అవసరం అవుతున్నాయి. ఆ ప్రభావం వాటర్​బోర్డు ఖాజానాపై పడుతోంది. ప్రభుత్వం నుంచి రూ.600 కోట్ల ఇవ్వాలని కోరగా, రూ.300 కోట్లు కేటాయించింది. మిగిలిన నిధులను బోర్డు మెయింటెనెన్స్​పనులు, ఇతర అభివృద్ధి పనులకు కేటాయించాలని నిర్ణయించారు.

ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ పనులకు లైన్ క్లియర్

హెచ్–సిటీ(హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్ ఫర్మేటీవ్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్) కింద ప్రభుత్వం జీహెచ్ఎంసీకి రూ.2,654 కోట్లు కేటాయించగా, ఇందులో మెజారిటీ భాగం ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీల కోసమే ఉన్నాయి. పరిపాలనా అనుమతులు రాగానే ఆయా పనులు పట్టాలెక్కనునాయి. ఎస్ఆర్డీపీ ఫేజ్–2 కింద 36చోట్ల ఫ్లైఓవర్లు, అండర్​పాస్​లు నిర్మించనున్నారు. ఎస్ఎన్డీపీ ఫేజ్–2 కింద 415చోట్ల నాలాల విస్తరణ జరగనుంది. వచ్చే నెలలో 29 నాలాల పనులు మొదలుపెట్టనున్నట్లు తెలిసింది.