కరెంట్​, గ్యాస్​ స్కీమ్​లకు..గ్రీన్​ సిగ్నల్ 

  •     ఫిబ్రవరి 28 నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరుస ఎలక్షన్​ కోడ్​
  •     ముగిసిన పార్లమెంట్​ ఎన్నికల కోడ్​
  •     జిల్లాల వారీగా సోమవారం నుంచి స్కీమ్​ల ఆఫీసర్లతో మంత్రులు, ఎమ్మెల్యేల రివ్యూ

మహబూబ్​నగర్, వెలుగు: 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500కే గ్యాస్​ సిలిండర్​ స్కీమ్​ల అమలుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అడ్డంకులు తొలగిపోయాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచే రాష్ట్రంలో ఈ స్కీమ్స్​ అమలువుతున్నా.. ఉమ్మడి జిల్లాలో మాత్రం వరుసగా వచ్చిన ఎలక్షన్​​కోడ్​ కారణంగా ఇంప్లిమెంటేషన్​కు బ్రేకులు పడ్డాయి. ఈ నెల 6న కోడ్​ ముగియడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ స్కీమ్​లను అమలు చేసేందుకు ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించి, ఈ నెల నుంచే అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు.

మూడు నెలలుగా బ్రేక్..​

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్​ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ‘మహాలక్ష్మి’ స్కీమ్​లో భాగమైన మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీని డిసెంబర్​ 9న ప్రారంభించింది. ఆ తర్వాత ‘చేయూత’ స్కీం కింద రాజీవ్​ ఆరోగ్య భీమాను రూ.10 లక్షలకు పెంచింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి తన సొంత జిల్లా అయిన ఉమ్మడి జిల్లాలోని కొండగల్​ నియోజకవర్గంలోని కోస్గిలో ఫిబ్రవరి 21న సీఎం పర్యటించారు. దాదాపు రూ.4,369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, అక్కడే నిర్వహించిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు.

సభలో వారంలో రూ.500 గ్యాస్​ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్​ అమలు చేస్తామని చెప్పారు. అదే నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రూ.500కే గ్యాస్​ సిలిండర్, 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్​ అమలు చేశారు. కానీ, సీఎం ఇలాకాలో ఈ రెండు స్కీములు అమలు కావడం లేదు. ఈ స్కీం ప్రారంభించిన రోజే ఉమ్మడి జిల్లాలో మహబూబ్​నగర్​ స్థానిక సంస్థల బై పోల్​ ఎలక్షన్​కు షెడ్యూల్​ రిలీజ్​ అయింది.

మార్చిలో పార్లమెంట్​ ఎలక్షన్స్​కు ఈసీ షెడ్యూల్​ రిలీజ్​ చేసింది. దీంతో దాదాపు మూడు నెలలుగా ఈ స్కీమ్​లు రాష్ట్రంలో అమలవుతున్నా, ఉమ్మడి జిల్లాలో అమలు కాలేదు. అయితే, ఈ నెల5న కోడ్ ముగిసింది. ఉమ్మడి జిల్లాలో కూడా ఈ స్కీమ్​లు ఇంప్లిమెంట్​ కానున్నాయి. వచ్చే నెల నుంచి 200 యూనిట్లలోపు కరెంట్​ వినియోగదారులకు జీరో బిల్లింగ్​ ఇవ్వనున్నారు.

సోమవారం నుంచి రివ్యూలు..

ఈ స్కీములను మహబూబ్​నగర్, నారాయణపేట, నాగర్​కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో ఇంప్లిమెంట్​ చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమవుతోంది. ఈ మేరకు సోమవారం నుంచి ఆయా జిల్లాల విద్యుత్​ శాఖ ఆఫీసర్లతో మంత్రులు, ఎమ్మెల్యేలు రివ్యూలు నిర్వహించనున్నారు. రివ్యూ అనంతరం ఎప్పటి నుంచి ఈ స్కీములను అమల్లోకి తీసుకొస్తారనే దానిపై క్లారిటీ రానుంది. 

త్వరలో రుణమాఫీ..

రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ఐదేండ్లుగా పెండింగ్​ పెట్టగా.. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్​ రూ.2 లక్షలలోపు రైతు రుణాలను మాఫీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. పార్లమెంట్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడంపై ఆఫీసర్లతో రివ్యూ చేస్తున్నారు.

సమీక్షలు నిర్వహించి అమలు చేస్తాం..

వరుస ఎలక్షన్​ కోడ్​తో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రూ.500కే గ్యాస్​ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్​ స్కీమ్స్​ అమలు కాలేదు. ఇప్పుడు కోడ్​ ముగిసింది. ఈ రెండు స్కీమ్స్​ త్వరలో ఇంప్లిమెంట్  చేసేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టింది. జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు రివ్యూ చేయనున్నారు. మహబూబ్​నగర్​ జిల్లాకు సంబంధించి మంగళవారం రివ్యూ నిర్వహిస్తాం.
-  యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్​నగర్​

‘గృహజ్యోతి’ లబ్ధిదారులు​

జిల్లా        సిలిండర్లు    బెనిఫిషియర్స్​
మహబూబ్​నగర్​    3,41,202    85,979
నారాయణపేట    1,14,937    54,919
నాగర్​కర్నూల్​    2,04,510    95,230
వనపర్తి        1,19,158    62,824
గద్వాల        1,17,467    80,923

200 యూనిట్లలోపు వినియోగదారులు

మహబూబ్​నగర్​    2,32,186
నారాయణపేట    1,00,216
నాగర్​కర్నూల్​    1,35,416
వనపర్తి        1,24,311
గద్వాల        1,18,522