తెలంగాణ తల్లి విగ్రహం పెడితే దొరలకు నచ్చదా?

  • సెక్రటేరియెట్​లో ప్రతిష్ఠిస్తే మీకేం ఇబ్బంది?
  • ట్విటర్​లో కేటీఆర్​ను ప్రశ్నించిన టీ కాంగ్రెస్
  • ఓడిపోయినా మీ బుద్ధి మారలేదంటూ ఫైర్​

హైదరాబాద్, వెలుగు: ‘‘రాష్ట్ర పాలనకు కేంద్ర బిందువైన సెక్రటేరియెట్​లో తెలంగాణ తల్లి విగ్రహం ఉండటం దొరలకు ఇష్టం లేదా..?”అని కేటీఆర్​ను ట్విటర్​లో తెలంగాణ కాంగ్రెస్ ప్రశ్నించింది. ఆ విగ్రహం అక్కడ పెడితే దొరలకు నచ్చదా..? అని నిలదీసింది. కేటీఆర్ ను ప్రశ్నిస్తూ.. సెక్రటేరియెట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అడ్డుకోవాలని బీఆర్ఎస్ ఎందుకు చూస్తున్నదని ఫైర్ అయింది.

 ‘‘మిస్టర్ మాజీ మినిస్టర్ కేటీఆర్... ఇంకెన్ని రోజులు ఈ డ్రామాలు’’అంటూ మండిపడింది. రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొట్టే చిల్లర రాజకీయాలను మానుకోవాలని హితవు పలికింది. ‘‘తెలంగాణ తల్లిపై కొంచెం కూడా గౌరవం లేదా? నీ అక్కసు అంతా వెళ్లగక్కుతున్నవ్. కాంగ్రెస్​పై బురదజల్లుతున్నవ్.. అధికారం పోయాక మీకు తెలంగాణ తల్లి గుర్తుకొచ్చిందా? అధికారంలో ఉన్న పదేండ్లు ఏం చేశారు? తెలంగాణ ప్రజలు మీతో గుంజీలు తీయించారు. చిత్తు చిత్తుగా ఓడించారు. అయినా మీలో మార్పు రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో గోడ కుర్చీ వేయించారు. ఇంకా ఇలాగే కొనసాగితే తలకిందులుగా వేలాడదీస్తరు’’అని కేటీఆర్​ను తెలంగాణ పీసీసీ హెచ్చరించింది.

బీఆర్ఎస్​ను ప్రజలు మరిచిపోయిన్రు

పదేండ్లు అధికారంలో ఉండి తెలంగాణ తల్లిని బీఆర్ఎస్ మరిచిపోయిందని తెలంగాణ కాంగ్రెస్ విమర్శించింది. అందుకే ప్రజలు బీఆర్ఎస్ ను మరిచిపోయారని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని హుందాగా వ్యవహరించాలని కేటీఆర్​కు సూచించింది. ‘‘మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని ప్రకటించడం వెనుక బీఆర్ఎస్ పన్నాగం అర్థం అవుతున్నది. మీ రాజకీయ ఉనికి కోసం మళ్లీ తెలంగాణ, ఆంధ్రా పేరుతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నరు. దొరల ఎత్తులను చిత్తు చేసి.. రాష్ట్ర అభివృద్ధికి నిరోధకులపై ఉక్కుపాదం మోపుతాం ఖబర్దార్ కేటీఆర్.. యువతను రెచ్చగొట్టి మీ ఫాం హౌస్ లో తయారు చేసిన విషపు చుక్కలను వారి మెదల్లలో ఎక్కించడానికి జరిగే కుట్రలను అడ్డుకుంటాం’’అని తెలంగాణ పీసీసీ వార్నింగ్ ఇచ్చింది.