భూసేకరణకు..ప్రజాభిప్రాయం అనివార్యం

 ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్​ ఒక సభలో మాట్లాడుతూ అభివృద్ధి చెయ్యాలంటే  ఎవరో  ఒకరు భూమి ఇవ్వాల్సిందే అన్నారు.తమ ప్రభుత్వం అభివృద్ధి చేసి తీరుతుంది అని గట్టిగా చెప్పారు. ఈ మాటలలో రెండు విషయాలు చాలా లోతుగా  పరిశీలించాల్సిన అవసరం ఉన్నది.  మొదటిది, ‘అభివృద్ధి’  ఏమిటి?   రెండోది,  ఆ ఎవరో  ఒకరు.. ఎవరు?  ప్రతి రాజకీయవేత్త  అభివృద్ధి అని వల్లె వేస్తుంటారు. కానీ,   అభివృద్ధి నిర్వచనం చెప్పరు.  దాని పరిణామాలు  అసలే  మాట్లాడరు.  భారత రాజ్యాంగంలో అభివృద్ధి రచనకు  సంస్థలు, విధి విధానాలు రూపొందించారు.  మనం  ప్రజాస్వామ్యం, లౌకిక విధానం ఎంచుకున్నాం.కనుక అభివృద్ధిని  నిర్ణయించేది ప్రజలే.  ప్రజలు ఎంచుకున్న ‘అభివృద్ధిని’  పాలకులు  అమలు చెయ్యాలి. 

గ్రామ పంచాయతీలు,  జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు  కలగలిపి  స్థానిక ప్రభుత్వాలు. తమ అభివృద్ధి నిర్వచించుకోవడానికి  వీటికి  సర్వ అధికారాలను  భారత రాజ్యాంగం కట్టబెట్టింది. తరువాత, శాసనసభ,  పార్లమెంట్ కూడా ‘అభివృద్ధి’ మీద  చర్చించడానికి, సమస్త  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న వేదిక.  అదనంగా,  అభివృద్ధి రచన శాస్త్రీయంగా,  సమానంగా, సామాజిక  న్యాయసూత్రాలకు లోబడి ఉండడానికి  జాతీయస్థాయిలో ప్రణాళిక సంఘం (ప్లానింగ్ కమిషన్), రాష్ట్రస్థాయిలో  కూడా ప్లానింగ్  కమిషన్  ఏర్పాటు చేసుకున్నాం. 

ప్రజాస్వామ్యంలో  రాచరిక  లక్షణాలు

ప్రాంతీయ  పార్టీలు ఒక అడుగు ముందుకు వేసి  ఏక వ్యక్తి  నిర్వచిత అభివృద్ధిపథానికి నాంది పలికారు.  తెలంగాణా రాష్ట్రంలో  ఉద్యమ పార్టీగా  గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ  రాష్ట్ర  సమితి  ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత  ప్రకటించిన  మేనిఫెస్టో  ఆధారంగా పాలన చెయ్యలే.   నిత్యం ‘బంగారు తెలంగాణ’ జపిస్తూ ఏక వ్యక్తి పాలనకు, వ్యక్తి ఆరాధన సహిత అభివృద్ధి రచనకు ఆ పార్టీ పరిమితం అయ్యింది. బంగారు తెలంగాణ నినాదంగానే మిగిలిపోయింది. సామాజిక తెలంగాణ పిలుపు వెనకబడిపోయింది.  

తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో  ప్రజలను అడగకుండా, ప్రజాభిప్రాయానికి భిన్నంగా, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసి,  సొంత పార్టీలో కూడా చర్చ లేకుండా, సంప్రదింపులు లేకుండా తాను అనుకున్నదే ‘అభివృద్ధి’గా  నిరంకుశంగా అమలు చేసిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.  ఇప్పుడు  ప్రజాస్వామ్యం మెండుగా ఉంటుంది అనుకున్న  కాంగ్రెస్  ప్రభుత్వంలో కూడా అదే ఏక వ్యక్తి నిర్ణయాలు పొడచూపుతున్నాయి.

సుప రిపాలనలో ప్రజలకు అనుగుణంగా, అందరికి అభివృద్ధి ఫలాలు అందించడానికి ఉన్న అధికార వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది.  అభివృద్ధి  రచనలో  ప్రజల భాగస్వామ్యం విస్మరిస్తున్న తెలంగాణ  ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి గురించి ఆలోచించటం లేదు.  ప్రజలు అడగని  పనులు చేస్తూ, అది తమ గొప్పతనంగా భావిస్తూ,  ప్రజలను ప్రకృతి వనరులకు దూరం చేస్తున్నారు తెలంగాణ పాలకులు.

స్థానిక  పెట్టుబడులకు ప్రోత్సాహం ఏది?

ముఖ్యమంత్రి  మాట్లాడిన మాటల నేపథ్యం, లగచర్లలో జరిగిన ఉదంతాలతో  ప్రతి రాజకీయవేత్త  అభివృద్ధి సూక్తులు  పలుకుతున్నారు. అభివృద్ధి  అంటే  పరిశ్రమలే అని అర్థం వచ్చే రీతిలో మాట్లాడడం జరిగింది.  తెలంగాణలో వచ్చిన  పరిశ్రమల వల్ల జరిగిన అభివృద్ధి మాట దేవుడెరుగు,  ఉన్న  బతుకు  నాశనవుతున్న  పరిస్థితులలోనే  ప్రజలు అధికార మార్పిడి చేశారు.  మార్పుకు,  సుపరిపాలనకు, అహంకార రహిత  ప్రజా ప్రభుత్వం అని ఒకవైపు చెబుతూ ఇంకోవైపు బీఆర్ఎస్​ తరహా  అభివృద్ధిని ఫాలో అవుతున్నది  ప్రస్తుత  ప్రభుత్వం.  ఫార్మా  పరిశ్రమలు పెడితేనే  అభివృద్ధి అని మంత్రులు, ముఖ్యమంత్రులు భావించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.  

పెట్టుబడిదారులు   నిధులతో  విమానంలో  వచ్చి ‘అభివృద్ధికి’  దోహదపడతారు అని భావించడం శోచనీయం.  విదేశీ  సూటుకేసుల మీద ఉన్న శ్రద్ధ ఇక్కడి  చిన్న, మధ్య  తరహా  పరిశ్రమల మీద ఏది?  స్థానిక  పెట్టుబడులకు ప్రోత్సాహం ఏది?   కాలుష్యం చేసే  పరిశ్రమలు కాకుండా  ఇంకా వేరే  రకం పరిశ్రమల అభివృద్ధి గురించి ఎందుకు ఆలోచించరు?    తాము కోరుకోని అభివృద్ధి  తమ మీద రుద్దడం  ఏంది అని ప్రశ్నిస్తున్నారు. మా  మానాన  మమ్మల్ని  బతకనీయండి అంటున్నారు.

ప్రజాభిప్రాయానికి అనుగుణంగా..మార్పులు తెచ్చే ప్రయత్నం ఏది?

వ్యవసాయ  అభివృద్ధి,  ఆహార పంటలు,  చేనేతల అభివృద్ధి,  ఇతర గ్రామీణ వృత్తులు,  సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు,  పర్యావరణం,  సమాజంలో  అట్టడుగు వర్గాలు,  పెరుగుతున్న కాలుష్యం,  ప్రజల అనారోగ్యం గురించి పట్టించుకోని అభివృద్ధి పాతబడ్డది.  బద్నాం అయ్యింది.  అయినా దానినే మంత్రంగా జపించడం  తెలంగాణ పాలకుల ఆలోచనలో ఉన్న వెనుకబాటుతనాన్ని సూచిస్తున్నది.  

ALSO READ | వరి సాగులో.. తెలంగాణ నంబర్‌‌ 1 : మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి

 ఇదివరకటి ముఖ్యమంత్రి,  ప్రస్తుత  ముఖ్యమంత్రి  సొంత నిర్ణయాలు తీసుకుని ‘అభివృద్ధి పథకాలు’ ప్రకటన చేయడం, ముందస్తుగా శాసనసభలో వాటి గురించి మాట్లాడకపోవడం గమనించదగిన విషయం.  వివిధ ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ,  జిల్లాల సంఖ్య పెంచడం,  విద్యుత్ ప్రాజెక్టులు,  యాదాద్రి,  ఫార్మా సిటీ,  ఫార్మా క్లస్టర్లు,  ఫోర్త్ సిటీ  వగైరా ప్రాజెక్టుల గురించి ప్రజలతో సంప్రదింపులు చేయలేదు. వారి అభిప్రాయం  అడగలేదు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వాటిలో మార్పులు తెచ్చే ప్రయత్నం చేయలేదు.  

ప్రజాభిప్రాయమే  పరమావధి

ఇప్పటికైనా  తెలంగాణ  ప్రభుత్వం  కండ్లు తెరిచి అహంకార రహిత,  ప్రజాభిప్రాయమే  పరమావధిగా  పరిగణించేలా  పాలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.  భూమి,  నీరు, గాలి  తదితర వనరులు కొందరికే కాకుండా అందరికీ  అందేవిధంగా చర్యలు చేపట్టాలి.  తాము  చేపట్టబోయే  అభివృద్ధి  ముసాయిదా  తయారుచేసి, ప్రజల ముందుపెట్టి వారి ఆమోదంతో అమలుచెయ్యాలి. సుపరిపాలనలో మొట్టమొదటి అడుగు పారదర్శకత. సుస్థిర అభివృద్ధిలో మొట్టమొదటి అవసరం సుపరిపాలన.  ‘అభివృద్ధి’ అంటే పరిశ్రమలకు భూమి,  భూసేకరణ  అనివార్యం  అనే విషయం  తెలంగాణ ముఖ్యమంత్రి  మరిచిపోవాలి.  గుర్తించుకోవాల్సింది  ఏమిటంటే ప్రజలు కోరుకున్నదే అభివృద్ధి, వారి అభిప్రాయమే పరమావధి.  

భూనిర్వాసితులకు మానసిక హింస

అభివృద్ధికి భూమి ఎవరైనా ఇయ్యాల్సిందే అని ముఖ్యమంత్రి అనడంలో భూసేకరణకు అందరూ సమానమే అనే అర్థం గోచరిస్తున్నా ఆచరణలో అట్లా జరగడం లేదు.  తెలంగాణలో  ఇప్పటివరకు జరిగిన భూసేకరణలో అసైన్డ్ భూమి, దళిత, గిరిజనుల భూములే ఎక్కువగా ఉన్నాయి.  పోలేపల్లిలో  ఫార్మా సెజ్  వ్యతిరేక ఉద్యమంలో ఈ విషయం ప్రత్యక్షంగా ప్రస్తావించారు.

హైదరాబాద్  ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కొందరి కోసం మార్చటం,  ప్రతిపాదిత రీజినల్ రింగ్  రోడ్డు  విషయంలో,  ఫార్మా సిటీ,  జహీరాబాద్ నిమ్జ్, గతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, ఆఖరుకు పల్లె వనం,  రైతు వేదికలు కూడా బలహీనుల భూముల్లోనే ప్రతిపాదించారు.  మిషన్  భగీరథ  పైపులైన్లు కూడా ఆ విధంగానే వేశారు.

 ప్రధానంగా  ప్రైవేట్ పరిశ్రమ  ప్రయోజనం కోసం  ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి భూసేకరణ చేయడం కూడా  రైతులలో అసంతృప్తికి  ఒక ప్రధాన కారణం.  భూసేకరణ కూడా  ప్రజలకు అనుకూలంగా జరగలేదు.   తెలంగాణ  ఏర్పడిన తరువాత  నిర్వాసితుల  సమస్య  పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లయ్యింది.  వివిధ  వ్యూహాలతో  భూనిర్వాసితుల మీద  అధికారులు  జరిపిన  మానసిక హింస  చెప్పనలవి కాదు.

- డా. దొంతి నర్సింహారెడ్డి