మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం నుంచి పైసా పెట్టం : సీఎం రేవంత్ రెడ్డి

  • పీపీపీ మోడల్​లో పనులు
  • ఫస్ట్ ఫేజ్​లో బాపూఘాట్ వరకు 21 కి.మీ. మేర అభివృద్ధి 
  • ఎవరు గగ్గోలు పెట్టినా వెనక్కి తగ్గేదే లేదు
  • మూసీ పునరుజ్జీవంపై వాడపల్లి నుంచి వికారాబాద్ దాకా పాదయాత్ర
  • నాతో నడవడానికి కేటీఆర్​, హరీశ్​రావు, ఈటల వస్తరా?
  • బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం పెడ్తం 
  • గండిపేటకు మల్లన్నసాగర్ నీళ్లు తెచ్చేందుకు ట్రంక్ లైన్
  • మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తర్వాతే మంత్రివర్గ విస్తరణ అని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం నుంచి పైసా ఖర్చు చెయ్యబోమని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్​నర్​షిప్ (పీపీపీ) పద్ధతిలోనే మూసీ రివర్ ఫ్రంట్​ డెవలప్​మెంట్ పనులు చేపడతామని వెల్లడించారు. ఫస్ట్ ఫేజ్​లో బాపూ ఘాట్ వెనుక వైపు దాదాపు 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేస్తామని వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర ఆదాయం వేరే లెవెల్​కు చేరుతుందని చెప్పారు. 

మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో మీడియాతో సీఎం రేవంత్​రెడ్డి చిట్​చాట్​చేశారు. మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వ ఆలోచనలను పంచుకున్నారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దిగజార్చింది. మూసీ ప్రాజెక్టుకు ఖర్చు చేసే పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు. దీనికి ప్రభుత్వం నుంచి ఒక్క పైసా పెట్టం. ఇప్పటికే ఎంపిక చేసిన ఐదు కంపెనీలు.. డీపీఆర్ రెడీ చేయడంతో పాటు ప్రాజెక్టుకు ఫైనాన్స్ ఎలా చేయాలనే దానిపైనా రిపోర్ట్​ ఇస్తాయి” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

నేను ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఒక్కటికి వెయ్యిసార్లు ఆలోచిస్త. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. ఎవరు అడ్డుకున్నా, ఎంత గగ్గోలు పెట్టినా మూసీ పునరుజ్జీవంపై వెనక్కి తగ్గేది లేదు” అని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. ‘‘మూసీ పునరుజ్జీవంపై వాడపల్లి నుంచి వికారాబాద్​వరకు నేను పాదయాత్ర చేస్తాను. కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్​నాతో కలిసి నడుస్తరా? పాదయాత్రలో వారి ముందే స్థానిక ప్రజలను మూసీని బాగుచేయాలో? వద్దో? అడుగుదాం.. అందుకు సిద్ధమా?” అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ అక్రమ సొమ్ముతో మూసీ పునరుజ్జీవంపై సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. 

అదానీతో ఒక్క ఒప్పందం చేసుకోలేదు.. 

కార్పొరేట్ కంపెనీల నుంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు దండుకున్నదని సీఎం రేవంత్​రెడ్డి ఆరోపించారు. కానీ తాము అదే కార్పొరేట్ కంపెనీల నుంచి దాదాపు రూ.500 కోట్లు తెచ్చి స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మిస్తున్నామని చెప్పారు. ‘‘మేం అదానీతో కలిశామని అంటున్నారు. కలవకుంటే స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు ఎలా ఇస్తారు. అదానీతో ఒక్క ఒప్పందమైనా కుదుర్చుకున్నట్టు చూపించండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకుందో నేను లిస్టు బయటపెడతాను. మేం ఇప్పటి వరకు ఒక్క మేజర్ టెండర్ పిలవలేదు. ఎకరం భూమి కూడా అమ్మలేదు. అలాంటప్పుడు అవినీతికి పాల్పడుతున్నామని ఎలా ఆరోపిస్తారు?” అని ప్రశ్నించారు. 

రాజ్ పాకాల ఎందుకు పారిపోయిండు? 

కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్​హౌస్​లో జరిగిన పార్టీపై సీఎం రేవంత్​రెడ్డి స్పందించారు. ‘‘దీపావళి పండుగ అంటే మనకు చిచ్చుబుడ్లు.. వాళ్లకు మాత్రం సారాబుడ్లు. దీపావళి దావత్ వాళ్లు అలా చేస్తారని మాకు తెల్వదు. రాజ్ పాకాల ఏం చేయకపోతే.. ఎందుకు పారిపోయిండు? ముందస్తు బెయిల్ ఎందుకు అడిగిండు? అయినా ఇంటి కాడ దావత్​ చేసుకుంటే క్యాసినో కాయిన్స్, నాన్​ పెయిడ్​డ్యూటీ విదేశీ మద్యం ఎందుకు దొరికినయ్? డ్రగ్స్​తీసుకున్నట్టు రిపోర్ట్​ఎట్లొచ్చింది? గివన్నీ ఉంటాయా.. మన ఇండ్లల్ల దావత్​ఇట్లనే చేసుకుంటమా?. 

ఆడవాళ్లు లిక్కర్ తాగరా అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అంటే తెలంగాణ మహిళలందరూ తాగుతారనా? వాళ్లు మాట్లాడేది” అని ప్రశ్నించారు. కాగా, ఫోన్‌‌ ట్యాపింగ్‌‌, కాళేశ్వరం, విద్యుత్‌‌ కొనుగోళ్లపై విచారణ కొనసాగుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ‘‘ఈ కేసుల విచారణ విషయంలో ఎలాంటి కక్షసాధింపు ఉండదు. దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవస్థలను దుర్వినియోగం చెయ్యం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పాస్ పోర్టు రద్దయింది. ఇప్పుడు ఆయన ఏ దేశంలో ఉన్నా అక్రమ వలసదారుడే. ఈ కేసులో శ్రవణ్ రావు బయటకు వచ్చాడు. త్వరలో కేసు ఓ కొలిక్కి వస్తుంది” అని తెలిపారు.

నాది గేమ్ ప్లాన్..  

మూసీ పునరుజ్జీవంపై కావాలనే చర్చకు తెరలేపామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ఈ చర్చ కారణంగానే మూసీని బాగు చేసేవాడొకడు వచ్చాడని ప్రజలకు, ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకుంటున్న బీఆర్ఎస్​ లీడర్లలో ఎంత విషం ఉందో ప్రజలకు అర్థమవుతున్నదన్నారు. హైడ్రాతో దేశవ్యాప్తంగా తన గురించి చర్చిస్తున్నారని పేర్కొన్నారు. ‘‘నేను ఫుట్‌‌బాల్‌‌ ప్లేయర్‌‌. గేమ్‌‌ ప్లాన్‌‌పై నాకు పూర్తి స్పష్టత ఉంది. మూసీ విషయంలోనూ ఫుట్​బాల్​గేమ్ ​మాదిరి మ్యాపింగ్​ చేసుకున్నాను. 

బలాలు, బలహీనతల ఆధారంగా నా స్టైల్​లో పని చేసుకుంటూ వెళ్తున్నాను. మూసీ ప్రాజెక్టుతో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. రాజకీయంగా నష్టం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నం” అని చెప్పారు. ‘‘నా ప్లాన్ తో కేసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేశాను. కేటీఆర్‌‌ను బయటకు తెచ్చి, కేసీఆర్ ఉనికి లేకుండా చేశాను. మరో ఏడాదిలో కేసీఆర్ పేరు కనిపించకుండా చేస్తాను. ఇక భవిష్యత్తులో కేటీఆర్‌‌ని రాజకీయంగా లేకుండా చేయడానికి ఆయన బావ హరీశ్ రావును వాడతాను” అని అన్నారు.

హైదరాబాద్ అభివృద్ధికి లక్షన్నర కోట్లు..  

మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర రూపురేఖలు మారుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్​లో టూరిజం మరింత అభివృద్ధి చెంది, ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌‌ నుంచే 65 శాతం ఆదాయం వస్తోందన్నారు.  ‘‘మూసీ కోసం రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామనేది అబద్ధం. ప్రైవేటు సంస్థల నుంచి నిధులు సేకరించే మూసీ పునరుజ్జీవం చేపడతాం. రూ.లక్షన్నర కోట్లు హైదరాబాద్ మొత్తాన్ని అభివృద్ధి చేసేందుకు ఖర్చు చేస్తాం. ఇందులో రూ.25 వేల కోట్లు మెట్రోకు, ట్రిపుల్ ఆర్ కు రూ.30 వేల కోట్లు, ఓఆర్ఆర్​ టు ట్రిపుల్ ఆర్ రేడియల్​ రోడ్లకు రూ.10 వేల కోట్లు, ఎస్టీపీల నిర్మాణం, నష్ట పరిహారం చెల్లింపులకు రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్లు, మల్లన్నసాగర్​ నుంచి గండిపేటకు నీళ్లు తెచ్చేందుకు ట్రంక్ ​లైన్​ ఏర్పాటుకు రూ.6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్లు, ఎలివేటర్లు, ఇతరత్రాలకు రూ.30 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశాం” అని సీఎం వివరించారు. 

హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోలేదు..

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని.. వాటి తర్వాతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్​ తెలిపారు. ‘‘నాకు ఢిల్లీ పెద్దలతో ఎలాంటి గ్యాప్ లేదు. రాష్ట్రంలో నేనే ఏఐసీసీ. ఇప్పటి వరకు జరిగినవన్నీ నా ఇష్ట ప్రకారమే జరిగాయి” అని సీఎం చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, అందుకోసం నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని పేర్కొన్నారు. ‘‘ సీఎం కావాలని 2004లోనే అనుకున్నాను.. అది నెరవేరింది. ఇక నాకేం కోరికలు లేవు. ప్రజలకు మేలు చేయాలన్నదే నా లక్ష్యం. నాది చిన్న వయసు. 

రాజకీయంగా ఇంకా భవిష్యత్తు ఉంది. నిర్బంధ పాలనతో ప్రజాగ్రహన్ని మూటగట్టుకోను. అందరి విషయంలోనూ ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తా’’ అని చెప్పారు. కాగా, హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ‘‘హైడ్రా వల్ల రియల్‌‌ ఎస్టేట్‌‌ పడిపోయిందని ప్రచారం చేయడం సరికాదు. ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది” అని సీఎం చెప్పారు.

మూసీపై చర్చకు సిద్ధం.. 

గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.5 కిలోమీటర్లు, 11.5 కిలోమీటర్ల చొప్పున ఫస్ట్ ఫేజ్ పనులు చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నెలన్నరలో డిజైన్లు పూర్తవుతాయని చెప్పారు. ‘‘బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తాం. మూసీని ఎకో ఫ్రెండ్లీ అండ్ వెజిటేషన్ కాన్సెప్ట్ తో అభివృద్ధి చేస్తాం. బాపూఘాట్ దగ్గర బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణం చేపడతాం. అక్కడ అభివృద్ధి కోసం ఆర్మీ ల్యాండ్ కూడా ఆడిగినం. దానికి బదులుగా ఇంకో దగ్గర వాళ్లకు ల్యాండ్ ఇస్తాం. 

మురుగునీటి శుద్ధి కోసం15 రోజుల్లో ఎస్టీపీలకు టెండర్లు పిలుస్తాం. ఫస్ట్ ఫేజ్ లో జరగనున్న పనుల్లో భాగంగా స్టాన్ ఫర్డ్ లాంటి అంతర్జాతీయ యూనివర్సిటీలు, గాంధీ ఐడియాలజీ సెంటర్, రీక్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దల దాకా అందరూ వారాంతంలో ప్రశాంతంగా సేదతీరేలా మూసీ పునరుజ్జీవం ఉంటుంది” అని వివరించారు. మూసీకి భూములిచ్చే వారికి సంతృప్తికరమైన ప్యాకేజీ ఇస్తామని, ప్రజలను కష్టపెట్టి భూములు తీసుకోబోమని స్పష్టం చేశారు. ‘‘సూటుబూటు వేసుకుని విదేశాల్లో తిరిగిన కేటీఆర్ కు మూసీని ఎలా బాగు చేయాలో తెలియదా? మూసీ పునరుజ్జీవంపై కేటీఆర్‌‌, హరీశ్‌‌రావు, ఈటల రాజేందర్​ తమ సలహాలు, సూచనలు ఇవ్వాలి. 

వాళ్లు వస్తే కచ్చితంగా అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం. అసెంబ్లీలో చర్చకు కూడా సిద్ధం” అని తెలిపారు. తనను కలవడం ఇష్టం లేకపోతే.. మంత్రులు, సీఎస్​ను కలిసి అభ్యంతరాలు చెప్పాలన్నారు. మూసీ విషయంలో ఈటలకు ఒక స్టాండ్​ లేదని.. కేటీఆర్, హరీశ్ మాట్లాడిందే మాట్లాడుతున్నారని విమర్శించారు. కాగా, మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తెచ్చి గండిపేటలో పోస్తామని, దీనికి సంబంధించిన ట్రంక్ లైన్ కోసం నవంబర్ మొదటి వారంలో టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.