హైదరాబాద్ ఏఐ స్మార్ట్​ సిటీ నాస్కామ్​తో కలిసి ముందుకు వెళ్తాం : సీఎం రేవంత్​రెడ్డి

  • ఏఐ రంగంలో అందరి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తం
  • టెక్నాలజీ, ఆవిష్కరణలు లేకుండా సమాజంలో ఏ మార్పు జరగదు
  • రైలు, విమానాలను కనిపెట్టడంతో ప్రపంచం రూపురేఖలే మారినయ్​
  • టీవీ, మొబైల్​, కంప్యూటర్​, ఇంటర్నెట్ ​వంటివి చూడడం మన తరం అదృష్టం
  • ఇప్పుడు సాంకేతిక రంగంలో వచ్చిన గొప్ప ఆవిష్కరణ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​
  • కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు భయాలు ఉండడం సహజమని వ్యాఖ్య
  • హైదరాబాద్​ హెచ్​ఐసీసీలో ఏఐ గ్లోబల్​ సమిట్​ ప్రారంభం
  • ఏఐ రోడ్​ మ్యాప్​,  తెలంగాణ గ్రోత్​ స్టోరీ డాక్యుమెంట్లను రిలీజ్​ చేసిన సీఎం

హైదరాబాద్​, వెలుగు : హైదరాబాద్​ను ఏఐ స్మార్ట్​ సిటీగా అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం నాస్కామ్​తో కలిసి ముందుకు సాగుతామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. దేశంలో హైదరాబాద్​ సిటీలాగా ఏ నగరం కూడా పరిశ్రమల ఏర్పాటుకు సంపూర్ణంగా సిద్ధంగా లేదని చెప్పారు. ‘‘సిటీ ఆఫ్​ ది ప్యూచర్​ మన హైదరాబాద్​. ఈ హైదరాబాద్​ సిటీని ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​(ఏఐ) సిటీగా అభివృద్ధి చేసేందుకు  ఎదురయ్యే సవాళ్లను స్వీకరిస్తాం. ఓ సుస్థిరమైన భవిష్యత్​ను సృష్టిస్తాం. ఇప్పటికే ఏఐ అభివృద్ధి కోసం ఎన్నో చర్యలు తీసుకున్నాం. 

ఈ రంగంలో అందరి భవిష్యత్​కు బలమైన పునాది వేయాలని సంకల్పించాం” అని వివరించారు. ఏఐ అభివృద్ధిపై తమ చిత్తశుద్ధిని ఏ మాత్రం శంకించాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ఏఐ మిషన్​ (టీ ఎయిమ్​) కోసం నాస్కామ్​తో కలిసి ఏఐ ఫ్రేమ్​వర్క్​ రూపొందించామని ఆయన వెల్లడించారు. గురువారం హైదరాబాద్​ హెచ్​ఐసీసీలో ఏఐ గ్లోబల్​ సమిట్​ను మంత్రి శ్రీధర్​బాబుతో కలిసి సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఏఐ రోడ్​ మ్యాప్​తో పాటు తెలంగాణ గ్రోత్​ స్టోరీ డాక్యుమెంట్లను సీఎం విడుదల చేశారు. అనంతరం సదస్సులో ఆయన మాట్లాడారు. ఇండస్ట్రీ నిపుణులతో కలిసి ఏఐ ఆవిష్కరణలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని  చెప్పారు.హైదరాబాద్​ను ఏఐ హబ్​గా తీర్చిదిద్దుతామని చెప్పేందుకు ఈ  సమిట్​ నిదర్శనమన్నారు. ఇలాంటి సిటీ ఆఫ్​ ద ఫ్యూచర్​కు ఆవిష్కర్తలందరికీ స్వాగతమని పేర్కొన్నారు. ఫ్యూచర్​ సిటీని గొప్ప ఏఐ హబ్​గా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఆయన  పిలుపునిచ్చారు. 

కొన్ని భయాలున్నా ముందుకెళ్లాల్సిందే

సాంకేతికత, ఆవిష్కరణ లేకుండా సమాజంలో ఏ మార్పు జరగదని సీఎం రేవంత్​ అన్నారు. ‘‘రైలు ఇంజన్​ ఆవిష్కరణ తర్వాత ప్రపంచ గమనం మారింది. ఆ తర్వాత విమానం ఆవిష్కరణతో ప్రపంచ స్వరూపమే మారింది. కరెంట్​, బల్బు, టీవీ, కెమెరా, కంప్యూటర్​ ఇవన్నీ ప్రపంచ గతిని మార్చడంలో కీలక పాత్ర పోషించాయి. టీవీలు, కంప్యూటర్లు, ఇంటర్నెట్​, మొబైల్​ ఫోన్​ వంటి వాటన్నింటినీ చూడడం మన తరం చేసుకున్న అదృష్టం. వాటిని మించి ఇప్పుడు ప్రపంచ సాంకేతిక రంగంలో వచ్చిన అత్యుత్తమ ఆవిష్కరణ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​” అని వివరించారు. 

కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా కొన్ని భయాలు ఉండడం సహజమని తెలిపారు.  ఏఐ లాంటి కొత్త టెక్నాలజీలు మన జీవితాన్ని ఎలా బాగు చేస్తాయన్న ఆలోచనతో పాటు ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంటుందా అన్న భయాలూ ఉండడం సహజమేనని తెలిపారు. సవాళ్లను దాటుకుని ముందుకు వెళ్తామని, హైదరాబాద్​ను ఏఐ హబ్​గా రూపుదిద్దుతామని సీఎం రేవంత్​ ప్రకటించారు. 

వివిధ కంపెనీలతో భేటీ

వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్​ రెడ్డి, శ్రీధర్​బాబు సమావేశమయ్యారు. యొట్ట ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ సొల్యూషన్​ ఎల్​ఎల్​పీ సీఈవో సునీల్​ గుప్తాతో భేటీ అయి హైదరాబాద్​లో జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్​ ఏర్పాటులో భాగస్వామ్యంపై చర్చించారు. ఐబీఎం వైస్​ ప్రెసిడెంట్​ డానియల్​ కాంబ్​తో సమావేశంలో ఏఐ భవిష్యత్​ అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై డిస్కస్​ చేశారు.

 జేపీఏల్​ గ్లోబల్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ ఇక్బాల్​ సింగ్​ దలివాల్​తో సమావేశమై.. ఏఐ రంగంలో సాధించాల్సిన అభివృద్ధి గురించి చర్చించారు. కాగా,  ఏఐ గ్లోబల్​ సమిట్​లో వివిధ దేశాలకు చెందిన 2వేల మంది ఏఐ నిపుణులు పాల్గొన్నారు. సమిట్​లో ఏఐ స్టాల్స్​ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శుక్రవారం కూడా సమిట్​ కొనసాగనుంది.