పీసీసీ చీఫ్‌‌గా హామీ ఇచ్చి .. సీఎంగా నెరవేర్చిండు

  • వేములవాడకు సీఎం రేవంత్‌‌రెడ్డి వరాల జల్లు 
  • రూ.679 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు 
  • ఆలయ విస్తరణతోపాటు యార్న్‌‌ డిపో ఏర్పాటుకు నిధులు 
  • సుమారు 5గంటలపాటు సాగిన సీఎం పర్యటన 
  • సీఎం టూర్‌‌‌‌ సక్సెస్‌‌తో శ్రేణుల్లో జోష్‌‌ 

వేములవాడ, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వేములవాడను అభివృద్ధి చేస్తానన్న పీసీసీ చీఫ్‌‌గా మాట ఇచ్చిన రేవంత్‌‌రెడ్డి.. నేడు సీఎం హోదాలో నెరవేర్చిండు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ హోదాలో రాజన్నను దర్శించుకున్న ఆయన ఆలయ అభివృద్ధితోపాటు, సిరిసిల్ల నేత కార్మికుల కోసం జిల్లాలో యార్న్‌‌ డిపో ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.76కోట్లతో ఆలయ అభివృద్ధి పనులతోపాటు, పట్టణంలో రూ.50కోట్లతో ఏర్పాటు చేయనున్న యార్న్‌‌ డిపో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దీంతోపాటు సుమారు రూ.679కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆలయ సమీపంలోని గుడిచెరువు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. సుమారు 5గంటలపాటు వేములవాడలో సీఎం పర్యటన కొనసాగింది. వేములవాడపై సీఎం రేవంత్‌‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. సీఎం మాట్లాడుతున్నంతసేపు కార్యకర్తలు, ప్రజలు ఓపిగ్గా విన్నారు. స్థానిక కాంగ్రెస్‌‌ నేతలు సీఎం రేవంత్‌‌రెడ్డికి రాజన్న చిత్రపటం, శివుడి ప్రతిమ, త్రిశూలం బహూకరించారు.  

తొలిసారి కేబినేట్​ సగం వేములవాడలో.. 

సీఎం పర్యటనలో ఆయనతోపాటు కేబినేట్‌‌లో సగం మంది మంత్రులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా ఇన్‌‌చార్జి మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌‌‌రెడ్డి, జిల్లా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌బాబు, పొన్నం ప్రభాకర్‌‌‌‌తోపాటు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ.. ఇలా కేబినేట్‌‌లోని ముఖ్య శాఖల మంత్రులు వేములవాడ పర్యటనకు రావడం దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి. వీరితోపాటు పీసీసీ చీఫ్ మహేశ్‌‌కుమార్‌‌‌‌గౌడ్‌‌, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌‌, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, విజయరమణారావు, ఎంఎస్‌‌ రాజ్‌‌ఠాకూర్, ఎమ్మెల్సీలు జీవన్‌‌రెడ్డి, బల్మూరి వెంకట్​పాల్గొన్నారు. 

సీఎం పర్యటన సాగిందిలా.. 

హైదరాబాద్‌‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌‌‌‌లో సీఎం రేవంత్‌‌రెడ్డి ఉదయం 10.55 గంటలకు వేములవాడ గుడిచెరువు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌‌లో దిగారు. ఆయనకు కలెక్టర్​సందీప్‌‌కుమార్​ ఝా, ఎస్పీ అఖిల్‌‌మహాజన్‌‌, ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​​ ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి గెస్ట్​ హౌస్‌‌ చేరుకున్నారు. ఉదయం 11.08గంటలకు పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఆలయం వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీజీపీ జితేందర్ బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం రాజన్న ఆలయ ధర్మగుండం వద్ద ఉదయం 11.18 గంటల నుంచి 11.45గంటల వరకు ఆలయ అభివృద్ధిపనులకు భూమిపూజ చేశారు. 

అక్కడే దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ శైలజా రామయ్యర్​ సీఎంకు ఆలయ అభివృద్ధి మాస్టర్‌‌‌‌ప్లాన్‌‌ వివరించారు. అనంతరం 11.56 గంటలకు ఆలయంలోకి ప్రవేశించిన సీఎం, మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 11.58 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటలకు స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనుబంధ ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం 12.23 గంటలకు అద్దాల మంటపంలో సీఎం, మంత్రులకు విప్ ఆది శ్రీనివాస్‌‌ నంది ప్రతిమలు, రాజన్న ప్రసాదం అందజేశారు. మధ్యాహ్నం 12.44 గంటలకు గెస్ట్ హౌస్ చేరుకున్నారు. మొత్తం 49 నిమిషాల పాటు రాజన్న ఆలయంలో గడిపారు. 

అనంతరం మధ్యాహ్నం 1.21 గంటలకు పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌‌గా శంకుస్థాపనలు చేశారు. 1.26 గంటలకు బహిరంగ సభకు చేరుకున్నారు. సభావేదికపై నుంచి యార్న్‌‌డిపోను వర్చ్‌‌వల్‌‌గా ప్రారంభించి నలుగురు మహిళలకు  నూలు అందించారు. బహిరంగ సభలో మధ్యాహ్నం 2.55 గంటల నుంచి 3.31 గంటలకు వరకు ప్రసంగించారు. 3.38 గంటలకు హెలీప్యాడ్‌‌ చేరుకొని హైదరాబాద్​ తిరుగు పయనమయ్యారు.

పీసీసీ హోదాలో వేములవాడకు హామీలు..  

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ హోదాలో రేవంత్‌‌రెడ్డి వేములవాడ నియోజకవర్గంలో పర్యటించారు. రాజన్నను దర్శించుకున్న ఆయన.. ఆలయ అభివృద్ధికి ఏటా రూ.100 కోట్లు ఇస్తానని కేసీఆర్​ హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వేములవాడ ఆలయ అభివృద్ధి చేసే బాధ్యత తనదని మాటిచ్చారు. అనంతరం నిర్వాసిత గ్రామం సంకెపల్లిలో నిద్ర చేశారు. అసంపూర్తిగా ఉన్న కలికోట సూరమ్మ  ప్రాజెక్టును సందర్శించారు. 

 ప్రస్తుత ఎమ్మెల్యే అది శ్రీనివాస్​ ఇక్కడ సమస్యలను రేవంత్‌‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంపై నియోజకవర్గ ప్రజలతోపాటు శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌తోపాటు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌‌చార్జి కేకే మహేందర్‌‌‌‌రెడ్డిలను అభినందించారు. 

పట్టువిడవని విక్రమార్కుడు మీ శ్రీనన్న 

‘మీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌ను చూస్తే నాకు భయం వేస్తోంది.. ఎందుకంటే ఏం నిధులు అడుగుతాడో మళ్లా అని.. హైదరాబాద్‌‌ వచ్చి నన్ను కలిసినప్పుడల్లా ఏదో ఓ ఫైల్​ పట్టుకొచ్చి పైసలు కావాలంటడు.. మీరు ఓట్లు వేసి గెలిపించిన మీ శ్రీనన్న ప్రతిరోజూ మీ గ్రామాల్లో, తండాల్లో తిరుగుతున్నాడు. పొద్దుగాల లేస్తే ఊళ్లపంటి తిరుగుతాడు.. నిరంతరం పట్టువిడవని విక్రమార్కుడిలా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తడు.. గెలిపించిన ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని పరితపిస్తడు.’ అని స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌‌రెడ్డి తన ప్రసంగంలో వివరించారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ గురించి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిండని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిండు.. పెప్పర్ స్ర్పేలను కొట్టించుకున్నడని గుర్తుచేశారు. 

ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తం..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెండింగ్‌‌ ప్రాజెక్టులన ఉపూర్తి చేస్తామని జిల్లా ఇన్‌‌చార్జి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌‌‌రెడ్డి తెలిపారు. వారం రోజుల్లో మరోసారి కరీంనగర్‌‌‌‌కు వచ్చి పెండింగ్‌‌ ప్రాజెక్టులపై రివ్యూ చేస్తానన్నారు. కేబినేట్ మంత్రుల్లో సగం మంది వేములవాడకు రప్పించిన స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చరిత్రలో నిలిచి పోతారన్నారు.  ఈ వానకాలం సీజన్‌‌లో వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉందన్నారు. కాళేశ్వరం నుంచి నీరు లిఫ్ట్ చేయకున్నా 66.7 లక్షల ఎకరాల్లో రైతులు 153 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించారన్నారు.  ఉమ్మడి జిల్లాలోని కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు రూ.70 కోట్లు ఖర్చు పెట్టామని మరో రూ. 30 కోట్లు కేటాయించి పూర్తిచేస్తామన్నారు. ఎల్లంపల్లి స్టేజీ 2  పనులు పూర్తిచేసి లక్షా 51 వేల 400 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. -

ఆర్థిక క్రమశిక్షణతో హామీలను నెరవేరుస్తున్నాం 

ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు పేర్కొన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ శ్రమజీవి అని, ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటారని కొనియాడారు. రైతుల కోసం శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు కట్టింది కాంగ్రెస్‌‌ ప్రభుత్వాలేనన్నారు. గతంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నూలు డిపో ఏర్పాటు చేశామన్నారు. 

నేతన్నల కోసం ఉపాధికి బృహత్తర ప్రణాళిక 

వేములవాడ రాజన్న దర్శించుకునే భక్తుల కోసం ఆలయంలో నిత్యాన్నదానం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ అన్నారు. నిత్యన్నదాన సత్రానికి రూ.35 కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్​ రెడ్డికి ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కాగితపు హామీలకే పరిమితమైన.. వేములవాడలో నేడు అభివృద్ధి పనులు పట్టాలెక్కుతున్నాయన్నారు. సిరిసిల్ల నేతన్న కార్మికుల సంక్షేమం కోసం యార్న్​ డిపో ప్రారంభించామని, రాబోయే రోజుల్లో నేతన్నల ఉపాధి కోసం బృహత్తర ప్రణాళిక రూపొందిస్తామన్నారు. 

వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తాం 

రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గం లో 3500 చొప్పున నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీలు, కులాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదకు ఇండ్లు ఇస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. నాడు మిడ్​ మానేరు నిర్వాసితులకు కేసీఆర్​ఇచ్చిన మాట నిలుపుకోలేదని, తమ ప్రభుత్వం రూ.250కోట్లు కేటాయించి 4964 ఇండ్లను నిర్మించనున్నామన్నారు.