నాపై కక్ష ఉంటే తీర్చుకోండి..కానీ,అభివృద్ధికి అడ్డుపడొద్దు : సీఎం రేవంత్​రెడ్డి

  • ప్రాజెక్టులపైకుట్రలు చేస్తే ప్రజలు క్షమించరు : సీఎం రేవంత్​రెడ్డి
  • రాష్ట్రం వచ్చి పదేండ్లయినాపాలమూరు వలసలు ఆగలే
  • కేసీఆర్​ను ఆనాడు ఇక్కడి ప్రజలుఎంపీగా గెలిపిస్తే చేసిందేంది?
  • ఆయనకు కృతజ్ఞత లేదు.. కొడంగల్​ఎత్తిపోతలపై చిల్లర రాజకీయాలు 
  • పెండింగ్​ ప్రాజెక్టులను పూర్తి చేస్తుంటే కండ్లల్ల నిప్పులు పోసుకుంటున్నరని ఫైర్​
  • కురుమూర్తి ఆలయంలో సీఎం పూజలు..ఘాట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

మహబూబ్​నగర్​, వెలుగు : పదేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో ఇరిగేషన్​ ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతోనే పాలమూరు వలసలు ఇంకా కొనసాగుతున్నాయని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ఇప్పుడు కూడా కాళ్లలో కట్టెలు పెట్టి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని, వాళ్లను ప్రజలు క్షమించబోరని హెచ్చరించారు. ‘‘నాపై కక్ష ఉంటే తీర్చుకోండి. కానీ, అభివృద్ధిని మాత్రం అడ్డుకోవద్దు” అని ఆయన సూచించారు. మహబూబ్​నగర్​ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్​ శివారులోని కురుమూర్తి క్షేత్రాన్ని ఆదివారం మధ్యాహ్నం సీఎం రేవంత్​రెడ్డి దర్శించుకున్నారు.

మెయిన్​ రోడ్డు నుంచి కురుమూర్తి గుట్టపైకి రూ.110 కోట్లతో నిర్మించనున్న ఘాట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆలయంలో పూజల అనంతరం గుట్ట దిగువన ఉన్న జాతర గ్రౌండ్​లో ఆయన మాట్లాడారు. పాలమూరు జిల్లాకు లేక లేక ఒక అవకాశం వచ్చిందని.. అభివృద్ధి చేసుకోవాలని చూస్తే కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్​ అయ్యారు. కొడంగల్ ఎత్తిపోతలపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘పెండింగ్​ ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిధులు ఇస్తుంటే కొందరు దుర్మార్గులు కండ్లల్ల నిప్పులు పోసుకుంటున్నరు. ఏడు దశాబ్దాలైనా ఈ ప్రాంతం వెనుకబడే ఉంది.

ఇక్కడ వలసలను ఆపాలని ప్రయత్నం చేస్తుంటే చిల్లరమల్లర రాజకీయాలకు తెరలేపిన్రు. అట్లాంటి వాళ్లకు కురుమూర్తి సాక్షిగా సూచన చేస్తున్న.. నాకు జన్మనిచ్చిన జిల్లాలో కూడా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు. నా మీద రాజకీయంగా కోపం ఉంటే ఇంకో రకంగా రాజకీయ కక్షను సాధించండి. కానీ, అభివృద్ధికి అడ్డుపడితే ఈ జిల్లా మిమ్మల్ని క్షమించదు. మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతరు” అని హెచ్చరించారు. 

కురుమూర్తి ఆలయాన్ని అభివృద్ధి చేస్తం

తిరుపతిని దర్శించుకోవడానికి ఆర్థికంగా అవకా శం లేని వాళ్లు పేదల తిరుపతి  కురుమూర్తి క్షేత్రానికి వస్తారని సీఎం అన్నారు.ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుపతిలో వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్నట్లేనని భావిస్తారని తెలిపారు. రాష్ట్రం నుంచే కాకుండా కర్నాటక నుంచి కూడా భక్తులు ఇక్కడ జాతరకు వస్తారని,  15 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారని గుర్తుచేశారు. ‘‘ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు కురుమూర్తి స్వామి ఇలవేల్పు. కానీ, ఇక్కడ భక్తులకు సంపూర్ణ వసతులు లేవు.

చిన్న పిల్లలు, పెద్దలు, దివ్యాంగులు కురుమూర్తి గుట్టపైకి వెళ్లాలంటే మెట్లు ఎక్కడానికి కష్టం అవుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్​ రెడ్డి నా దృష్టికి తెచ్చారు. పాలమూరు బిడ్డగా ఘాట్​రోడ్డుకు రూ.110 కోట్లు మంజూరు చేశా. కురుమూర్తితో పాటు పాలమూరుకు అంచున ఉన్న మన్యంకొండ జాతరను, జిల్లాలోని ప్రముఖ దేవాలయాలను అద్భుతంగా తీర్చిదిద్దుతాం. వీటికి నిధులు మంజూరు చేసే బాధ్యత నాది.

మన్యంకొండ, కురుమూర్తి టెంపుల్​లో చేయాల్సిన డెవలప్​మెంట్​ పనులపై అంచనాలు రూపొందించాలని కలెక్టర్​ను ఆదేశిస్తున్న. ఎండోమెంట్​ డిపార్ట్​మెంట్​తో కలిసి నివేదికలను సీఎం ఆఫీసుకు పంపండి. తప్పకుండా ఆ పనులకు నిధులు మంజూరు చేస్తం” అని సీఎం స్పష్టం చేశారు. 

త్వరలో కొడంగల్​ స్కీం పనులు ప్రారంభం

‘‘సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని నెహ్రు చెప్పేవారు. ఆయన స్ఫూర్తితో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించుకున్న. ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరులో పసడి పంటలు పండాలి. పచ్చని పైర్లతో విరసిల్లాలి. అందుకే ఇక్కడి సాగునీటి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తున్న. ప్రతి నెల ఈ జిల్లా ప్రాజెక్టులపై సమీక్షలు చేసి సంబంధిత ఆఫీసర్లకు సూచనలు చేసి వాటి పూర్తికి అడుగులు వేస్తున్న. మక్తల్​, నారాయణపేట, కొడంగల్​లో కృష్ణానది పారుతున్నా సాగునీరు అందడం లేదు. అందుకే కొడంగల్ స్కీమ్​ చేపడుతున్నం.  

టెండర్లు కూడా పూర్తయినయ్​. త్వరలో పనులు స్టార్ట్​ చేస్తం” అని సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. పాలమూరు పెండింగ్​ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి గత పాలకులే కారణమని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ ఏర్పడ్డాక కూడా వలసలకు మారుపేరుగా పాలమూరు జిల్లా నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఎక్కడికిపోయినా పాలమూరు కూలీలు తట్ట, మట్టి పనులు చేస్తున్నరు. పాలమూరు కూలీలు తమ చెమటతోనే  అనేక ప్రాజెక్టులు నిర్మించారు. కానీ, కిలోమీటర్ల కొద్ది కృష్ణానది ఈ జిల్లాలో ప్రవహిస్తున్నా..

మన ప్రాజెక్టులు పూర్తికాకపోవడానికి గత పాలకులే కారణం. 2009లో కేసీఆర్​ పాలమూరు జిల్లాకు వలవ వస్తే ప్రత్యేక రాష్ట్రంలో పాలమూరు బాగుపడుతుందని ఆయనను గెలిపించినం. కానీ, ఆయన పార్లమెంట్​లో పాలమూరు గురించి మాట్లాడలేదు. పదేండ్లు  సీఎంగా ఉన్నా ఒక్క పరిశ్రమను కూడా ఇక్కడికి తీసుకురాలేదు. ఇక్కడి ప్రాజక్టులనూ పూర్తి చేయలేదు. వలసలు ఇంకా కొనసాగుతున్నయ్​. ఆయన కృతజ్ఞతను మరిచిపోయారు. కేసీఆర్​..! మీ ప్రాంతాన్ని, మీ నియోజకవర్గాలను మీరు అభివృద్ధి చేసుకున్నా.. ఏనాడూ ఇక్కడి ప్రజలు మీ మీద పడి ఏడ్వలేదు. ఇయాళ మాకు ఒక అవకాశం వచ్చింది. 12 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిండ్రు. మమ్మల్ని ఆశీర్వదించిన్రు. ఎక్కడున్నా.. ఏం పని చేస్తున్నా ఈ జిల్లాను అభివృద్ధి పరుస్త” అని ఆయన స్పష్టం చేశారు. 

పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పిస్తం

ప్రతి నిరుపేదకు మెరుగైన విద్య, వైద్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం రేవంత్​ అన్నారు. పాలమూరు యూనివర్సిటీలో లా కాలేజీ మంజూరు చేశామని తెలిపారు. ఐటీ, ఇతర పరిశ్రమలతో మాట్లాడుతున్నామని, పాలమూరు ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించి ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్చలు తీసుకుంటామని చెప్పారు. ‘‘అమరరాజా కంపెనీ తీసుకునే వేలాది మంది నిరుద్యోగులను పాలమూరు నుంచే తీసుకోవాలని చెప్పినం. ఇందుకు వారు ఒప్పుకున్నరు. యువతకు శిక్షణ ఇప్పించి అవకాశం ఇవ్వాలని యజమానులతో మాట్లాడినం. ఈ కంపెనీలో స్థానిక యువతలో రెండు వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చేటట్లు యాజమాన్యం అంగీకరించింది. అది చాలా సంతోషంగా ఉంది.

పాలమూరు జిల్లాలోని యువతకు వృత్తి  నైపుణ్య శిక్షణ ఇప్పిస్తం. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తం. కొత్త పరిశ్రమలు తీసుకొస్తం” అని ఆయన పేర్కొన్నారు. తండాలు, పల్లెలు, చిన్న కుగ్రామమైనా బీటీ రోడ్డు లేదనే మాట వినదల్చుకోలేదని.. తండాలకు కూడా బీటీ రోడ్లు వేసే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు.  కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్​రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పర్ణికారెడ్డి, తూడి మేఘారెడ్డి, ప్లానింగ్  కమిషన్  వైస్  చైర్మన్  చిన్నారెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు ఏఎంవీఐలకు నియామక పత్రాలు

హైదరాబాద్, వెలుగు : రవాణాశాఖలో ఏఎంవీఐలుగా ఉద్యోగం పొందినవారికి సోమవారం సీఎం రేవంత్, మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందజేయ నున్నారు. వీటిని ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఇవ్వనున్నారు.