హైకమాండ్ అండతో రేవంత్ జోష్. !

ఇటు తన కేబినెట్ సహచరులు, అటు పార్టీ హైకమాండ్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంపూర్ణ మద్దత్తు లభిస్తోంది. 'అధికార లేమి'తో  కొట్టుమిట్టాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు మింగుడుపడని పరిణామాలివి.  అందుకే 'ముఖ్యమంత్రి ఏకపక్ష  ధోరణిపై  కొందరు  మంత్రులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌‌‌‌ వైఖరిపై  అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. హైకమాండ్ సీఎంను పిలిచి వివరణ అడిగింది' అంటూ కొన్ని కల్పిత కథనాలను బీఆర్ఎస్ 'వంటా వార్పూ' చేస్తున్నది.  'హైడ్రా'  పేరుతో  పేదల ఇండ్లు  కూల్చివేయడంపై  తనను  ప్రశ్నించిన  మంత్రులపై సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారని, ‘అన్నీ అధిష్టానానికి చెప్పి చేయాల్నా’ అని సీఎం ధిక్కార స్వరం వినిపించారని ఆ కథనాల్లో మసాలా జోడిస్తున్నారు. 

 హైడ్రా, మూసీ వ్యవహారాలతో  కాంగ్రెస్‌‌‌‌లో చిచ్చు రేగాలని, అధికారపార్టీ అతలాకుతలం కావాలన్నది బీఆర్ఎస్ పన్నాగం. అయితే, అది నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఒక కట్టుకథను అల్లారు. సెప్టెంబర్ 20న జరిగిన కేబినెట్ సమావేశంలో కొందరు మంత్రులు రేవంత్ ను నిలదీశారని, అందుకు సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని ఆ కథ సారాంశం.  కేబినెట్ సమావేశంలో తాము కూడా కూర్చొని విన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. కానీ,  మంచో చెడో.. రేవంత్ నాయకత్వాన్ని బలపరచడమే ప్రస్తుతం తమ ముందున్న ప్రాధాన్యతగా మంత్రులు భావిస్తున్నారు.


సీఎం రేవంత్‌‌‌‌రెడ్డితో పలువురు సీనియర్‌‌‌‌ మంత్రులకు పొసగకూడదని, వారి మధ్య నిరంతరం ఘర్షణ జరగాలని బీఆర్ఎస్ కాంక్షిస్తోంది. ఇందుకుగాను వెలుపలి నుంచి నిప్పును ఎగదోసే పనికి ప్రధాన ప్రతిపక్షం పూనుకున్నట్టు కనిపిస్తోంది. బీఆర్ఎస్  తక్షణ  ఫలితాలను ఆశిస్తుండడం విడ్డూరం.  సామాన్య ప్రజల్లో  కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత రానంతవరకు బీఆర్ఎస్ ఎన్ని పన్నాగాలు పన్నినా లాభం లేదు.  ‘కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ  బంగారు బాతు లాంటిది.  దాన్ని ఒకేసారి కోసుకుతినాల‌‌‌‌ని  కాంగ్రెస్  నేత‌‌‌‌లు చూస్తున్నారు’ అని  కేటీఆర్ అన్నారు.  డ‌‌‌‌బ్బు సంచుల కోస‌‌‌‌మే మూసీ ప్రాజెక్టుకు రాహుల్ గాంధీ అనుమ‌‌‌‌తి ఇచ్చాడు.  రాహుల్ గాంధీయే హైడ్రాను న‌‌‌‌డిపిస్తున్నాడు. రాహుల్ గాంధీ పేదల ఇండ్లపైకి  బుల్డోజర్ నడిపిస్తుండు . 

హైదరాబాద్ నగరంలో బుల్డోజర్  ప్రభుత్వంతో ప్రజలు చచ్చిపోతుంటే  రాహుల్ గాంధీ ఎక్కడ? అని  కేటీఆర్ తాజాగా వ్యాఖ్యానించాడు. ఆయన వ్యాఖ్యల ద్వారా తెలంగాణ సమాజానికి అర్ధమవుతున్న సంగతి ఏమిటంటే తెలంగాణ ‘బంగారు బాతు’ అని,  ఆ బాతును కొద్దికొద్దిగా తినాలికానీ  ఒకేసారి  కోసుకుతినడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో  కేటీఆర్ కావొచ్చు మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కావొచ్చు.  వారు  ఎవరితో అంటకాగారో... హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములను  'పంటికి అందకుండా' ఎవరు మింగేశారో  తెలంగాణ ప్రజలకు తెలుసు.

రేవంత్​పై  హైకమాండ్​కు సంపూర్ణ విశ్వాసం

కొందరు మంత్రులు తమ ఢిల్లీ అధిష్టానం దృష్టికి ఇక్కడి పరిణామాలు, సమాచారం చేరవేయడం సహజం.  కాంగ్రెస్ జాతీయ పార్టీ కనుక వారికి ఆ సౌకర్యం ఉంది.  సీఎంపై అలగవచ్చు. కొన్ని నిర్ణయాల్లో సీఎంతో విభేదించవచ్చు. సీఎం వైఖరి నచ్చని పక్షంలో  హైకమాండ్ కు ఫిర్యాదు చేయవచ్చు.  ఈ వెసులుబాటు,  ప్రజాస్వామిక వాతావరణం.. కాంగ్రెస్ సహజ లక్షణాలు.  'పేరు గొప్ప, ఊరు దిబ్బ'లా  మారిన  బీఆర్ఎస్ లో  ఈ  వాతావరణం  ఒక స్వప్నం. 'సింగిల్ విండో'  పద్ధతిలో  కేసీఆర్  తన పార్టీని నడిపారు. అదే తరహాలో పాలనా సాగించారు.  కేసీఆర్,  కేటీఆర్ కు తెలియకుండా, వాళ్ళ ఆమోదం లేకుండా ఏ పనీ ముందుకుసాగేది కాదు. కేసీఆర్, కేటీఆర్ మాత్రమే  బీఆర్ఎస్ 'సింగిల్ విండో' అని సులభంగా అర్థమయ్యే సంగతి. 

 ‘అన్నీ వాళ్లను అడిగి చేయాల్నా. అన్నీ వాళ్లకు చెప్పే చేయాల్నా’ అని రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టు వచ్చిన, వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.  పైగా హైకమాండ్​కు చెప్పినతర్వాతే  సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ వర్గాలు ధృవీకరించాయి. రేవంత్ నాయకత్వం పట్ల హైకమాండ్ సంపూర్ణ విశ్వాసంతో ఉందని, పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లతో  సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో  సీఎంను చీవాట్లు పెట్టినట్టు, హెచ్చరించినట్టు కొన్ని మాధ్యమాల్లో వచ్చిన కథనాలను ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు ఖండించాయి. ‘అలాంటి సన్నివేశమేదీ జరగలేదు. బీఆర్ఎస్  లేదా ఆ పార్టీ  ప్రాయోజిత మాధ్యమాలలో  రేవంత్​ను డామేజ్ చేసే లక్ష్యంతో వార్తలు, కథనాలు సృష్టించారు’ అని ఢిల్లీలో దాదాపు రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న తెలంగాణ జర్నలిస్టు ఒకరు చెప్పారు.

సీఎం సాహసోపేత  నిర్ణయాలు

‘పదేండ్లు మీరు దోచుకున్న సొమ్ము  మీ పార్టీ ఖాతాలో  రూ.1500 కోట్లు మూలుగుతున్నాయి. అందులోంచి రూ. 500 కోట్లు మూసీ ప్రాంత  పేదలకు పంచి పెట్టండి. ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పండి. ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు.  మూసీ మురికిలో బతుకుతున్న పేదలకు ఇండ్లు ఇచ్చి,  రూ.25వేలు ఇచ్చి  వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నాం. మీ ఫామ్ హౌస్ లను కాపాడుకోవడానికే పేదల ముసుగు అడ్డం పెట్టుకుంటున్నారు.  కేటీఆర్  అక్రమంగా నిర్మించిన మీ ఫామ్ హౌస్​లు కూల్చాలా వద్దా?  సబితమ్మ  ముగ్గురు కొడుకులకు ఫామ్ హౌస్ లు ఉన్నాయి.  వాటిని కూలగొట్టాలా వద్దా? నల్లచెరువులో, మూసీ నది ఒడ్డున ప్లాట్లు చేసి అమ్మింది మీ పార్టీ నాయకులు కాదా? 20ఏండ్లు  ప్రజల్లో తిరిగాను.

 నాకు పేద ప్రజల కష్టాలు తెలుసు. మూసీని అడ్డుపెట్టుకుని ఎంతకాలం తప్పించుకుంటారు?  వందలాది గొలుసుకట్టు చెరువులు ఆక్రమణకు గురయ్యాయి.  దీంతో వరదలు వచ్చి లక్షలాది కుటుంబాలు ఆగమవుతున్నాయి. ఇప్పటికే చెరువులు, నాలాలు మూసుకుపోయాయి. ఇంకొన్నాళ్లకు మూసీ కూడా మూసుకుపోతుంది. హైదరాబాద్​నగరానికి మంచి భవిష్యత్ ను అందించేందుకే  మా చర్యలు’  అని  సీఎం రేవంత్ రెడ్డి ఒక కార్యక్రమంలో  బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. వజ్రాన్ని వజ్రంతోనే  కోయాలన్న సూత్రాన్ని యథాతథంగా అమలు చేయడానికి  రేవంత్  సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నట్టు భావించాలి.  కేసీఆర్ వలె  సొంత నిర్ణయాలు తీసుకొని పార్టీపై రుద్దే పరిస్థితి కాంగ్రెస్​లో ఉండదు.  అందువల్ల  బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలని  రేవంత్ అనుకుంటున్నారు. 

ప్రజల ప్రయోజనాలే సీఎం రేవంత్​ లక్ష్యం

హైదరాబాద్ నగరాన్ని ప్రకృతి విపత్తుల నుంచి కాపాడాలన్న ఉద్దేశంతోనే  హైడ్రా,  మూసీ  ప్రాజెక్టును తీసుకొచ్చిన విషయాన్ని పార్టీ  హైకమాండ్ కు ముందుగానే సీఎం తెలిపి, కన్విన్స్ చేశారని తెలుస్తోంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అప్రతిహత విజయాన్ని నిలువరించగల నాయకునిగా ఎన్నికలకు ముందే రాహుల్ గాంధీ గ్రహించారని, అందువల్లనే సీనియర్లను కాదని సీఎం పదవిని రేవంత్ కివ్వడం వెనుక ఆయన నాయకత్వ  ప్రతిభ ఉందని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. హైడ్రా, మూసీ నిర్ణయాలు నిజానికి  కేసీఆర్, గత బీఆర్ఎస్  ప్రభుత్వానికి సంబంధించినవే.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండు వెనుక ‘ఇక్కడి ప్రకృతి వనరులు, సహజ సంపద రక్షణ’ కూడా ప్రధానమైనవి. హైడ్రా, మూసీ పథకాలు రేవంత్ రెడ్డి ఆలోచన కాదు. వీటిని అమలుచేయడంలో విఫలమైన బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలో  పడవేసే భారీ  కార్యాచరణకు  రేవంత్ రెడ్డి  పూనుకున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థల పాదాల కింద నలిగి,  మాయమైపోయిన చెరువులు, ఇతర జలాశయాలను పునరుద్ధరించేందుకు సీఎం రేవంత్ పట్టువిడవకుండా ముందుకు వెడుతున్నారు. రాజకీయ లాభనష్టాలు చూసుకోకుండా ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీలేని వైఖరితో  రేవంత్ పరిపాలన సాగిస్తున్నారు. 

- ఎస్.కే. జకీర్