హైడ్రాకు చట్టబద్ధత.. అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు పూర్తి అధికారం

  • ఓఆర్ఆర్ లోపలున్న చెరువులు, కుంటలు, నాలాలు, రిజర్వాయర్లు, పార్క్​ల పరిరక్షణ బాధ్యతలు అప్పగింత
  • వివిధ శాఖలకు ఉన్న అధికారాలు బదలాయింపు
  • వచ్చే ఏడాది జనవరి నుంచి రేషన్​లో సన్న బియ్యం పంపిణీ
  • సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చేందుకు రూ.2,500 కోట్లు 
  • మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప​రెడ్డి, ఐఐహెచ్​టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లు
  • 8 కొత్త మెడికల్ కాలేజీల్లో 3 వేలకు పైగా టీచింగ్, నాన్ టీచింగ్​ పోస్టుల భర్తీ 
  • ఎస్ఎల్​బీసీ టన్నెల్ సవరించిన అంచనాలు రూ.4,637 కోట్లకు ఆమోదం 
  • ట్రిపుల్ ఆర్ సౌత్ అలైన్​మెంట్​ ఖరారుకు కమిటీ ఏర్పాటు
  • రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, కోమటిరెడ్డి

హైదరాబాద్, వెలుగు : హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్​ రింగ్ ​రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు, రిజర్వాయర్లు (హిమాయత్​సాగర్, ఉస్మాన్ సాగర్), పార్క్ ల పరిరక్షణ బాధ్యతలను హైడ్రాకు అప్పగించింది. వాటి ఎఫ్​టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు పూర్తి అధికారాలను అప్పగించింది. ఈ క్రమంలో వివిధ శాఖలకు ఉన్న అధికారాలు, చట్టపరమైన హక్కులను హైడ్రాకు బదలాయించేందుకు ఆమోదం తెలిపింది. 

శుక్రవారం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్​రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రివర్గ సమావేశ వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, ఉత్తమ్​కుమార్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మీడియాకు వెల్లడించారు. కేబినెట్ సమావేశంలో హైడ్రాపై కీలకంగా చర్చించినట్టు పొంగులేటి తెలిపారు. 

‘‘హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. గతంలో చెరువులు, కుంటలు, నాలాలు, రిజర్వాయర్ల ఎఫ్​టీఎల్, బఫర్​జోన్లలో అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం వివిధ శాఖలకు ఎలాంటి స్వేచ్ఛ ఉన్నదో.. అదే రకమైన స్వేచ్ఛ హైడ్రాకు ఉండేలా నియమ నిబంధనలు సడలించాం. ఇటీవల మున్సిపాలిటీల్లో విలీనమైన 51 గ్రామ పంచాయతీలతో పాటు ఓఆర్ఆర్​ లోపల కోర్ హైదరాబాద్​లో ఉన్న 27 అర్బన్, లోకల్​ బాడీల్లో హైడ్రా పని చేస్తుంది. ఇందులో 169 మంది అధికారులు, 946 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్ మీద పని చేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం” అని పొంగులేటి వెల్లడించారు.  

కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు.. 

  •     వచ్చే ఏడాది జనవరి నుంచి రేషన్​లో సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం. 
  •     ఈ వానాకాలం సీజన్​ నుంచి సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వడానికి రూ.2,500 కోట్లు మంజూరు. 
  •     ఎస్ఎల్​బీసీ టన్నెల్ సవరించిన అంచనాలు రూ.4,637 కోట్లకు ఆమోదం. 
  •     కోఠి మహిళా వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సురవరం ప్రతాప రెడ్డి, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్​ బాపూజీ పేర్లు.  
  •     కొత్తగా మంజూరైన 8 మెడికల్​ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్​కు సంబంధించి 3 వేల పైచిలుకు పోస్టులు మంజూరు. వీటిని భర్తీ చేసేందుకు వెంట నే నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం.   
  •     రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం (ట్రిపుల్ ఆర్ సౌత్) అలైన్​మెంట్ ఖరారు చేసేందుకు స్పెషల్ సీఎస్ ఆధ్వర్యంలో 12 మంది అధికారులతో కమి టీ ఏర్పాటు. ఇందులో ఆర్అండ్​బీ, మున్సిపల్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీలతో పాటు ఐదారు జిల్లాల కలెక్టర్లు, నేషనల్ హైవేస్, జియాలాజికల్ డిపార్ట్​మెంట్​అధికారులకు చోటు. 
  •     ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీసు ఆరోగ్య భద్రత స్కీమ్​ను ఎస్ పీఎల్ కింద వర్తింపజేయాలని నిర్ణయం. 
  •     తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనోహరాబాద్​లో మల్టీ మోడల్ లాజిస్టిక్​ పార్క్​ఏర్పాటుకు 72 ఎకరాలు, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఇండస్ట్రియల్​ పార్క్​ఏర్పాటుకు 58 ఎకరాల భూమి బదలాయించేందుకు ఆమోదం.  
  •     ములుగు జిల్లా ఏటూరు నాగారం ఫైర్​స్టేషన్ కు 34 మంది సిబ్బంది మంజూరు. 

1.43 కోట్ల టన్నుల ధాన్యం అంచనా : ఉత్తమ్  

ఎస్ఎల్​బీసీ టన్నెల్ పనులు ఎప్పుడు పూర్తవుతాయా? అని రెండు దశాబ్దాల నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు ఎదురుచూస్తున్నారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్​బీసీ టన్నెల్ సవరించిన అంచనాలు రూ.4,637 కోట్లకు కేబినెట్​ఆమోదం తెలిపిందని చెప్పారు. రెండేండ్లలో పనులు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీకి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. సెప్టెంబర్ 2027 కల్లా ఎస్ఎల్​బీసీ టన్నెల్, డిండి రిజర్వాయర్ పను లు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఆలస్యమైనా మూడేండ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా 

పెట్టుకున్నామని పేర్కొన్నారు. ‘‘ఈసారి 1.43 కోట్ల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నం. ఇందులో 80 లక్షల టన్నులు సన్నాలు, 50 లక్షల టన్నులు దొడ్డు వడ్లు వచ్చే చాన్స్​ ఉంది. ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు రూ.500 బోనస్​ ఇచ్చేందుకు రూ.2,500 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నాం. వచ్చే నెలలో కొత్త రేషన్​కార్డులు అందిస్తాం. వచ్చే ఏడాది జనవరి నుంచి సన్న బియ్యం ఇస్తాం” అని ఉత్తమ్​ తెలిపారు.  

గత సర్కార్​ కమీషన్లు తిన్నది: కోమటిరెడ్డి 

ఎస్ఎల్​బీసీ అవుతుందో లేదోనని అనుకున్నామని.. కానీ, ఇప్పుడు పూర్తి చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. ‘‘నల్గొండలో మిషన్ భగీరథ కోసం రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తే, అందులో రూ.4 వేల కోట్ల స్కామ్ జరిగింది. రూ.లక్ష కోట్లతో లిఫ్ట్​లు పెట్టి కమీషన్ల కోసం గత సర్కారు పనిచేస్తే.. ఇప్పుడు మేం రూ.2 వేల కోట్లు అద నంగా పెట్టి 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం. పనిచేసే ప్రభుత్వానికి, మాటలు చెప్పే ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదే. లిఫ్ట్​లు పెట్టి గత సర్కార్​ కమీషన్లు తిన్నది” అని వెంకట్​రెడ్డి అన్నారు.