బీసీల హక్కుల పరిరక్షణే లక్ష్యం

  • సమగ్ర కుటుంబ సర్వే చారిత్రాత్మకం
  • రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ 
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో బహిరంగ విచారణ 
  • వివిధ కులాల నుంచి వినతుల స్వీకరణ

నల్గొండ అర్బన్, వెలుగు : బీసీల హక్కుల పరిరక్షణ కోసమే బీసీ కమిషన్ పని చేస్తుందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు. సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య స్థితిగతులు, వెనుకబాటుతనం, కల్పించాల్సిన అవకాశాలు వంటి అంశాలపై నల్గొండ కలెక్టరేట్ లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. ఇందులో వివిధ బీసీ కుల సంఘాల నేతలు, వ్యక్తులు, సంస్థల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం చైర్మన్ నిరంజన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిర్వహిస్తోన్న సమగ్ర కుటుంబ సర్వే చారిత్రాత్మక నిర్ణయమన్నారు.  

రాష్ట్ర జనాభాలో బీసీలు ఎంతమంది ఉన్నారో తెలుస్తుందన్నారు. వెనకబడిన బలహీనవర్గాలకు అవకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఇందుకోసమే బహిరంగ విచారణ నిర్వహిస్తున్నామన్నారు. మొదటి విడతగా 5 విచారణలు పూర్తి చేశామన్నారు. జిల్లాలో నిర్వహించేది 6 వ విచారణ అని తెలిపారు. అదేవిధంగా 26 వరకు కమిషన్ బహిరంగ విచారణలు ఆయా జిల్లాల్లో కొనసాగుతాయని పేర్కొన్నారు.  బీసీలపై ఎక్కడైనా దాడులు జరిగినట్లయితే చర్య తీసుకునెందుకైనా బీసీ కమిషన్ వెనకాడదని తెలిపారు.

సర్వే పై రాజకీయ పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బహిరంగ విచారణలో విశ్వకర్మ ,బ్రాహ్మణ, పూసల, రజక, కుమ్మర, కమ్మరి ,ఉప్పర  కుల సంఘాలు, మజిలీస్, జమైతే ఇస్లాం ఇతర సంఘాలు తమ బాధలను, కోరికలను డిమాండ్లను విన్నవించినట్లు తెలిపారు. నాయీ బ్రాహ్మణులను ఆలయాలలో ఉద్యోగులుగా గుర్తించాలని, బేస్తలను బీసీ ఏ నుంచి ఎస్టీకి మార్చాలని కోరినట్లు వివరించారు. కుమ్మరులకు చెరువు మట్టిని ఉచితంగా ఇవ్వాలని ఆ సంఘాల నేతలు కమిషన్ చైర్మన్ దృష్టికి తెచ్చారు. ముదిరాజులు, కుమ్మరి, బట్రాజ్ తదితర కులాలను బీసీ డీ నుంచి ఏ కి మార్చాలని డిమాండ్ చేశారు.

రజకులను ఎస్సీలుగా గుర్తించాలని రజక సంఘ నేతలు కోరినట్లు తెలిపారు. పిచ్చకుంట్ల పేరును వంశరాజ్ గా  పిలవాలని వినతులు వచ్చినట్లు చైర్మన్ వివరించారు. వీటన్నింటిని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. బహిరంగ విచారణలో మొత్తం 82 వినతులు, సలహాలు, సూచనలు అఫిడవిట్ గా   బీసీ  కమిషన్ చైర్మన్ కు అందజేశారు. ఇంకా వినతులు సమర్పించేవారు నేరుగా, పోస్టు ద్వారాగాని పంపించాలని సూచించారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నల్గొండ, యాదాద్రి

సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, తేజస్ నందలాల్ పవర్ లు,బీసీ కమిషన్ మెంబర్లు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి మాట్లాడారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్,నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ అధికారి నిజాం అలీ, యాదాద్రి భువనగిరి ,సూర్యాపేట జిల్లా బీసీ సంక్షేమ అధికారులు అనసూయ, యాదయ్య, వివిధ శాఖల అధికారులు, ఆయా కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.