డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సెషన్స్

  • సభ ముందుకు కుల గణన వివరాలు
  • ఏడాదిలో చేసిన కార్యక్రమాలపై చర్చ
  • అదే రోజు సెక్రటేరియెట్​లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్
  • ఆలోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టే చాన్స్​

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 9వ తేదీ నుంచి  నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయింది. దాదాపు వారం, పదిరోజుల పాటు ఈ సెషన్స్​ నిర్వహించనున్నట్టు తెలిసింది. మొదటిరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించి గంటలోనే వాయిదా వేయనున్నారు. ఆ తర్వాత సెక్రటేరియేట్​ లోపల లక్ష మందితో  తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాల్లోపే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టనున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 

మహారాష్ట్ర, జార్ఖండ్​ ఎన్నికల తర్వాత కేబినేట్ విస్తరణ ఉంటుందని గతంలో సీఎం రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నెల 23న రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత  కేబినెట్​లోకి కొత్త మంత్రులను తీసుకోనున్నారు. ప్రస్తుతం సీఎంతో కలిపి 11 మంది మంత్రులు ఉన్నారు. ఇంకో ఆరుగురిని  మంత్రులుగా తీసుకునేందుకు అవకాశం ఉన్నది. ప్రభుత్వం ఏర్పడి వచ్చే డిసెంబర్​ 7వ తేదీ నాటికి ఏడాది కావొస్తున్నందున ఆలోపే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయనున్నట్టు తెలిసింది. 

ఆసరా పెన్షన్ల పెంపు!

ఏడాది పాలన పూర్తయ్యేలోపు ఆసరా పెన్షన్ల పెంపు, రైతు భరోసా పథకాలు మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కుల గణన సర్వే వివరాలను ప్రకటించనున్నట్టు తెలుస్తున్నది. అప్పటికే కుల గణన సర్వే పూర్తయి నివేదిక రావడంతోపాటు బీసీ డెడికేటెడ్​ కమిషన్​ రిపోర్ట్​ కూడా ఇచ్చే అవకాశం ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపును కూడా అసెంబ్లీలోనే వెల్లడించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. 

రికార్డ్స్​ ఆఫ్ రైట్స్​ (ఆర్ఓఆర్​–2024) బిల్లును శాసనసభ ఆమోదించనున్నది. హైడ్రా, ఓఆర్ఆర్​ దగ్గరలోని గ్రామాలు ఆయా మున్సిపాలిటీల్లో విలీనం వంటి వాటిపై అసెంబ్లీలో చర్చించి, ఆమోదించనున్నారు. ఇప్పటికే వీటికి ప్రభుత్వం ఆర్డినెన్స్​ జారీ చేసింది. ప్రజా విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ఏడాదిలో చేసినవన్నీ కూడా  అసెంబ్లీలో ప్రకటన చేసి, చర్చించనున్నది.