TGPSC గ్రూప్స్ సోషియాలజీ స్సెషల్ : తెలంగాణలో కనుమరుగైన కళలు

బుర్రకథలు

జంగం కథలు

ఈ కథలను అధికంగా జంగాలే చెప్పడంతో వీటికి జంగం కథలనే పేరు వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా బుడగ జంగాలు ఈ కథలను చెబుతుంటారు. జంగాలందరూ శైవభక్తులు కావడంతో శైవ, వైష్ణవ మతాల మధ్య వచ్చిన సంఘర్షణ కాలంలో శైవమత ప్రచారానికి ఈ కథలను విరివిగా ఉపయోగించారు. బుడగ జంగాలకు ఆ పేరు రావడానికి కారణం వారు కథలో ఉపయోగించే వాయిద్యానికి బుడిగె  అని పేరు. బుడిగె వాయిద్యంతోనే వారికి బుడగ జంగాల అనే పేరు వచ్చింది. ఈ బుడిగెకే డక్కీ, డిక్కీ, గుమ్మెట అనే పేర్లు ఉన్నాయి. 

బుడిగెలను సాధారణంగా ఇత్తడి లేదా కంచుతో చేస్తారు. బుడగ జంగాలు మొదట శైవ కథలను ప్రచారం చేసినా తర్వాత ఇతర కథలైన దేశింగురాజు కథ, సిరియాళ, వామన విజయం, మొదలైన వాటిని ప్రచారంలోకి తెచ్చారు. ఈ కథల ప్రదర్శనలో కథకునికి తంబూర, మూడు అందెలు, కాళ్లకు గజ్జెలు, వంత పాడేవారికి రెండు గుమ్మెట్లు, ముగ్గురికి మూడు గౌనులు, మూడు తలరుమాలు ఉంటే కథ విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. కాకతీయుల కాలం నాటికే ఈ జంగం కథలు బహుళ ప్రచారంలో ఉన్నట్లు వినుకొండ వల్లభామాత్యుడు రచించిన క్రీడాభిరామం అనే గ్రంథం ద్వారా తెలుస్తున్నది. 

అసాది కథ

అసాది అనేవారు మాదిగల్లో ఒక తెగ. వీరు ఎల్లమకథను గానం చేస్తారు. జవికి, చేడిక తదితర వాయిద్యాలు వాయిస్తారు. 

చిందు యక్షగానం

యక్షగానంలో ఒక విధమైన పరిశోధనా వైవిధ్యం గల కళారూపం చిందు యక్షగానం. చిందు అనే కులం వారు  చిందు యక్షగానం ప్రదర్శిస్తారు. చిందు అంటే అడుగు. అడుగులు వేసే పద్ధతిలో ప్రత్యేక వైవిధ్యం గల యక్షగానమే చిందు యక్షగానం. చిందు యక్షగానంలో సాధారణంగా చెప్పే కథలు ఎల్లమ్మ చరిత్ర, లవకుశ, విప్రనారాయణ. ఎల్లమ్మ పాత్ర ధరించి ఆ పాత్రకు వన్నె తెచ్చిన కళాకారిణి చిందు ఎల్లమ్మ. 

జముకల కథ

జముకు అనేది ఒక వాయిద్య పరికరం. ఈ పరికరం సహాయంతో కథను చెప్పడం వల్ల దీనికి జముకుల కథ అనే పేరు వచ్చింది. ఈ కథలను సామాన్యంగా పంబలవారు లేదా బైండ్లవారు చెబుతారు. ఇందులో అనేక రకాలైన సంగీతపు రీతులు ఉంటాయి. అందులో మధ్యవ్యక్తి కథకుడైతే, వంతదారుల్లో ఒకరు హాస్యం, మరొకరు వ్యాఖ్యానం చేసతారు. వేషధారణలో కథకుడు, నల్లకోటు, తెల్లకట్టు పంచె, తలకు రుమాలు చుట్టి చక్కగా నృత్యం చేస్తూ కలియ తిరుగుతాడు. జముకు అనే వాయిద్యానికి జమలిక, జమిడిక అనే పేర్లు ఉన్నాయి. ఈ వాయిద్యం కుంచం ఆకారంలో ఉంటుంది. 

శారద కథలు

ఓ భారతీ, కరుణామతీ, భళి శారదా కరుణానిధీ అనే వంతపాట పాడటంతో వీరికి శారదకాండ్రు అనే పేరు వచ్చి ఉండవచ్చు. వీరు వాయించే తంబూర పేరు శారద. ఈ వాయిద్యాన్ని వాయిస్తూ పాడే పాట శారదకథ. శారద గాయకులు తెలంగాణ సాయుధ పోరాట యోధులైన రేణిగుంట రామిరెడ్డి, చింతలాపురి రామిరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి వీరోచిత పోరాటాలను కథలుగా మలిచారు.ఇందులో రేణిగుంట పోరాటం అనే శారద కథను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 

తెలంగాణలో ప్రచారంలో ఉన్న ప్రసిద్ధ వీర కథలైన సదాశివరెడ్డి, సర్వాయి పాపన్న కథలను అద్భుతంగా పాడి వినిపిస్తారు. అలాగే పల్నాటి వీరచరిత్ర, బాల నాగమ్మ, బొబ్బిలి యుద్ధం కథలను చెబుతుంతారు. వీరు ఎక్కువగా వరంగల్​, నల్లగొండ జిల్లాల్లో ఉంటారు. శారదకాండ్రులు శైవ మతానికి చెందినవారు. వీరు ఎల్లమ్మ, పోచమ్మ దేవతలను పూజిస్తారు.

యక్షాగానం

యక్షగాన ప్రదర్శనలో విశేషమేమిటంటే ప్రదర్శనలో వచ్చే ప్రతిపాత్ర తన గురించి తాను చెప్పుకోవడంతో కథ నడుస్తుంది. ఇది సంగీత, సాహిత్య, నాట్యకళలతో మేళవించిన సమాహార కళ. దీనిని తెలంగాణలో వీధి బాగోతం లేదా వీధి భాగవతం అంటారు. తెలంగాణ యక్షగాన పితామహుడు చెర్విరాల భాగయ్య కవి. ఈయన 50కి పైగా యక్షగానాలు రాశాడు. 

కానీ, ప్రస్తుతం 32 మాత్రమే లభిస్తున్నాయి. ఈయన రచనల్లో కాంతామతి చరిత్ర, కనకతార, అల్లీరాణి, మాయాసుభద్ర, రంభరంపాల చరిత్ర ముఖ్యమైనవి. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో సుద్దాల హనుమంతు, సుద్దాల అశోక్​తేజ వీర తెలంగాణ అనే యక్షగానాన్ని రచించారు. యక్షగానంపై పరిశోధన చేసిన వారిలో ముఖ్యులు ఎస్​వీ జోగారావు, పొద్దుటూరి ఎల్లారెడ్డి, కృష్ణ కౌండిన్య.

ఒగ్గు కథ

ఒగ్గు అనే వాయిద్యంతో కథ చెప్పే కళారూపమే ఒగ్గు కథ. ఒగ్గు అనే వాయిద్యం శివుడి ఢమరుకాన్ని పోలి ఉంటుంది. ఈ కథ తెలంగాణ ప్రాంతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఒగ్గు కథలో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఇందులో ముగ్గురు పలు రకాల వాయిద్యాలు వాయిస్తారు. ఒక పెద్ద డోలు, తాళాలు, ఒగ్గు ప్రధాన వాయిద్యాలుగా ఉంటాయి. 

తెలంగాణ ప్రాంతంలో అధికంగా నల్లగొండ, వరంగల్​ జిల్లాల్లో ఒగ్గు కథ చెప్పేవారు ఉన్నారు. ఒగ్గు కథలు సామాన్యంగా గొల్ల, కురమలే కాకుండా ఇతర బీసీ కులాల వారు కూడా చెబుతుంటారు. వీరు అధికంగా చెప్పే కథల్లో బీరప్ప కథ, మల్లన్న కథ, నల్లపోచమ్మ కథ, మాందాత కథ, ఎల్లమ్మ కథ, కాటమరాజు కథ ముఖ్యమైనవి.  సాధారణంగా కథకుడు తలకు రుమాలు చుట్టుకొని, కాళ్లకు గజ్జెలు కట్టుకొని కథ చెబుతుంటే పక్కన ఉన్న వాయిద్యకారులు లయబద్దంగా వాయిద్యాలను వాయిస్తూ ఉంటారు. జాతీయ స్థాయిలో ఒగ్గుకథకు ప్రాచుర్యం తెచ్చిన వారిలో మిద్దె రాములు, చుక్క సత్తయ్య ముఖ్యమైనవారు.