పదేండ్లలో మేం వాడుకున్నది 23 శాతం నీళ్లే.. ఏపీ వాడింది 76.65 శాతం

 

  • కృష్ణా ట్రిబ్యునల్​ ముందు తెలంగాణ అడ్వొకేట్ ​వాదన
  •  2015లో జరిగిన ఒప్పందం ఒక్క ఏడాదికి మాత్రమే
  • ఇన్సైడ్ బేసిన్క ప్రాధాన్యం ఇవ్వాలి కదా?
  •  గోదావరి నుంచి డెల్టాకు ఏపీ తీసుకెళ్తున్న జలాలను ఎందుకు లెక్కలోకి తీసుకోలేదని ప్రశ్న
  •  ఏపీ తరఫు సాక్షి ఏకే గోయల్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన అడ్వొకేట్

హైదరాబాద్​, వెలుగు:  కృష్ణా జలాల్లో ట్రిబ్యునళ్లు కేటాయించిన వాటాలో తెలంగాణ అతి తక్కువ వినియోగించుకున్నదని కృష్ణా వాటర్​డిస్ప్యూట్స్​ట్రిబ్యునల్​2 (కేడబ్ల్యూడీటీ 2– బ్రజేశ్​కుమార్​ట్రిబ్యునల్) ముందు తెలంగాణ తరఫు అడ్వొకేట్​సీఎస్ వైద్యనాథన్​ వాదించారు. గంపగుత్త కేటాయింపులైన 811 టీఎంసీల్లో తెలంగాణ ఈ పదేండ్లలో సగటున కేవలం 23.35 శాతం జలాలనే వాడుకున్నదని, అదే ఏపీ 76.65 శాతం నీటిని తరలించుకుపోయిందని వివరించారు. అయితే, ఈ విషయం తనకు తెలియదని ఏపీ తరఫు సాక్షి అనిల్ కుమార్ గోయల్​(ఏకే గోయల్) చెప్పారు. 2015లో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం కేవలం ఆ ఒక్క ఏడాదికేనని, మరి ఈ పదేండ్లలో ఏపీ ఎన్ని నీళ్లు తరలించుకుపోయిందో తెలుసా? అని అడ్వొకేట్​ప్రశ్నించగా.. ఏకే గోయల్ తెలియదన్నారు. గురువారం ట్రిబ్యునల్​లో ఏకే​గోయల్​ను తెలంగాణ అడ్వొకేట్​సీఎస్​ వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్​చేశారు. వరద లోటు ఉన్న బేసిన్​లో ఔట్​సైడ్​బేసిన్​కు కాకుండా ఇన్​సైడ్​ బేసిన్​కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్న విషయం తెలుసా? అని అడ్వొకేట్​ప్రశ్నించారు. అయితే, అన్ని సందర్బాల్లోనూ అలా చూడాల్సిన అవసరం లేదని ఏకే గోయల్​చెప్పారు. నేషనల్​ వాటర్​పాలసీ 2012లోనూ అలాంటి రూలేమీ లేదని చెప్పారు. 2016లో కేంద్ర జలశక్తి శాఖ ఇంటిగ్రేటెడ్​వాటర్​రీసోర్సెస్​డెవలప్​మెంట్​మేనేజ్​మెంట్​పై గైడ్​లైన్స్​ తయారు చేసిన విషయం తెలుసా? అని అడ్వొకేట్​ ప్రశ్నించగా.. తెలుసని, అయితే అందులో ఏముందో పూర్తిగా తెలియదని గోయల్​చెప్పారు.

మీ ఆపరేషనల్ ప్రొటోకాల్​ తప్పా?

ఆపరేషనల్​ప్రొటోకాల్​లో కేవలం శ్రీశైలం, నాగార్జునసాగర్​కే పరిమితమయ్యారని, ఎగువన తీసుకున్న నీటిని పరిగణనలోకి తీసుకోలేదని, అలాంటప్పుడు ఆ ఆపరేషనల్​ ప్రొటోకాల్​తప్పుగా తయారు చేశారా అని తెలంగాణ అడ్వొకేట్​ప్రశ్నించారు. ఎగువన అనుమతించిన నీటిని తీసుకున్న తర్వాతే శ్రీశైలం, నాగార్జునసాగర్​ప్రాజెక్టులకు వచ్చే వరద ఆధారంగా కేటాయింపులుంటాయని ఏకే గోయల్​తెలిపారు. 65 శాతం డిపెండబిలిటీ ఆధారంగా జూరాలకు 9 టీఎంసీలు, ఆర్డీఎస్​స్కీమ్​కు 4 టీఎంసీల చొప్పున నీటి కేటాయింపులున్నాయని, వాటిని శ్రీశైలం/నాగార్జునసాగర్​ ప్రాజెక్టులకు 30 టీఎంసీల క్యారీ ఓవర్ స్టోరేజీని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ట్రిబ్యునళ్లు కేటాయింపులు చేశాయన్నారు. ఏపీ చేపట్టిన చింతలపూడి లిఫ్ట్​ఇరిగేషన్​ను పరిగణనలోకి తీసుకున్నారా? ఆ స్కీమ్​ ద్వారా 2.8 లక్షల ఎకరాలకు ఏపీ నీళ్లను తరలించాలనుకుంది కదా? అని తెలంగాణ అడ్వొకేట్ ప్రశ్నించగా.. దాన్ని తాను పరిగణనలోకి తీసుకోలేదని, కేవలం కృష్ణా ట్రిబ్యునళ్ల పరిధిలోని ప్రాజెక్టులు, 2015లో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ఆధారంగానే ఆపరేషనల్​ప్రొటోకాల్​ తయారు చేశానని వివరించారు. సాగర్​కుడి కాల్వ కింద ఆయకట్టు కోసం ఏపీ చేపట్టిన వైఎస్సార్​పల్నాడు డ్రాట్​ఇరిగేషన్ ప్రాజెక్ట్​ గురించి తెలుసా అని ప్రశ్నించగా.. తెలియదని బదులిచ్చారు.