Dasara Special 2024: తెలంగాణలో పండుగంటేనే దసరా.. ఎందుకో తెలుసా..?

పెద్ద పండుగొస్తే ఊరు ఊరంతా జోష్ ఉంటుంది. మనుషులు ఆ పండుగవరకు అన్ని కష్టాలను మరచిపోయి సంతోషంగా ఉంటారు. మన తెలంగాణలో అట్లాంటి పెద్ద పండుగంటే దసరా.పిల్లల దగ్గర్నించి పెద్దల వరకు అందరూ కొత్త బట్టలేసుకొని, గుడికి పోయి, అంతా బాగుండాలని దేవునికి మొక్కుకొని, జమ్మి చెట్టు దగ్గరికి పోయి జమ్మి ఆకులు తెంపుకొచ్చి, అందరికీ పంచి అలయ్ బలయ్' ఇచ్చి, ఇష్టమైన వంటలు చేసుకొని తిని, ఇల్లంతా ఒక కళను తెచ్చిపెట్టుకుంటారు కదా..  అది దసరా పండుగ, అది పెద్ద పండుగ. 

తెలంగాణలో దసరా పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తీరొక్క పూలతో బతకమ్మలు పేర్చి..  మహిళలంతా ఒక చోట చేరి పాటలు పాడుతూ.. కోలాటం ఆడుతూ.. సందడి చేస్తారు. ఏ మతానికి సంబంధించిన పండుగైనా ఆ పండుగల్లో దైవం, మతంతో సంబంధం ఉన్న ఒక కథ ఉంటుంది. అలాగే మనుషులు, ప్రాంతాలకు సంబంధించిన ఒక కల్చర్, లైఫ్ ఉంటుంది. అలాంటి కనెక్షన్ ఒక్కొక్కరికి ఒక్కో పండుగలో దొరుకుతుంది. ఆంధ్రాకి వెళ్తే 'సంక్రాంతి' పెద్ద పండుగ. నార్త్ ఇండియాలో 'దీపావళి'ని బాగా సెలబ్రేట్ చేస్తుంటారు. కేరళలో 'ఓనమ్', తమిళనాడులో 'పొంగల్", పశ్చిమ బెంగాల్లో 'దుర్గా పూజ' ఇలా మన దేశంలోనే ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో పండుగతో గుర్తించొచ్చు. తెలంగాణలో తొమ్మిదిరోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాలు, ఆ ఉత్సవాల సమయంలోనే వచ్చే బతుకమ్మ. ఆ తర్వాత దశమి రోజున వచ్చే దసరా... ఈ పది రోజులూ పండుగ వాతావరణమే ఉంటుంది. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ వరకు ఆడవాళ్ల వెనక ఉండే వాళ్ల సంబరానికి అందనిచ్చే మగవాళ్లు దసరా రోజుకి వచ్చేసరికి తమ సంబరంలో పడిపోతారు. 

మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో దేశంలో ఎక్కడైనా పండుగలు, పుట్టినరోజులకే కొత్త బట్టలు కొంటారు. అలాంటి ఒక పెద్ద పండుగ తెలంగాణలో ఎక్కువమందికి దసరానే. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలో వచ్చే  ఈ పండుగ సమయంలో ఊరంతా సంబరాలే కనిపిస్తాయి. విజయ దశమికి తెలంగాణలో అమ్మవారికి నవరాత్రి పూజలు ఉంటాయి. శ్రీ రాముడికి పండుగ రోజు ప్రత్యేక పూజలూ ఉంటాయి. పేదరికం, కష్టాలు, కన్నీళ్లు అన్నీ మరచిపోయి అందరూ ఒక సెలబ్రేషన్లో చేసుకుంటారు కాబట్టే.. దసరా అంత స్పెషల్. తెలంగాణలో దసరా అనే మాటను సెలబ్రేషన్స్​  అనే పదానికి అర్థంగా చెప్పుకోవచ్చు.  కాబట్టే  ఇది తెలంగాణలో పెద్ద పండుగ. . . 

–వెలుగు, దసరా ప్రత్యేకం–